నేర న్యాయ ఉపసంహరణ బిల్లులను కేంద్ర
హోంమంత్రి అమిత్ షా నేడు మళ్ళీ లోక్సభలో
ప్రవేశ పెట్టనున్నారు. పార్లమెంటరీ ప్యానెల్ సూచించిన సవరణలతో మూడు బిల్లులను మళ్ళీ
సభ ముందుకు తీసుకురానున్నారు. పార్లమెంటరీ
స్థాయీ సంఘం చేసిన కొన్ని సిఫార్సులకు బిల్లులో స్థానం కల్పించారు.
నేర న్యాయచట్టాల స్థానంలో భారతీయ న్యాయ
సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లులను ఆగస్టులో
కేంద్రం, లోక్సభలో ప్రవేశపెట్టింది. వీటిని శీతాకాల సమావేశాల్లో ఆమోదించాలని సంకల్పించిన
కేంద్రం అజెండాలో చేర్చింది.
పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచన మేరకు
వాటిని డిసెంబర్ 11న ఉపసంహరించుకున్న కేంద్రం, వాటికి పలు సవరణలు చేసి మళ్లీ చట్ట
సభ ముందుకు తీసుకొస్తోంది.
బ్రిటీషు వలస పాలన ఆనవాళ్ళు ఉన్న ఇండియన్ పీనల్ కోడ్(IPC)1860, ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ (crpc) 1973, భారత
సాక్ష్యాధారాల చట్టం 1872 స్థానంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త బిల్లులను
ప్రవేశపెట్టి ఆమోదించనుంది.
ఈ బిల్లులు ప్రవేశపెట్టే సందర్భంగా
లోక్ సభలో మాట్లాడిన అమిత్ షా, పౌరులకు రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులను కాపాడటమే
లక్ష్యంగా కొత్త చట్టాలు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధమైందన్నారు.
బాధితులకు త్వరగా న్యాయం అందించడమే కొత్త
చట్టాల లక్ష్యమన్నారు.
Crpc స్థానంలో వస్తున్న భారతీయ నాగరిక్ సురక్ష సంహిత
బిల్లులో 533 సెక్షన్లు ప్రతిపాదిస్తున్నట్లు చెప్పిన అమిత్ షా, 160 సెక్షన్లు
మార్చినట్లు తెలిపారు. 9 కొత్త సెక్షన్లు తీసుకురావడంతో పాటు తొమ్మిందింటిని పూర్తిగా
రద్దు చేస్తునట్లు ప్రకటించారు.
Ipc స్థానంలో ప్రవేశపెడుతున్న భారతీయ న్యాయ సంహిత బిల్లులో
365 సెక్షన్లను కేంద్రం ప్రతిపాదించింది.
గతంలో 511 సెక్షన్లు ఉన్నాయి. 175
సెక్షన్లు సవరించడంతో పాటు 8 కొత్త సెక్షన్లు జోడించారు. 22 సెక్షన్లు తొలగించారు.
భారతీయ సాక్ష్యాధారాల బిల్లులో 170
సెక్షన్లు ఉండనున్నాయి. 23 సెక్షన్లలో మార్పులు చేపట్టి ఓ కొత్త సెక్షన్
జోడించారు. అలాగే ఐదు సెక్షన్లు తొలగించారు.