Mohan Yadav selected as MP CM
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్‌ను భారతీయ జనతా
పార్టీ ఎంపిక చేసింది. భాజపా గత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొత్త
ముఖ్యమంత్రిని అభినందించారు.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో భాజపా
ఘనవిజయం సాధించింది. 230 స్థానాలకు గాను 163 సీట్లలో గెలుపు సాధించి కాంగ్రెస్
నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎన్నికలు జరిగి రెండువారాలు, కౌంటింగ్ పూర్తయి
8 రోజులు అయిన తర్వాత ఇప్పటికి బీజేపీ తమ పార్టీ ముఖ్యమంత్రిని ఎంపిక చేసింది.
58 ఏళ్ళ మోహన్ యాదవ్ ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి.
రాష్ట్ర జనాభాలో ఓబీసీలు సగం కంటె ఎక్కువమంది ఉన్నారు. అయితే వారిలో యాదవులు అంత
ప్రభావశీలమైన సామాజికవర్గం కాదు. మోహన్ యాదవ్ గతంలోని శివరాజ్ చౌహాన్
మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేసారు. ఆయన ఉజ్జయిని నియోజకవర్గం
నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
‘‘నేను పార్టీలో ఒక చిన్న కార్యకర్తను మాత్రమే. నాకు ఈ అవకాశం
కల్పించినందుకు పార్టీకి ధన్యవాదాలు. రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలకు నా కృతజ్ఞతలు.
మీ అందరి ప్రేమ, ఆదరణతో నాకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చడానికి శక్తివంచన
లేకుండా ప్రయత్నిస్తాను’’ అని మోహన్ యాదవ్
చెప్పారు. సీఎం పేరు ప్రకటన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు మోహన్ యాదవ్‌ను కలిసి
అభినందించారు.
పార్టీ మోహన్ యాదవ్ పేరు ప్రకటించాక, ఆయన వెళ్ళి గవర్నర్
మంగూభాయ్ పటేల్‌ను కలిసారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా
ఉన్నట్టు గవర్నర్‌కు తెలియజేసారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కోసం పలువురు సీనియర్ నాయకులు
రేసులో ఉన్నారు. నాలుగుసార్లు సీఎంగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మాజీ
మంత్రులు ప్రహ్లాద్ పటేల్, నరేంద్రసింగ్ తోమర్, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి
కైలాస్ విజయవర్గీయ తదితరుల పేర్లు చక్కర్లు కొట్టాయి. అయితే, పార్టీ చివరికి మోహన్
యాదవ్‌ను ఎంపిక చేసింది.
‘‘పార్టీలో ఐక్యత ఉందనడానికి నిదర్శనంగా మాజీ ముఖ్యమంత్రి
శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా తానే మోహన్ యాదవ్ పేరును ప్రతిపాదించారు. ప్రహ్లాద్
పటేల్, నరేంద్రసింగ్ తోమర్, కైలాస్ విజయవర్గీయ వంటి సీనియర్ నాయకులు సహా అందరూ
మోహన్ పేరును ఆమోదించారు’’ అని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వి.డి. శర్మ
విలేఖరులకు తెలియజేసారు.
మోహన్ యాదవ్‌తో పాటు ఇద్దరు ఉపముఖ్యమంత్రుల పేర్లను కూడా బీజేపీ
వెల్లడించింది. మల్హాగఢ్ నియోజకవర్గం నుంచి గెలిచిన జగదీష్ దేవ్దా, రేవా
నియోజకవర్గం నుంచి ఐదోసారి గెలిచిన రాజేష్ శుక్లాలు మోహన్ యాదవ్ మంత్రివర్గంలో
ఉపముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తారు. మోహన్‌తో పాటు వీరిద్దరు కూడా శివరాజ్
క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసారు.
అధిష్ఠానం మోహన్ యాదవ్ పేరు ప్రకటించిన వెంటనే శివరాజ్
సింగ్ చౌహాన్ ఆయనను అభినందించారు. మోహన్ యాదవ్ కష్టించి పనిచేసే తత్వం ఉన్నవారని
శివరాజ్ చెప్పుకొచ్చారు.
డిసెంబర్ 3న జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో
విజయం సాధించింది. కానీ ముఖ్యమంత్రుల ఎంపిక ఆలస్యమయింది. ఆదివారం నాడు ఛత్తీస్‌గఢ్
ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ శాయిని ప్రకటించిన బీజేపీ, ఇవాళ అంటే సోమవారం నాడు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రకటించింది. ఇంక రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎంపిక మిగిలి
ఉంది.