Dr B R Ambedkar
Biography: Part 7
(అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాస పరంపర)
అంబేడ్కర్ ప్రధానంగా అంటరానివారి ఉద్ధరణ
కోసం పాటుపడినందున ఆయన ఆ ఒక్క క్షేత్రంలోనే పనిచేసాడని చాలామంది పొరపాటు
పడుతుంటారు. నిజానికి ఆయన భారతమాత నిజమైన కుమారుడు. అంబేడ్కర్ కార్యాచరణకు ప్రేరణ
కేవలం తన జాతి హితం కాదు, నిజానికి దేశ హితమే ఆయనకు ప్రేరణ. దేశం ఎలా పటిష్టం అవుతుంది? దేశ ఐక్యతకు, అఖండతకు
ఎక్కడినుంచి ఎవరినుంచి ముప్పు వాటిల్లవచ్చు? వంటి అంశాలపై అంబేడ్కర్ తన అంచనాలను, ఆలోచనలను నిర్భయంగా
వ్యక్తీకరించాడు. భారతదేశపు సంస్కృతి అంటే హిందూ సంస్కృతే, భారతదేశం హిందూ
దేశమే అని ఆయన నిస్సందేహంగా అంగీకరించాడు.
దేశమంటే ఏమిటి? అది ఎలా
ఏర్పడుతుంది?: దేశ నిర్మాణం ఎలా జరుగుతుంది అనే అంశంపై అంబేడ్కర్‌కు నిశితమైన గాఢమైన
ఆలోచన ఉంది. దేశ నిర్మాణం ఆషామాషీగా జరగదు. కొన్ని శతాబ్దాల పాటు వందలాది తరాలు
చేసే కఠోరమైన తపశ్చర్య వల్ల మాత్రమే దేశ నిర్మాణం జరుగుతుంది. దేశం గురించి కొన్ని
ఆవశ్యకమైన, అనివార్యమైన విషయాలు చర్చిస్తూ అంబేడ్కర్ ఇలా రాసాడు, ‘‘దేశ నిర్మాణానికి
మొట్టమొది ఆవశ్యకత – గొప్పదైన వారసత్వాన్ని గుర్తుంచుకునే శక్తి, రెండవది నిజమైన
సమ్మతి. అభివృద్ధి చెందాలన్న గాఢమైన కోరిక, అవిభాజ్య ఉత్తరాధికారం రూపంలో లభించిన నిధిని
భద్రపరచుకోవాలన్న కోరిక ఉండాలి. దేశం కూడా వ్యక్తిలాగే దీర్ఘకాల ప్రయాస, త్యాగాలు, శ్రద్ధ వల్ల
ఏర్పడుతుంది. గొప్ప సాహస కార్యాలు, మహాత్ములు, నా దేశ వైభవం ఇవన్నీ కలిసి సమాజమనే క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తాయి.
దానిపైన జాతీయ భావధార అనే పునాది పడుతుంది. దేశ ప్రజలు అందరికీ గౌరవం, వర్తమానంలో
కలిసుండాలనే కోరిక కలుస్తాయి. గతంలో సాధించిన మహత్తర కార్యాలను భవిష్యత్తులో మళ్ళీ
సాధించాలనే సంకల్పం వాటికి తోడవుతుంది. అలా మనం నిర్మించుకునే దేశమనే భవనం మనకు
ప్రియమైనది. దాన్ని మన వారసులకు అంతే గొప్పగా అందజేద్దాం.’’
దేశం అనే అందమైన కల్పనకు మరింత స్పష్టత
ఇస్తూ అంబేడ్కర్ ఇంకా ఇలా రాసాడు,
‘‘గతం పట్ల గౌరవం, పశ్చాత్తాపానికి
భాగస్వామి. భవిష్యత్తులో సమాన ఆదర్శాలపై ధ్యానం ఉంచడంతో పాటు సుఖదుఃఖాలను అనుభూతి
చెందడం మామూలు పద్ధతుల కంటె ఎంతో విలువైనది. మన చరిత్రలో హిందువులు, ముస్లిములు సమానంగా
గర్వపడగలిగే లేదా దుఃఖంలో పాలుపంచుకునే సందర్భాలు మన చరిత్రలో ఎప్పుడైనా వచ్చాయా? ఇది ఒక ప్రధానమైన, మౌలికమైన ప్రశ్న.
(థాట్స్ ఆన్ పాకిస్తాన్ : అంబేడ్కర్ రచన)
ఈ దేశం అత్యంత ప్రాచీనమైనది: భారతదేశపు
ప్రాచీనత, దాని గొప్పదైన సంస్కృతి అంటే అంబేడ్కర్‌కు ఎంతో గర్వం. కానీ ఒక
విషయంలో చాలా దుఃఖం కూడా ఉండేది. అంబేడ్కర్ 1928 సెప్టెంబర్ 21నాటి ‘బహిష్కత
భారత్’ పత్రికలో ‘హిందువుల ధర్మశాస్త్రాలు’ పేరిట సంపాదకీయంలో ఇలా రాసాడు ‘‘అత్యంత
ప్రాచీన కాలంలో ఉజ్వల వైభవం కలిగిన దేశాల్లో హిందూదేశం కూడా ఒకటి. అప్పటి ఈజిప్ట్, సిరియా, రోమ్, గ్రీస్ వంటి దేశాలు
ఇవాళ శిథిలమైపోయాయి. కానీ హిందూదేశం నేటికీ జీవించి ఉంది. అయితే అది ఇంకా బలమైన
దేశం అని చెప్పుకుంటే మనని మనం మోసం చేసుకోవడమే. హిందూదేశపు ఓటమి, దాని పతనానికి
కారణాల్లో, భేదభావం చూపించే ధర్మశాస్త్రాలు కూడా ప్రధానమైనవి అని
ఒప్పుకోవాల్సిందే.’’ అంటే, ఈ దేశం ఒకప్పుడు ప్రపంచంలోని వైభవమైన దేశాల్లో ఒకటిగా పరిగణించబడేది
కానీ ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చింది. దానికి కారణాలు ఏమిటి? వాటిలో, మనుష్యుల మధ్య
ఇలాంటి భేదభావాలు ఉండడం ప్రధానమైనది. వందలయేళ్ళుగా మండుతూ వస్తున్న ఆ సమస్య ఈ
దేశాన్ని బలహీనం చేసింది.
దేశ అఖండతకు పూజారి: అంబేడ్కర్ హృదయంలో
భారతమాత అంటే ఒక సువ్యవస్థితమైన చిత్రం ఉంది. ఆ మూర్తిని ఆయన దైవంలా భావించి
పూజించేవాడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి
వరకు, పెషావర్ నుంచి రంగూన్ వరకూ భారతభూమి అఖండంగా ఉండాలి అన్నదే ఆయన ఆలోచన.
అంబేడ్కర్ ఉద్దేశం ప్రకారం ఈ దేశం ఏమీ సులువుగా తయారవలేదు. వందల వేల యేళ్ళ
ప్రయత్నాలతో ఈ దేశంలో ఒక భౌగోళికమైన,
సాంస్కృతికమైన ఐక్యత నిర్మాణమైంది. ‘‘భారతదేశపు
ఐక్యతకు మూలాధారమైన (హిందూ) సంస్కృతి యావత్ దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ
వ్యాపించింది. సాంస్కృతిక ఐక్యతలో ఏ దేశమూ భారతదేశానికి ఎదురు నిలబడలేదు. ఇది
కేవలం భౌగోళిక ఐక్యత కాదు, అది మొత్తం దేశమంతా వ్యాపించి ఉన్న సాంస్కృతిక వైభవం. (రైటింగ్స్ అండ్
స్పీచెస్ సంపుటం 1, పుట 6)
ప్రకృతి కూడా ఈ దేశాన్ని ఒకేలా అభివృద్ధి
చేసింది. దీన్ని ఖండించడం లేదా విభజించడం అంటే ఈశ్వరుడు నిర్మించిన దేశాన్ని
విభజించడమే. అందుకే అంబేడ్కర్, దేశం కంటె గొప్ప మరేమీ లేదని చెప్పేవాడు.
దేశం పట్ల నిష్ఠయే అన్నిటికంటె
ఉన్నతమైనది: ఏ వ్యక్తి అయినా తన మతాన్ని, సంప్రదాయాన్నీ దేశం కంటె గొప్పదిగా భావిస్తే అది
సిగ్గుపడవలసిన విషయం. అది వికృతమైన ఆలోచనల పర్యవసానమే. దానివల్ల దేశంలో సరైన
జాతీయభావన వికసించదు. మన జాతీయభావన నిర్వివాదంగానూ విస్పష్టంగానూ ఉండాలని
అంబేడ్కర్ కచ్చితమైన అభిప్రాయం.
ఎలాంటి షరతులూ లేదా నిబంధనల్లో నాలుగువైపులా
బంధించబడిన జాతీయభావం కాదు. మనందరికీ మొదటినుంచీ చివరివరకూ అన్ని కోణాల్లోనూ
నిజమైన జాతీయవాదులమని నిరూపించుకోవాలి. దానికోసం అంబేడ్కర్ ఇంకా స్పష్టంగా ఇలా
చెప్పాడు…
‘‘మేము మొదట భారతీయులము ఆ తర్వాతే హిందువులం లేదా ముస్లిములం అని
కొంతమంది చెబుతుంటారు. అది నాకు నచ్చదు. అలా చెప్పడాన్ని నేను ఒప్పుకోను. ధర్మం, సంస్కృతి, భాష వంటి విషయాల్లో
పోటీపడుతూ భారతీయత విషయంలో మాత్రం నిష్టగా ఉంటామంటే సమస్యలు వస్తాయి. దేశ ప్రజలు
మొదటినుంచి చివరివరకూ భారతీయులుగానే ఉండాలి. భారతీయులు తప్ప మరింకేమీ కాదు.’’
(రైటింగ్స్ అండ్ స్పీచెస్ : సంపుటం 2,
పుట 195)
దేశం దైవం వంటిది, వ్యక్తిగత
స్వార్థాల కంటె పైనే ఉండాలి: దేశంతో పోలిస్తే మన వ్యక్తిగత స్వార్థాలు వెనుకనే
ఉండాలి. దేశ హితం నుంచి మన వ్యక్తిగత స్వార్థాలను వేరేగా ఉంచాలి. దేశం విషయం వస్తే, మనందరి వ్యక్తిగత
స్వార్థాలూ దాని తర్వాతే… అనే భావన అందరిలోనూ ఉండాలి. అంబేడ్కర్ అదే విషయాన్ని
మరింత స్పష్టంగా చెబుతాడు.
‘‘నేను నా దేశాన్ని ప్రేమిస్తాను అనే విషయంలో ఎలాంటి సందేహమూ
అక్కర్లేదు. నా మేలుకూ దేశపు మేలుకూ మధ్య ఘర్షణ వస్తే నేను కచ్చితంగా నా దేశ
హితానికే ప్రాధాన్యం ఇస్తాను’’ (రైటింగ్స్ అండ్ స్పీచెస్ : సంపుటం 1, పుటలు 258-261)
అంబేడ్కర్ తన జీవితంలో ఎప్పుడూ ఏ అధికారం, పదవి, ప్రతిష్ఠ లేక సుఖం
గురించి ఆలోచించలేదు. అంతేకాదు, అనేక సందర్భాల్లో, తను సరైనది అని
భావించే విషయాలను కూడా చెప్పడం ఆ సందర్భంలో సరైనది కాదనీ, దానివల్ల ఆనాటి
వాతావరణం పాడవుతుందనీ అనుకుంటే ఆ విషయాన్ని వదిలిపెట్టేసేవాడు, అవమానాన్నయినా
సహించేవాడు తప్ప దేశ హితం కంటె తనను,
తన జాతిని అధికం చేసేలా మాట్లాడేలా ఎలాంటి
అవకాశమూ రానీయలేదు.
దేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లనివ్వను:
1952 మే 31న బొంబాయిలో ప్రసంగిస్తూ అంబేడ్కర్ ఇలా చెప్పాడు, ‘‘నేను కొంచెం
ఆవేశపూరితమైన స్వభావం కలిగిన వాడినే. అధికారంలో ఉన్నవారితో గొడవలు కూడా
పెట్టుకుంటూ ఉంటాను. కానీ నా విదేశీ యాత్రలో భారతదేశపు ప్రతిష్ఠకు ఎంతమాత్రం భంగం
వాటిల్లనివ్వనని కచ్చితంగా చెబుతున్నాను. నేను ఎప్పుడూ దేశద్రోహం చేయలేదు. నా
హృదయంలో ఎప్పుడూ దేశహితానికే ప్రాధాన్యం ఇచ్చాను. గోల్ మేజ్ పరిషత్ సమయంలో కూడా
దేశహితం విషయంలో గాంధీ కంటె నేను 200 మైళ్ళు ముందే ఉన్నాను.’’
బర్మా భారత్ నుంచి విడిపోకూడదు: భారతదేశం
నుంచి బర్మా విడిపోయే విషయం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు అంబేడ్కర్ దాన్ని
తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆ సందర్భంలో ఆయన తన ఆలోచనలను వెల్లడించాడు. బర్మా భారత
సరిహద్దుల్లోని ప్రాంతమనీ, అక్కడి ప్రజల్లో భారతీయ సంస్కృతిలో భాగమైన బౌద్ధం పట్ల
బలమైన విశ్వాసం ఉందనీ ఆయనకు తెలుసు. అందువల్ల బర్మా భారతదేశం నుంచి విడిపోకూడదని
ఆయన కోరుకున్నాడు. సుదీర్ఘకాలపు సంధి తర్వాత కూడా బర్మా భారత్ నుంచి విడిపోయింది.
అది భారతీయులందరికీ బాధ కలిగించింది. బర్మా విషయంలో అంబేడ్కర్ ఇలా రాసాడు,
‘‘1826లో జరిగిన సంధి ద్వారా అరాకాన్, తెనారసరిస్ ప్రాంతాలు బర్మాతో కలిసాయి. ఆ
ఐక్యత 110 సంవత్సరాల పాటు కొనసాగింది. 1936లో ఆ బంధం తెంచివేయబడింది. కానీ ఏ ఒక్కరూ
ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చలేదు. బర్మా, భారతదేశాల ఐక్యత సాధ్యం కాలేదు.’’
(థాట్స్ ఆన్ పాకిస్తాన్ మొదటి భాగం)
370వ అధికరణం దేశాన్ని బలహీనపరుస్తుంది: దేశానికి
స్వతంత్రం వచ్చాక కశ్మీర్లో కొన్ని సమస్యలు తలెత్తాయి. నెహ్రూకు షేక్ అబ్దుల్లాతో
ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల కశ్మీర్ భారత్‌లో కలవడం సమస్యగా మారింది. దానివల్లే
370వ అధికరణం ప్రస్తావన వచ్చింది. దానిద్వారా ముస్లిములు ఎక్కువగా ఉండే కశ్మీర్‌కు
విశేషాధికారాలు దఖలు పడ్డాయి. అంబేడ్కర్ దూరదృష్టితో ఆనాటి పరిస్థితుల తీవ్రతను
తగ్గించాడు. 370వ అధికరణం వల్ల భవిష్యత్తులో రాగల సమస్యల గురించి నెహ్రూకు
వివరించాడు. అందువల్లే అంబేడ్కర్ రాజ్యాంగంలో 370వ అధికరణం జోడించే విషయంలో సమ్మతి
సాధించే బాధ్యతను నెహ్రూ, షేక్ అబ్దుల్లాల మీద మోపాడు. ఈ సంకేతాత్మక బంధనం కారణంగా
ప్రత్యక్ష చర్చలో పాలుపంచుకోవడం అంబేడ్కర్‌కు సాధ్యం కాలేదు. అందువల్లే అంబేడ్కర్ ఆ అధికరణాన్ని వ్యతిరేకించే
పనిని తన మిత్రుడైన మౌలానా హజరత్ మౌలానీతో చేయించాడు. అంబేడ్కర్ 370వ అధికరణాన్ని
తాత్కాలికంగానే ఉంచాడు. తద్వారా దాన్ని ఎప్పుడైనా రద్దు చేసే వీలు కల్పించాడు.
ఇవాళ కశ్మీర్‌కు చెందిన అన్ని సమస్యల్లోనూ 370 అధికరణమే ప్రధానమైనది. (2019 ఆగస్టు
5న నరేంద్ర మోదీ సర్కారు ఆ అధికరణాన్ని రద్దు చేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ
సుప్రీంకోర్టులో సవాల్ చేసారు. మోదీ ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని తేలుస్తూ
సుప్రీంకోర్టు 2023 డిసెంబర్ 11న తీర్పునిచ్చింది. అంబేడ్కర్ స్ఫూర్తిని మోదీ
సర్కారు అనుసరించింది.)
టిబెట్‌ను చైనా ఆక్రమించుకోడానికి
వ్యతిరేకం: జవాహర్లాల్ నెహ్రూ చైనా తియ్యటి మాటలకు మురిసిపోతుంటే అంబేడ్కర్
దూరదృష్టితో చైనా ధూర్తత్వం గురించి వివరించి హెచ్చరించాడు. కొన్నాళ్ళకే చైనా
టిబెట్‌ను ఆక్రమించి తమ అధీనంలోకి తీసుకున్నప్పుడు కూడా అంబేడ్కర్ ఆ చర్యను
తీవ్రంగా వ్యతిరేకించాడు. చైనా ఎప్పుడూ పంచశీలను పాటించదని, టిబెట్ ఆక్రమణ తర్వాత
భారత సరిహద్దులు సురక్షితంగా లేవనీ అంబేడ్కర్ చెబుతూ వచ్చాడు. చైనా విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండడం ఎంతో
అవసరమని అంబేడ్కర్ హెచ్చరిస్తూ వచ్చాడు. కానీ నెహ్రూ ఆ హెచ్చరికలను ఎంతమాత్రం
పట్టించుకోలేదు. దాంతో నెహ్రూ మంత్రివర్గానికి అంబేడ్కర్ రాజీనామా చేసేసాడు. కమ్యూనిస్టు చైనా
గురించి అంబేడ్కర్ చెప్పిన భవిష్యవాణి నిజమైంది. టిబెట్ ఆక్రమణ తర్వాత చైనా
భారతదేశపు సరిహద్దులను సైతం ఆక్రమించింది. మన దేశానికి చెందిన వేలాది చదరపు మైళ్ళ
భూభాగాన్ని కబ్జా చేసింది.
విషయం కశ్మీర్దో గోవాదో కానివ్వండి లేదా
సరిహద్దుల్లో చైనా పాకిస్తాన్ కలిసిపోవడం కానివ్వండి. భారత ప్రభుత్వం శక్తిని
పూజించాలని, శత్రువును ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడించి తీరాలని అంబేడ్కర్ స్పష్టం చేసాడు.
పొరుగుదేశాల విషయంలో అంబేడ్కర్ అనుసరించిన పద్ధతి ఇవాళ సార్థకమైంది. ఆనాటి
కేంద్రప్రభుత్వం అంబేడ్కర్ పేరును మాత్రమే కాక ఆయన ఆలోచనలను కూడా స్వీకరించి ఉంటే
బాగుండేది.
స్వతంత్ర రక్షణకు ఆఖరి రక్తపు బొట్టు
వరకూ పోరాటం: అంబేడ్కర్ అంతిమలక్ష్యం దేశ అభ్యున్నతే. అసమానతలపై పోరాడుతున్న
అంబేడ్కర్‌ను చూసి ప్రజలకు చాలాసార్లు ఆయన ఆవేశంలో, కోపంలో మాట్లాడుతున్నాడని
అనిపించేది. ఆయనకు పెద్దగా దేశభక్తి లేదని కొంతమందికి అనిపించేది కానీ అది వారి
భ్రమ మాత్రమే. అవసరం పడినప్పుడల్లా ఆయన దేశభక్తి, ప్రచండ సూర్యుడి పూర్తి తేజస్సులా,
దేశమంతా ప్రకాశించింది. బొంబాయిలోని బాగలే హాల్లో ప్రసంగిస్తూ అంబేడ్కర్,
‘‘కొన్ని విషయాల్లో సవర్ణ హిందువులతో నాకు విభేదాలున్నాయని ఒప్పుకుంటాను కానీ మాతృభూమి
రక్షణ కోసం నా జీవితాన్ని బలిదానం చేయడానికి కూడా వెనుకాడనని మీ అందరి ముందూ
ప్రతిజ్ఞ చేస్తున్నాను’’ అని చెప్పాడు. (విచార్ గోష్ఠీ మే డా. అంబేడ్కర్, బాగలే
హాల్, బొంబాయి, 1940 ఫిబ్రవరి)
భారత రాజ్యాంగం గురించి జరిగిన గొడవకు
ముగింపు పలుకుతూ అంబేడ్కర్ తన ప్రసంగంలో ఇలా చెప్పాడు, ‘‘మనవాళ్ళే చేసిన మోసం వల్ల
మనం స్వాతంత్ర్యాన్ని నష్టపోయాం. మన ప్రజలే కొంతమంది వెళ్ళి మొగలులతోనో,
ఆంగ్లేయులతోనో కలిసిపోయారు. లేదా అవసరం పడినప్పుడు మిన్నకుండిపోయారు. అలాంటి మాటలు ఇంకముందు ఎప్పుడూ రాకూడదు. మన
దేశప్రజలందరూ తమ శరీరంలో ఊపిరి ఉన్నంతవరకూ భారతదేశపు స్వాతంత్ర్యాన్ని రక్షించడానికి
పోరాడతామని ప్రతిజ్ఞ చేయాలి.’’
ఈ దేశం ఒక్కటిగానే ఉంటుంది: అంబేడ్కర్‌కు
భారతదేశపు రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యల గురించి అపారమైన అవగాహన ఉంది.
అయినప్పటికీ ఆయన ఈ దేశపు ఐక్యత, అఖండతల గురించి పూర్తి విశ్వాసం కలిగి ఉండేవాడు.
‘‘నాకు తెలుసు, ఇవాళ మనం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విడిపోయి ఉన్నాము. మనం
విరుద్ధ శిబిరాలుగా విడిపోయిన సమూహాలుగా ఉన్నాము. నేను కూడా అలాంటి విభిన్న
శిబిరాల్లో ఉన్న నాయకుల్లో ఒకడిని. కానీ, ఇన్ని తేడాలున్నా కూడా అవసరం వచ్చినప్పుడు
ఈ దేశాన్న ఒక్కటి కాకుండా ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలోనే లేదని నాకు నమ్మకముంది’’
అన్నాడాయన. (బాబాసాహెబ్ నే కహా థా : రచన – ఎ ఆర్ అకేలా)
భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన సరికాదు: స్వాతంత్ర్యం
వచ్చిన తర్వాత దేశంలోని వేర్వేరు ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడాలన్న డిమాండ్లు
తలెత్తాయి. వాటిలో భాష ఆధారంగా విడిపోవాలన్న వాదన ఒకటి. ఆ వాదన అంబేడ్కర్‌ను
కలచివేసింది. ‘‘భాషల ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్రాల్లో మెల్లమెల్లగా
చిన్నచిన్న దేశాలుగా ఏర్పడాలన్న ప్రమాదకర ఆలోచనలు ఏర్పడతాయి. స్వతంత్ర దేశానికీ,
స్వతంత్ర రాష్ట్రానికీ మధ్య విభజన రేఖ చాలా సున్నితమైనది. దాని గురించి మనం
తీవ్రంగా ఆలోచించాలి. దేశమంతటా ప్రభుత్వ వ్యవహారాలకు ఒకటే అధికారిక భాష ఉండాలి.
అది హిందీయే కాగలదు. భారతీయులందరూ ఒకటిగా ఉండాలని, మనదైన ఒక ఉమ్మడి సంస్కృతి
అభివృద్ధి కావాలనీ కోరుకుంటున్నారు. కాబట్టి హిందీని జాతీయ భాషగా స్వీకరించడం
మనందరి కర్తవ్యం’’ అని వివరించాడాయన. (రైటింగ్స్ అండ్ స్పీచెస్ : సంపుటం 1, పుటలు 145-146)
పుణే ఒడంబడిక: 1932 ఆగస్టు20న బ్రిటిష్
ప్రధానమంత్రి భారతదేశానికి ‘కమ్యూనల్ అవార్డు’ ప్రకటించాడు. ఆ నిర్ణయంలో దళితులకు
అవకాశం కల్పించారు. వారిప్పుడు తమకు రిజర్వు చేసిన నియోజకవర్గాల్లో తామే ఓట్లు
వేయగలుగుతారు. రిజర్వుడు నియోజకవర్గాల సంఖ్యను మరికొంచెం పెంచాలి కానీ ఓటింగ్‌లో
అందరు ప్రజలనూ భాగస్వాములను చేయాలని, తద్వారా సమాజం ముక్కలైపోదని గాంధీ భావించాడు.
చివరికి రిజర్వుడు నియోజకవర్గాల సంఖ్య 71 నుంచి 148కి పెంచారు. ప్రజలందరూ కలిసి
ఓటింగ్‌లో పాల్గొంటారని నిర్ణయించారు. సవర్ణ హిందువులు కూడా దళిత ప్రతినిధులకు తమ
ఓటు వేయాలి. అలా దేశానికి ఒక మేలు జరిగింది. అదేంటంటే, అంబేడ్కర్ ప్రయత్నాల వల్ల దేశమంతటా
అంటరానివారు, దళితుల సమస్యను సరిగ్గా అర్ధం చేసుకోగలిగారు. పెద్దపెద్ద సవర్ణ
నాయకులు కూడా అస్పృశ్యతకు వ్యతిరేకంగా ముందుకొచ్చారు. మాలవీయ, జయకర్, సప్రూ,
బిర్లా, రాజగోపాలాచారి వంటివారు అందరూ హిందూ సమాజంలో అంటరానితనం ఉండకూడదని
అభిప్రాయపడ్డారు. అంబేడ్కర్ గాంధీతో ‘ఇక మీ శేషసమయం అంతా అంటరానివారి ఎదుగుదల కోసం
పోరాడండి’ అని చెప్పాడు. (డా.బీఆర్ అంబేడ్కర్, వ్యక్తిత్వ్ ఏవం కృతిత్వ్ : పుట
141)
ఒప్పందం తర్వాత 1932 సెప్టెంబర్ 25న పుణేలో
బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో మాట్లాడిన మాలవీయ, దేశంలో అస్పృశ్యత అంతమైపోవాలి,
ఇంక ఎవరినీ పుట్టుక కారణంగా అస్పృశ్యులుగా భావించకూడదు అని స్పష్టం చేసాడు. ఆ సభలో
వక్తలందరూ అంబేడ్కర్ గుణగణాలను ప్రశంసించారు.
గొప్పవ్యక్తులు దేశ సంపద, వారు అందరికీ
చెందుతారు: మహాపురుషులు వారి కులం, మతం, మార్గం, క్షేత్రం వంటి హద్దులకు అతీతంగా
అన్నింటికీ పైన ఉంటారు. కానీ ప్రస్తుతం దేశంలో ఘాతక ప్రవృత్తి పెరిగిపోతోంది.
లోకమాన్య తిలక్ వంటి వ్యక్తి కూడా కేవలం మహారాష్ట్ర వారసుడిగా ప్రాచుర్యం పొందాడు.
అలాగే రవీంద్రనాథ్ టాగోర్ మీద బెంగాల్‌కు, మహాత్మా గాంధీ మీద గుజరాత్‌కు మాత్రమే హక్కులుంటే
దేశంలో మధ్యయుగాలనాటిలా రాష్ట్రాల మధ్య ఘర్షణలు మొదలవుతాయి. అలాగే సంత్
జ్ఞానేశ్వర్ బ్రాహ్మణులకు, తుకారాం వైశ్యులకు, సంత్ నామ్‌దేవ్ దర్జీలకు, సంత్ గోరా
కుమ్మరులకు, చోఖామేలా మహార్లకు మాత్రమే పరిమితమైపోతారు. అది సరికాదు. వారి
వారసత్వం మొత్తం మానవజాతికి దక్కాలి. గౌరవనీయులూ, వందనీయులూ అయిన ఆ విశ్వమానవులను
కులం, ప్రాంతం వంటి సంకుచిత బంధాలుండవు. అందువల్లే శ్రేష్ఠులైన ఆ వ్యక్తుల గురించి
అలా ఆలోచించడం తప్పవుతుది. ఈ విశ్వం అంతటికీ చెందేవారిని ఒక జాతికో కులానికో
అంటగడుతున్నారు.
ఆ ప్రవృత్తి గురించి అంబేడ్కర్ ‘జాతీయత అనే
బడబానలం గౌతమబుద్ధుడు, వివేకానందుడు, జ్ఞానదేవుడు, తుకారాం వంటివారందరినీ భస్మం
చేసేసింది’ అన్నాడు. తాను వెళ్లిపోయిన తర్వాత ఈ బావిలో కప్ప సమాజం తనకూ అలాంటి గతి
పట్టించకూడదని అంబేడ్కర్ ఆలోచించే ఉంటాడు.
అంబేడ్కర్ తన సమర్థకులు, విరోధులను ఒక ప్రత్యేక
వర్గానికి చెందిన నాయకులుగా నిరూపించేవాడని చాలామంది భావిస్తారు. రామస్వామి నాయకర్,
మహమ్మద్ అలీ జిన్నా, లాల్ డెంగా వంటి వారితో అంబేడ్కర్‌ను ఒకగాటన కడితే అది ఆయనకు
అన్యాయం చేయడమే అవుతుంది. ఆ విషయంలో ఘోరమైన అజ్ఞానం ఉండడమే దానికి కారణం.
అంబేడ్కర్ పూర్తిగా దేశభక్తుడు, మానవతావాది, ధర్మమంటే
ప్రాణం పెట్టేవాడు, సాత్విక స్వభావం కలిగిన మహాపురుషుడు. ఆయన విశాల హృదయంలో
సంకుచితత్వానికి ఎలాంటి చోటూ లేదు. ఎప్పుడైనా ఏదైనా పరిస్థితిలో అలాంటి భూమిక
నిర్వహించాల్సి వస్తే ఆయన ఎంతో ఆవేదన చెందేవాడు.
1950 జనవరి 11న బొంబాయిలో తనకు సన్మానం చేసిన
సందర్భంలో అంబేడ్కర్ ఇలా చెప్పాడు, ‘‘ఇప్పటివరకూ మనం శత్రుత్వం ఆధారంగా రాజకీయాలు
చేసాము. అంటరాని వర్గాలకు చెందిన నాయకులను కొన్ని సంకుచిత దృష్టికోణాల నుంచే
చూసాము. ఒకస్థాయిలో నేను కూడా ఆ దోషం చేసినవాడినే. హిందువుల చేతికి అధికారం వస్తే మన
పరిస్థితి ఏమవుతుంది అనే మనం ఆలోచించాం. కానీ ఇప్పుడు మనం మన ఆలోచనలను
మార్చుకోవలసిన అవసరం ఉంది. ఇప్పటివరకూ మనం మన సామాజిక వర్గానికి మేలు చేకూరడం
గురించి మాత్రమే ఆలోచించాం. ఇక ముందు కూడా మనం దానిగురించి ఆలోచించాల్సిందే, అయితే
దానితో పాటే దేశ స్వాతంత్ర్యాన్ని రక్షించడం గురించి కూడా ఆలోచించాలి. మనదేశం ఎన్నోసార్లు
స్వతంత్రం సాధించి కూడా మళ్ళీమళ్ళీ పరాధీనం అవుతూ వచ్చింది. మనం ముస్లిములు,
బ్రిటిష్ వాళ్ళకు బానిసలుగా పడి ఉండాల్సి వచ్చింది. స్వాతంత్ర్యం అనేది సవర్ణులకు
ఎంత అవసరమో, దళిత వర్గాలకు కూడా అంతే అవసరం. మన దేశం ఇంకోసారి పరాధీనమైతే అది
మనందరి దౌర్భాగ్యమే. దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడడం మనందరి పరమ కర్తవ్యంగా అందరమూ
భావించాలి.’’
భారతరత్న డా.భీమ్రావ్ అంబేడ్కర్: బాబాసాహెబ్
మరణించిన 34ఏళ్ళ తర్వాత భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను ఆయనకు
ప్రదానం చేసింది. ఆయనను భారతరత్నగా సన్మానించుకోడానికి ఇంత ఆలస్యం ఎందుకు
అయిందన్నది చెప్పుకోవడం ఇప్పుడు చాలా కష్టం. అలాగే పార్లమెంటు సెంట్రల్ హాల్లో
బాబాసాహెబ్ చిత్రపటం ఉంచాలన్న కోరిక కూడా చాలాకాలం నెరవేరలేదు. ఎట్టకేలకు ఆడ్వాణీ
విజ్ఞప్తి మేరకు చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చిత్రపటం పెట్టారు.
ఇవాళ దేశం మొత్తం ఆయన ఆదర్శాలముందు తలవంచి
నమస్కరిస్తోంది.
‘‘ఈ దేశం సత్యం, సంకల్పాల భూమి. ఇక్కడి సమాజం
ప్రపంచంలోనే అత్యుత్తమమైన సమాజం’’ – డా. బీఆర్ అంబేడ్కర్