Anganwadi workers stage protest :
వేతనాల
పెంపు కోరుతూ అంగన్వాడీ సిబ్బంది ఆందోళనకు దిగడంతో రాష్ట్రవ్యాప్తంగా 55 వేల
అంగన్వాడీ కేంద్రాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. పనిభారం పెంచిన ప్రభుత్వం, జీతాలు
మాత్రం పెంచడం లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు.
అంగన్వాడీల
కనీస వేతనం రూ. 26 వేలకు పెంచాలని నినదిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోని
ప్రాజెక్టు కార్యాలయాలకు వద్దకు తరలి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారానికి
ముఖ్యమంత్రి చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలు సార్లు సమ్మె నోటీసులు
అందజేసిన అధికారులు, మంత్రులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు
మార్గదర్శకాల ప్రకారం తమకు న్యాయం చేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం
నుంచి నిర్దిష్టమైన హామీ లేని కారణంగానే సమ్మెకు దిగాల్సి వచ్చిందని వివరించారు.
రిటైర్మెంట్
బెనిఫిట్స్ రూ. 5 లక్షలు ఇవ్వాలని, సర్వీసులో ఉండగా చనిపోయిన వారిక బీమా
అందజేయడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మినీలను మెయిన్ సెంటర్లుగా మార్చడంతో పాటు వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు
చేయాలంటున్నారు.
తెలంగాణ
కంటే అదనంగా జీతం ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చి ఇప్పుడు మాటమార్చిందని దుయ్యబట్టిన
అంగన్ వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నేతలు, నాసిరకం ఫోన్లు ఇచ్చిన యాప్‌లలో
అప్డేట్ చేయమంటే ఎలా అని ప్రశ్నించారు.