Mohan Yadav takes oath
as MP CM, PM Modi at ceremony
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ఇవాళ
ప్రమాణస్వీకారం చేసారు. భోపాల్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి
నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.
రాష్ట్ర గవర్నర్ మంగూభాయ్ పటేల్ కొత్త
ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించారు. మోహన్ యాదవ్‌తో పాటు ఉపముఖ్యమంత్రులు
రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవ్దా కూడా ప్రమాణ స్వీకారం చేసారు.
మోహన్ యాదవ్ ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ
ఎన్నికల్లో ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. రాష్ట్రీయ
స్వయంసేవక్ సంఘ్‌కు సన్నిహితుడని మోహన్ యాదవ్‌కు పేరుంది. ఆయన ఓబీసీ
సామాజికవర్గానికి చెందినవారు. మధ్యప్రదేశ్ జనాభాలో 48శాతం ఓబీసీలే ఉన్నారు.
58ఏళ్ళ మోహన్ యాదవ్ 2013లో తొలిసారి
ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో మళ్ళీ
అక్కడినుంచే విజయం సాధించారు. గత శివరాజ్
సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసారు.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం రాజకీయ
విశ్లేషకులకు ఆశ్చర్యంగా మిగిలింది. సుమారు రెండు దశాబ్దాల శివరాజ్ సింగ్ పాలన
తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందనీ, బీజేపీ గెలిచే అవకాశాలు లేవనీ అంచనాలు
వేసారు. కానీ వారందరి విశ్లేషణలూ తప్పయ్యాయి. 230 నియోజకవర్గాల మధ్యప్రదేశ్
శాసనసభలో బీజేపీ 163 స్థానాలు గెలుచుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ను 66 స్థానాలకే
పరిమితం చేసింది.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్
యాదవ్‌ను బీజేపీ ఎంపిక చేయడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. మరికొద్ది నెలల్లో
జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో
గెలిచిన మూడు రాష్ట్రాల్లోనూ ముగ్గురు కొత్తముఖాలను బీజేపీ గద్దెనెక్కించిందని భావిస్తున్నారు.