Officials attacked on devotees
at Srirangam temple
హిందూ దేవాలయాల్లో డీఎంకే ప్రభుత్వ అధికారుల
ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా శ్రీరంగం దేవాలయంలో దర్శనానికి వచ్చిన భక్తులను
రక్తమోడేలా చితగ్గొట్టిన ఘటన చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు
40మంది అయ్యప్ప భక్తుల బృందం పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా శ్రీరంగం దేవాలయానికి
వెళ్ళారు. రంగనాథస్వామి దర్శనం చేసుకునే సమయంలో వారు గోవిందా గోవిందా అంటూ భక్తిపారవశ్యంలో
నినాదాలు చేసారు. అది ఆ గుడిలో ఉన్న దేవదాయ శాఖ అధికారులకు నచ్చలేదు. బిగ్గరగా
నామజపం చేయవద్దంటూ భక్తులపై విరుచుకుపడ్డారు. భక్తులు ప్రతిఘటించగా వారిపై, ఆలయ
అధికారుల ఆదేశాలతో గార్డులు భౌతిక దాడులకు పాల్పడ్డారు. కొందరు భక్తులకు
రక్తమోడేలా గాయాలయ్యాయి.
ఆలయ కార్యకర్త రంగరాజన్ నరసింహన్ ఆ దాడులకు
సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. భక్తులు గాయపడడం, గర్భగుడిలో
వారి రక్తం చిందడం ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. చెన్నారావు అనే భక్తుడికి
ముక్కుదూలం విరిగింది. అతని రక్తమే ఆలయం గచ్చుమీద చిందింది. భక్తులతో గొడవపడిన
అధికారులు వారిని బైటకు నెట్టేసి గుడిని మూసివేసారు.
గాయపడిన భక్తులను, ఆలయ అధికారులను పోలీస్ స్టేషన్‌కి
తరలించారు. అక్కడ ఇరుపక్షాలూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసారు. తమపై భౌతికదాడులకు
పాల్పడిన గార్డులను అరెస్ట్ చేయాలని భక్తులు డిమాండ్ చేసారు. అలాగే, గుడిలో గొడవలు
చేసారంటూ భక్తులపై గార్డులు కేసు పెట్టారు.
ఆలయ ఆవరణలో రక్తం చిందినందున శుద్ధి హోమం,
పుణ్యాహవాచనం చేయడం కోసం రంగనాథస్వామి మందిరాన్ని మూసివేసారు. ఈ ఘటనకు కొన్నాళ్ళ
ముందు, పెరంబూర్‌లోని ఒక గుడిలో అయ్యప్ప భక్తులు ఎలాంటి పూజలూ చేయరాదంటూ దేవదాయ
శాఖ నోటీసులు జారీ చేయడం వివాదాస్పదమైంది. ధార్మిక వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం
చేసుకోవడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
తమిళనాడులో హిందూ వ్యతిరేక డీఎంకే ప్రభుత్వం
అధికారంలోకి వచ్చాక గుడుల నిర్వహణలో ఆంక్షలు పెరిగిపోయాయి. దేవదాయ శాఖలో తమకు
కావలసిన అధికారులను, ఉద్యోగులను నియమించిన ప్రభుత్వం ఆలయాల ఆచార వ్యవహారాల్లో
తలదూరుస్తూ భక్తులకు ఇబ్బందులు కలిగిస్తోందన్న ఆరోపణలు పెచ్చుమీరాయి.
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఇటీవల జరిగిన
సదస్సులో దేవదాయ శాఖ మంత్రి స్వయంగా పాల్గొన్న తర్వాత గుడుల్లో భక్తులపై ఆంక్షలు,
దాడులు జరుగుతుండడం కాకతాళీయం కాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీరంగం ఆలయ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, ఘటనపై పూర్తి విచారణ
జరపాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలనీ డిమాండ్ చేసింది. బీజేపీ తిరుచ్చి విభాగం
శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ఎదుట నిరసన చేపడుతుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
అన్నామలై ప్రకటించారు.
‘‘హిందూధర్మంలో విశ్వాసం లేని ప్రభుత్వానికి
హిందూ ఆలయాల్లో పని లేదు. మండల దీక్షలో ఉన్న అయ్యప్ప భక్తులు శబరిమల నుంచి తిరిగివస్తూ
రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేసుకోవాలని శ్రీరంగం వచ్చారు. అక్కడ
కొద్దిమంది ప్రత్యేక అతిథుల కోసం భక్తులను గంటల తరబడి నిలిపివేయడంతో అసహనానికి
గురయ్యారు. దానిగురించి ప్రశ్నించినందుకు, గోవిందా గోవిందా అంటూ నినాదాలు
చేసినందుకు, వారిపై అధికారులు జులుం ప్రదర్శించారు. దాంతో వారిపై గర్భగుడి దగ్గరే
దాడి చేసారు. ఫలితంగా ఆలయం ఆవరణలో రక్తం చిందింది. దేవదాయ శాఖ ఉద్యోగుల దురహంకారమే,
వారిని ఆలయాల నిర్వహణ నుంచి తొలగించాలన్న బీజేపీ డిమాండ్‌కు ఒక ప్రధాన కారణం’’ అని
అన్నామలై ఎక్స్ మాధ్యమంలో ట్వీట్ చేసారు.
డిసెంబర్
23న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రేపటినుంచి శ్రీరంగం ఆలయంలో పదిరోజుల ఉత్సవం
ప్రారంభం కాబోతోంది. మరోవైపు శబరిమల సీజన్ కావడంతో ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు
వస్తున్నారు. ఇలాంటి తరుణంలో దేవదాయ శాఖ అధికారులు, ఉద్యోగుల అహంకారపూరిత ప్రవర్తన
భక్తులకు ఆందోళన కలిగిస్తోంది.