Security breach in Lok
Sabha, tear gas leaked
పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసి
22ఏళ్ళు గడిచిన ఈరోజే, లోక్‌సభలో భద్రతా ఉల్లంఘన ఘటన చోటు చేసుకుంది. విజిటర్స్
గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు లోక్‌సభ ఛాంబర్లోకి దూకారు. తాము తీసుకొచ్చిన
క్యాన్స్లోనుంచి పసుపురంగు వాయువును సభలో వదిలారు.
మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ సంఘటన
జరిగింది. ఆ సమయంలో బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ సభ నిర్వహిస్తున్నారు. ఎంపీలు ప్రజాప్రాధాన్యత
కలిగిన అత్యవసర అంశాలను ప్రస్తావిస్తున్నారు. బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతున్నారు.
మొదట ఒక వ్యక్తి విజిటర్స్ గ్యాలరీ లోనుంచి లోక్‌సభ ఛాంబర్లోకి దూకాడు. దాన్ని
చూసిన ఎంపీలు ఎవరో సందర్శకుడు ప్రమాదవశాత్తు పైనుంచి పడిపోయాడని భావించారు. అంతలో
మరో వ్యక్తి కూడా దూకాడు.
‘‘ఆ ఇద్దరు కుర్రవాళ్ళ వయసు సుమారు 20ఏళ్ళుంటుంది.
వారి చేతుల్లో క్యాన్లు ఉన్నాయి. వాటిలోనుంచి పసుపుపచ్చ రంగు వాయువు వస్తోంది. వారిలో
ఒక వ్యక్తి స్పీకర్ చైర్ వైపు పరుగెత్తాడు. వాళ్ళు ఏవో నినాదాలు చేస్తున్నారు. ఆ
వాయువు విషవాయువు కూడా అయి ఉండే అవకాశం ఉంది’’ అని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం
చెప్పారు.
ఈ ఘటన పూర్తి భద్రతా వైఫల్యమని సమాజ్‌వాదీ
పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ అన్నారు. ‘‘వచ్చినవాళ్ళు సందర్శకులో లేక విలేకరులో,
ఎవరైనా కానీయండి, వాళ్ళకు ట్యాగ్లు లేవు. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమే.
ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
లోక్‌సభలోకి చొరబడిన ఆ ఇద్దరినీ
బంధించినట్లు కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధరి స్పష్టం చేసారు. ‘‘ఆ ఇద్దరినీ
ఎంపీలు పట్టుకున్నారు. అంతలో భద్రతా సిబ్బంది వచ్చారు. చొరబడినవారిని
భద్రతాసిబ్బంది బైటకు తీసుకొచ్చారు. సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా
వేసారు’’ అని వివరించారు.
2గంటలకు సభ మళ్ళీ మొదలైంది. లోక్‌సభ
స్పీకర్ ఓంబిర్లా క్లుప్తంగా ప్రకటన చేసారు. ‘‘ఈ సంఘటనపై దర్యాప్తు
జరిపిస్తున్నాం. ఢిల్లీ పోలీసులను కూడా దర్యాప్తులో భాగం కావాలని అడిగాం’’ అని ఓం
బిర్లా చెప్పారు.
పార్లమెంటు బైట మరో ఇద్దరు వ్యక్తులు
కూడా క్యానిస్టర్ల నుంచి వాయువులు విడుదల సారు. ఒక పురుషుడు, ఒక స్త్రీ లీక్ చేసిన క్యాన్లలోనుంచి ఎరుపు, పసుపు
రంగుల్లో వాయువులు విడుదలయ్యాయి. ఆ ఇద్దరినీ భద్రతా సిబ్బంది అదుపులోకి
తీసుకున్నారు. వారిని అమోల్ షిండే (25), నీలమ్ (42)గా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటన జరగడానికి
కొద్దిసేపటి ముందే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…
2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో అమరులైన వారికి నివాళులర్పించారు.