పార్లమెంటు
శీతాకాల సమావేశాల్లో అతిపెద్ద భద్రతా వైఫల్యం బయటపడింది. పార్లమెంటు పై పాకిస్తాన్
ప్రేరిపిత ముష్కరులు దాడి చేసి నేటికి సరిగ్గా 22 ఏళ్ళు అవుతున్న వేళ మరోసారి
ఇంచుమించు అలాంటి భద్రతా లోపమే పునరావృతమైంది.
జీరో
అవర్ సందర్భంగా సభ్యులు మాట్లాడుతుండగా ఇద్దరు వ్యక్తులు, సందర్శకుల గ్యాలరీ నుంచి
సభా హాలులోకి దూకారు. అందులో ఓ వ్యక్తి ఒక రకమైన పొగను తనతో పాటు తెచ్చుకున్న క్యాన్
ద్వారా వదిలారు. సభ్యుల బెంచీలపై గెంతుతూ
‘నియంతృత్వ పాలన వద్దు’ అంటూ నినాదాలు చేశాడు. మరో వ్యక్తి సభలో ప్రవేశించి అలజడి
సృష్టించాడు.
అనుకోని
ఘటనతో షాకైన లోక్సభ సభ్యులు, వెంటనే తేరుకుని దుండగులను చుట్టుముట్టి బంధించారు.
భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమై సదరు దుండగులును అదుపులోకి తీసుకుని పోలీసులకు
అప్పగించారు.
గందరగోళాన్ని గ్రహించిన స్పీకర్ సభను వాయిదా వేశారు. అదే సమయంలో
పార్లమెంటు బయట కూడా ఇద్దరు వ్యక్తులు
ఆందోళనకు దిగారు. పసుపురంగు పొగను వదులుతూ రాజ్యాంగాన్ని కాపాడాలని, ‘నియంతృత్వ
వద్దు, జై భీమ్, భారతమాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులోని మహిళ
నీలంకౌర్(42) హర్యానా చెందిన వ్యక్తిగా పోలీసులు తేల్చారు. మరో వ్యక్తి అమోల్ షిండే(25) మహారాష్ట్రకు
నివాసిగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
పార్లమెంటు లోపల దాడికి పాల్పడిన ఇద్దరు
ఆగంతకుల పేర్లు సాగర్ శర్మ, మనోరంజన్ అని పోలీసులు తేల్చారు. వీరిని అదుపులోకి
తీసుకున్న దిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు, దాడి చేయడానికి
కారణాలపై ఆరా తీస్తున్నారు.
పరిస్థితి సద్దుమణిగిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా
అధ్యక్షనత సభా ప్రారంభమైంది. ఘటన గురించి సభ్యులకు వివరణ ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా,
ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని తానే పూర్తి బాధ్యత తీసుకుంటానని సభకు హామీ
ఇచ్చారు.
భద్రత పై ఎంపీలు లేవనెత్తిన ఆందోళనకు ఆయన సమాధానమిచ్చారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సభ
సజావుగా నిర్వహించడం సభ్యులందరి బాధ్యత అంటూ హితోక్తి పలికి స్పీకర్, నిందితులు
వదిలిన పొగ సాదారణమైనదేనని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. సమగ్ర దర్యాప్తు
జరుగుతుందని విచారణలో అన్ని విషయాలు తేలతాయని సభ్యులను సముదాయించారు. విజిటర్స్ పాసుల
జారీని రద్దు చేసినట్లు ప్రకటించారు. ఘటన గురించి చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం
నిర్వహిస్తున్నట్లు వివరించారు.