అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో నిలిచిన భారతీయ మూలాలున్న అమెరికన్ వివేక్ రామస్వామికి (vivek ramaswamy) తీవ్ర బెదిరింపులు వచ్చాయి. ఓటర్ నోటిఫికేషన్‌కు స్పందించిన ఓ వ్యక్తి చంపేస్తానంటూ మేసేజ్‌లు పంపాడు. దీనిపై స్థానిక మీడియా కథకాలు ప్రచురించింది.
అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీలో ఉన్న వివేక్ రామస్వామి ప్రచారంలో భాగంగా, కార్యక్రమాల వివరాలతో కూడిన సమాచారాన్ని ఓటర్లకు నోటిఫికేషన్ల ద్వారా పంపించాడు. దీనిపై అనేక మంది స్పందించారు. వారిలో ఒకరు చంపేస్తానంటూ తిరిగి మెసేజ్ పెట్టడం సంచలనంగా మారింది. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరినీ చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన న్యూహోంప్షైర్ పోలీసులు సందేశాలు ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించారు. సందేశాలు పంపిన టైలర్ అండర్సన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరం రుజువైతే అతనికి ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.
బెదిరింపులు రావడంపై రామస్వామి కూడా స్పందించారు. పోలీసులు వేగంగా స్పందించి అతన్ని అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. తనకు రక్షణగా ఉన్నవారికి ధన్యవాదాలు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ నుంచి వివేక్ రామస్వామి అభ్యర్థిత్వ రేసులో ఉన్నారు. ఈ రేసులో 60 శాతం ఓటర్ల మద్దతుతో డొనాల్డ్ ట్రంప్ ముందున్నారు.