మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ దుబాయ్‌లో
పట్టివేత
Mahadev betting app promoter detained in
Dubai
మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఇద్దరు ప్రమోటర్స్‌లో
ఒకరైన రవి ఉప్పల్ దుబాయ్‌లో దొరికాడు. భారతదేశపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజ్ఞప్తి
మేరకు యాప్ ప్రమోటర్స్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. దాని
ఆధారంగా రవి ఉప్పల్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని త్వరలోనే
భారతదేశానికి తరలిస్తారని తెలుస్తోంది.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ రోజుకు దాదాపు
200కోట్ల లాభాలు ఆర్జిస్తోందని సమాచారం. ఈ యాప్ నిర్వహణలో పలు లోపాలు, చట్ట
ఉల్లంఘనలూ ఉన్నాయి. అంతేకాదు, యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి
భూపేష్ బఘేల్‌కు 508 కోట్లు చెల్లించారని ఈడీకి అసీమ్దాస్ అనే ఒక కొరియర్ సమాచారం
ఇచ్చాడు. ఆ విషయం గత నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాజకీయ ప్రకంపనలు
సృష్టించింది. అయితే ఆ కొరియర్, కోర్టులో మాట మార్చాడు. తాను ఏ రాజకీయవేత్తకూ డబ్బులు
చేరవేయలేదనీ, తనను కుట్రలో ఇరికించారనీ ఆరోపించాడు.
ప్రమోటర్ రవి ఉప్పల్ కోసం జరిపిన
దర్యాప్తులో ఈడీ, అతనికి భారత పాస్‌పోర్ట్‌తో పాటు వనౌతు అనే చిన్న దేశపు పాస్‌పోర్ట్
కూడా ఉందని కనుగొంది. ఆ పాస్‌పోర్ట్‌తోనే రవి ప్రపంచమంతా తిరుగుతున్నాడని
గ్రహించింది.
మహాదేవ్ యాప్ మరో ప్రమోటర్ సౌరభ్
చంద్రాకర్ ఇంకా దొరకలేదు, అతనికోసం ఈడీ అన్వేషణ కొనసాగుతోంది. ఈ యేడాది ఫిబ్రవరిలో
సౌరభ్ పెళ్ళి దుబాయ్‌లో జరిగింది. దానికి 200 కోట్లు ఖర్చుపెట్టాడు. ఆ పెళ్ళికి
పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.
రవి ఉప్పల్, సౌరభ్ చంద్రాకర్ ఇద్దరూ ఛత్తీస్‌గఢ్‌లోని
భిలాయ్ నగరానికి చెందినవారు. కానీ యాప్‌ను మాత్రం దుబాయ్ నుంచి నడిపిస్తున్నారు.
ఈ యాప్‌కు అనుబంధంగా మరిన్ని బెట్టింగ్ యాప్‌లు కూడా నిర్వహిస్తున్నారు. వాటికి
అవసరమైన కాల్ సెంటర్స్‌ని భారత్, మలేసియా, థాయ్‌లాండ్, యూఏఈ నుంచి
నడిపిస్తున్నారు. భారతదేశంలో ఛత్తీస్‌గఢ్ సహా పలు ప్రాంతాల్లో సుమారు 30 కాల్
సెంటర్స్ ఉన్నాయి.
యాప్ నిర్వాహకులైన రవి ఉప్పల్, సౌరభ్
చంద్రాకర్లకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు, బ్యురోక్రాట్లు, రాజకీయ నాయకులతో సన్నిహిత
సంబంధాలున్నాయని ఈడీ కనుగొంది. తమ యాప్‌లపై ఎలాంటి దర్యాప్తూ జరగకుండా ఉండేందుకు వారికి
క్రమం తప్పకుండా భారీ మొత్తాలు చెల్లిస్తూ ఉంటారని ఈడీ వివరించింది.
ఈ కేసులో ఈడీ ఇప్పటికి సునీల్ దమానీ,
అనిల్ దమానీ, ఏఎస్సై చంద్రభూషణ్ వర్మ, ఒక కానిస్టేబుల్, సతీష్ చంద్రాకర్ అనే ఆరుగురిని
అరెస్ట్ చేసింది.