తిరుమల
తిరుపతి దేవస్థానం(TTD) నిధులను తిరుపతి కార్పొరేషన్ పరిధిలో
పారిశుద్ధ్య పనుల కోసం ఖర్చు చేయడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం
చేసింది. టీటీడీ నిధులు తిరుపతి కార్పొరేషన్ కు మళ్ళిస్తున్నారంటూ బీజేపీ నేత
భానుప్రకాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు, నిధులు విడుదల
చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
దేవాదాయ
చట్టం సెక్షన్ 111కు విరుద్ధంగా నిధులు మళ్ళిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది
వాదించారు. గతంలో ఎప్పుడు ఈ తరహాలో దేవుడి సొమ్మును మళ్ళించలేదని వాదించారు.
పిటినర్
తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం, నిధులు విడుదల నిలిపివేయాలని టీటీడీని
ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపవద్దని
తేల్చి చెప్పింది. టెండర్ ప్రక్రియను కొనసాగించవచ్చు అని స్పష్టం చేసింది.
రెండువారాలు
లోగా కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీ, తిరుపతి కార్పొరేషన్ ను ఆదేశించిన హైకోర్టు,
విచారణను రెండువారాలకు వాయిదా వేసింది.
తిరుమల
తిరుపతి దేవస్థానం బడ్జెట్ నుంచి తిరుపతి అభివృద్ధికి ఏటా ఒక్క శాతం నిధులు ఖర్చు
చేసేందుకు పాలకమండలి తీర్మానించింది. అయితే టీటీడీ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం
తిరస్కరించింది.