తాంత్రిక
పూజల పేరిట మోసాలకు పాల్పడటంతో పాటు పలువురిని హత్య చేసిన కిరాతకుడు పోలీసులకు
చిక్కాడు. నాగర్ కర్నూల్ లోని ఇంద్రానగర్ కాలనీకి చెందని రామటి సత్యనారాయణ(47)
గుప్తనిధుల జాడ చెబుతానంటూ తాంత్రిక పూజల పేరిట పలువురిని మోసగించాడు.
పూజల అనంతరం
11 మందిని హతమార్చాడు.
రియల్
ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పదమృతిపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ
చేపట్టగా తాంత్రిక పూజారి మోసాలు, హత్యలు వెలుగులోకి వచ్చాయి.
గద్వాల
జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం, తాంత్రిక పూజలు చేసి గుప్త నిధులు సేకరిస్తానని
అమాయకులను నమ్మించి వారి నుంచి భారీగా డబ్బు గుంజేవాడు. ఆ తర్వాత వారిని శివారు
ప్రాంతాలకు తీసుకెళ్ళి హతమార్చేవాడు.
వనపర్తి,
నాగర్ కర్నూల్, కొల్హాపర్, కల్వకుర్తి, కర్ణాటకలోని బలగనూర, ఆంధ్రప్రదేశ్ లోని
అనంతపురంలో హత్యలకు పాల్పడ్డాడు. తీర్థం పేరుతో నోటిలో యాసిడ్ పోసి చంపేవాడని
పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి నుంచి విషపదార్థాలు, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు,
కారు, మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వనపర్తి
జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ హైదరాబాద్
లోని బొల్లారంలో ఉండేవాడు. నవంబరులో నగర శివారులో హత్యకు గురయ్యాడు. వెంకటేశ్
కుటుంబ సభ్యులకు నిందితుడికి కొంతకాలంగా పరిచయం ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు
ఫిర్యాదుచేశారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టడంతో యాసిడ్ తీర్థం
హత్యలు వెలుగులోకి వచ్చాయి.