Dr B R Ambedkar
Biography: Part 6
(అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాస పరంపర)
1949 నవంబర్ 26న రాజ్యాంగ రచనా పరిషత్ భారతీయుల తరఫున
కొత్త రాజ్యాంగాన్ని స్వీకరించింది. పరిషత్ అధ్యక్షుడు డా. రాజేంద్రప్రసాద్ ‘‘ఈ
రాజ్యాంగ నిర్మాణ కార్యక్రమం పూర్తవడం నాకు చాలా సంతోషంగా ఉంది. రాజ్యాంగ రచనా కమిటీ,
ప్రత్యేకించి దాని అధ్యక్షుడు డా. అంబేడ్కర్ తన ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ ఎంతో
ఉత్సాహంతో, శ్రద్ధతో, నిజాయితీతో పని పూర్తి చేసారు. రాజ్యాంగం బాధ్యత డా. అంబేడ్కర్‌కు
ఇవ్వడం ద్వారా మేం గొప్ప నిర్ణయం తీసుకున్నామని చెప్పగలను. స్వతంత్రభారతదేశపు
రాజ్యాంగ రూపశిల్పి డా. అంబేడ్కర్ తన బుద్ధి, ప్రతిభ, యోగ్యతలను ఉపయోగించి దేశానికి
ఒక కొత్త రాజ్యాంగాన్ని కానుకగా ఇచ్చాడు. అంతటి మానసిక ఔన్నత్యం, గొప్ప ప్రతిభ
కలిగిన మహాపురుషులు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా పుడతారు’’ అని వ్యాఖ్యానించారు.
అస్పృశ్యత అనే నల్ల చట్టం కథ ముగిసింది:
స్వతంత్ర భారతదేశపు కొత్త రాజ్యాంగాన్ని స్వయంగా డాక్టర్ అంబేడ్కర్ రూపొందించారు.
దేశం మొత్తం అన్ని అధికారాలూ ఆయనకు కట్టబెట్టింది. రాజ్యాంగ నిర్మాణంలో గొప్పగొప్ప
నాయకులు హృదయపూర్వకంగా పూర్తిగా సహకరించారు. హిందూ సమాజ చరిత్రలోని ఒక కలుషితమైన
అధ్యాయం ముగిసే సువర్ణ, చిరస్మరణీయ క్షణాలు ఆసన్నమయ్యాయి. ఈ దేశంలోని ప్రతీ హిందువూ
తనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా చట్టం ముందు సమానుడే అవుతున్నాడు. అంటరానితనం
అనే అనాచారానికి ముగింపు పలికే ప్రతిపాదన చేసారు. ఆ సందర్భంలో దేశపు ఉక్కుమనిషి
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రత్యక్షంగా ఉన్నారు. భారతదేశం అంతటా అంటరానితనం ఏ
రూపంలో ఉన్నప్పటికీ దానికి ముగింపు పలుకుతున్నట్లు భారత రాజ్యాంగ పరిషత్ 1947 ఏప్రిల్ 29న ప్రకటించింది. ఎవరైనా
అంటరానితనాన్ని బలవంతంగా పాటిస్తే వారు కచ్చితంగా దండనార్హులు అని స్పష్టం
చేసింది.
వేల యేళ్ళ తర్వాత భారత చరిత్రలోని సామాజిక
పుటల్లోని నల్లటి అక్షరాలు తుడిచివేయబడ్డాయి. ఆ మహత్తర ఘటన గురించి తెల్లటి పుటలపై
సువర్ణాక్షరాలతో రాయబడింది. మానవీయమైన జీవన విలువలు మరొకసారి విజయం సాధించాయి.
హిందూ సంస్కృతిలోని జీవత్వం అందరికీ తెలిసింది. హిందువులు తమ అన్ని చెడులనూ దూరం
చేసుకోడానికి సంఘర్షణ పడతారు, పడుతూనే ఉంటారు… అనే ఆత్మవిశ్వాసం జాగృతమయింది.
అప్పటివరకూ క్షీణించిపోతున్న హిందూసమాజపు
వెన్నెముక ఆరోగ్యవంతమై, బలం పుంజుకుంది. ఈ దేశంలో దళితులు, అస్పృశ్యులు అనబడేవారు
హిందువుల మానవత్వం అనే పవిత్రగంగలోకి మళ్ళీ చేరుకున్నారు. ఆ ప్రతిపాదనను సర్దార్
పటేల్ చేపట్టడం అనేది ఆయన మనసులో దళితుల పట్ల ఎంత మానవీయ సంవేదన జాగృతమైందన్న
దానికి నిదర్శనం. ఆ సందర్భంగా భారతదేశ ప్రజలందరూ వల్లభభాయ్ పటేల్‌కు కోట్లాది
శుభాకాంక్షలు చెప్పారు. చరిత్రలో ఆయన పేరు అజరామరంగా నిలిచిపోయింది. ప్రపంచంలోని
అన్ని వార్తాపత్రికలూ ఆ చర్యను ముక్తకంఠంతో ప్రశంసించాయి. డాక్టర్ అంబేడ్కర్ కల
నిజమైంది. కానీ ఇంకా చాలా పని జరగాల్సి ఉంది. హిందువులందరినీ ఒకటిగా ఉంచడం కోసం
హిందూ కోడ్ బిల్ అమల్లోకి తెచ్చారు.
సనాతనులు, శైవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు
అందరూ హిందువులే: రాజ్యాంగానికి రూపకల్పన చేస్తున్నప్పుడు, తర్వాత అంబేడ్కర్
న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడూ బాగా చర్చనీయాంశమైన విషయం ఏంటంటే అసలు హిందువులు
ఎవరు? అప్పుడు అంబేడ్కర్ చాలా నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. ఈ దేశంలో పుట్టిన
అన్ని సంప్రదాయాలూ… అంటే సనాతన, శైవ, సిక్కు, జైన, బౌద్ధ సంప్రదాయాలు అన్నీ
చట్టం దృష్టిలో హిందూమతంగానే పరిగణించబడతాయి. వాటన్నింటికీ ఒకటే చట్టం ఉంటుంది. ఆ
సమయంలో కొందరు సిక్కు సోదరులు తమకు కలిగిన తప్పుడు అభిప్రాయం ప్రకారం
రాజ్యాంగంలోని 25వ అనుచ్ఛేదానికి దూరంగా ఉండాలని భావించారు. ఆ ఆలోచనను అంబేడ్కర్
తీవ్రంగా వ్యతిరేకించారు. 1830లో ప్రీవీకౌన్సిల్ భారత రాజ్యాంగం తయారు చేసేవరకూ
సిక్కులను కూడా హిందువులుగానే పరిగణించేవారు. అందువల్లనే వారు నేడు కూడా
హిందువులుగానే ఉన్నారు. అనంతరకాలంలో అంబేడ్కర్ న్యాయశాఖ మంత్రి అయినప్పుడు ఆయన
‘హిందూ కోడ్ బిల్’ను ప్రతిపాదించారు. ఆయన దృష్టిలో అందరూ హిందువులే, హిందూ సమాజంలో
సమరసత నెలకొనాలి. ఆ తర్వాత కొన్నాళ్ళకు హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టి
ఆమోదించారు. హిందూధర్మంలోని అన్ని సంప్రదాయాలకు చెందిన వారందరికీ ఈ హిందూ కోడ్
బిల్లులో చోటు ఉంది. ‘‘భారతదేశంలో వైదిక, బౌద్ధ, జైన, సిక్కు మొదలైన ధర్మాలు
జన్మించాయి. అవేవీ తమకోసం సొంత చట్టమో లేక సొంత ధర్మశాస్త్రమో రచించుకోలేదు. వారు
తమకోసం స్వతంత్ర చట్టాలు లేదా ధర్మశాస్త్రాల రచన చేసి ఉండకపోతే కొత్త చట్టాలు చోటు
చేసుకోవు. బుద్ధీ లేదు, మహావీరులూ కాదు. నాకు తెలిసినంతలో సిక్కుల పదిమంది
గురువుల్లో ఎవరూ ఏ కొత్త ప్రొసీజర్ కోడ్ లేదా స్మృతి తయారు అవలేదు. రాజ్యాంగంలోని
25వ అనుచ్ఛేదంలో అంతకుమించిన కొత్త విషయం ఏముంది?’’ అని అడిగాడు అంబేడ్కర్. (డా.
అంబేడ్కర్: ఏక్ చింతన్ – పుట సంఖ్య 90 – మధు లిమయే రచన)
మతం మత్తుమందు కాదు: కమ్యూనిస్టు భావధారను
అనుసరించేవారు మతం ప్రస్తావన వస్తే చాలు, అదేమైనా మత్తుమందా అని
విరుచుకుపడిపోతుంటారు. వారు, మనందరమూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ విషయంలో
అంబేడ్కర్ ఏం చెప్పాడు? ఇప్పుడు తరుణవయస్కుల పరిస్థితి ఏమిటి?
‘‘తరుణ వయస్కుల(యువతీ యువకుల) ధర్మవిరుద్ధమైన ప్రవృత్తి
చూసి నాకు చాలా బాధ కలుగుతుంది. మతం మత్తుమందు లాంటిది అని కొంతమంది అంటారు. కానీ
అది సరైనది కాదు. నాలో ఏ మంచి గుణాలున్నాయో, నేను చదివిన చదువు వల్ల సమాజ హితం
కోసం నేను ఏయేం పనులు చేసానో ఆ లక్షణాలు నాలోని ధార్మిక భావనల కారణంగానే ఉన్నాయి.
నాకు మతం కావాలి, కానీ మతం పేరు మీద జరిగే అరాచకాలు వద్దు’’ అని అంబేడ్కర్
చెప్పాడు. (హమారే డా. అంబేడ్కర్ జీ : 9వ పుట : రచన ఆశ్చర్యలాల్ నరూలా)
డా. అంబేడ్కర్ ‘హరిజన’ శబ్దానికి విరోధి: 1936
జులై 19న బొంబాయి కౌన్సిల్లో కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పాటయింది. ఆ మంత్రిమండలిలో
షెడ్యూల్డు కులాల ప్రతినిధి ఒకరైనా ఉండాలని అంబేడ్కర్ అన్నాడు. ఆ సమయంలోనే
అంటరానివారిని ‘హరిజన’ పదంతో సంబోధించాలని సిఫారసు చేస్తూ ఒక ప్రభుత్వ బిల్లు
కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. డాక్టర్ అంబేడ్కర్, దాదాసాహెబ్ గైక్వాడ్ ఇంకా పలువురు
ఇతర సభ్యులు ఆ శబ్దాన్ని వ్యతిరేకించారు. కానీ మెజారిటీ ఉన్న కారణంగా కాంగ్రెస్ ఆ
శబ్దాన్ని ఆమోదించగలిగింది. అస్పృశ్యులు హరిజనులు – అంటే భగవంతుడి ప్రజలు అయితే
సవర్ణ హిందువుల రాక్షసులకు చెందిన వారా? అని దాదాసాహెబ్ ప్రశ్నించాడు కూడా. అంబేడ్కర్
కూడా ఆ శబ్దాన్ని వ్యతిరేకించారు. ‘‘హరిజన అనే పదం వల్ల మిగతావారు కపటులు అనే భావం
కూడా వస్తోంది. కాబట్టి మనం ఇంకోసారి
కలిసి కూర్చుని ఒక మంచి పదాన్ని ఎన్నుకుని చెబుదాం’’ అన్నాడు. కానీ అంబేడ్కర్ ప్రతిపాదనను
ఏమాత్రం పట్టించుకోలేదు. అప్పుడు ఆయనతో ఏకీభవించిన వారంతా కౌన్సిల్ నిర్ణయాన్ని
వ్యతిరేకిస్తూ హాల్ నుంచి వాకౌట్ చేసారు. దళితులు అందరికీ హరిజన శబ్దం ఉపయోగించడం
ఒకరకంగా అన్యాయం చేయడమే. వారిలో చాలామందికి నేటికీ దళిత శబ్దం ఇష్టం ఉండదు. (డా.భీ.అంబేడ్కర్
– వ్యక్తిత్వ్ ఏవం కృతిత్వ్ : పుటలు 154-155 : రచన డా. డి.ఆర్. జాటవ్)
బౌద్ధమత స్వీకారం
బౌద్ధం ప్రేమ, కరుణ, సౌభ్రాతృత్వం
నేర్పిస్తుంది: గొప్ప విద్వాంసుడు, దేశం కోసం – సమాజం కోసం జీవితాన్ని
సమర్పించినప్పటికీ అంబేడ్కర్‌కు పలు ప్రదేశాల్లో అవమానాలూ, తిరస్కారాలూ ఎదురవుతూనే
ఉన్నాయి. ఎక్కువమంది ప్రజలు ఆయనను గౌరవిస్తూనే ఉన్నప్పటికీ పాతకాలపు ఆలోచనల్లోనే
ఉండిపోయిన ప్రజల దుర్మార్గపు ప్రవర్తనల వల్ల బాధపడడం సాధారణమైపోయింది. ఆ సమయంలో
అంబేడ్కర్ మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ దేశంలోనే పుట్టిన, వికసించిన,
విస్తరించిన బౌద్ధమతం కూడా ఈ దేశంతో అనుబంధం కలిగినదే. ఆ ధర్మపు నైతిక విద్య
ప్రపంచంలోనే గొప్పది. ప్రేమ, ప్రజ్ఞ, కరుణ, సమత, అహింస, అస్తేయం వంటి లక్షణాలు ఆయన
హృదయంపై గొప్ప ప్రభావం చూపాయి. ఒకవైపు అవమానాలు, తిరస్కారాలు… మరోవైపు ప్రేమ,
కరుణల సందేశం. దాంతో బౌద్ధమతమే గొప్పది అని అంబేడ్కర్ నిర్ణయించుకున్నాడు. ఆయన
జీవితం చరమాంకంలోకి చేరుకుంటోంది కూడా. 1946 అక్టోబర్ 14 విజయదశమి రోజు బాబాసాహెబ్
అంబేడ్కర్ ప్రశాంతచిత్తంతో, హృదయంలోని వైరభావాలు అన్నింటినీ వదిలివేసి, మనసు నిండా
దేశభక్తి నింపుకుని బౌద్ధమతాన్ని స్వీకరించాడు.
ఆనాటి కార్యక్రమంలో అంబేడ్కర్ ఇలా చెప్పాడు, ‘‘అస్పృశ్యత
విషయంలో మహాత్మాగాంధీకి, నాకు తీవ్రమైన అభిప్రాయభేదాలున్నాయి. కానీ, సమయం
వచ్చినప్పుడు నేను ఈ దేశానికి అతితక్కువ హాని చేసే మార్గాన్ని ఎంచుకుంటానని ఒకసారి
మాటిచ్చాను. అందుకే ఇప్పుడు బౌద్ధమతాన్ని స్వీకరించి నామాట నిలబెట్టుకుంటున్నాను.
దేశానికి ఇదే నా సేవ. బౌద్ధం భారతీయ సంస్కృతిలో అవిభాజ్యమైన అంగం. ఆ మతంలోకి మారడం
వల్ల ఈ దేశపు సంస్కృతి, చరిత్ర, పరంపరలకు ఎలాంటి హానీ వాటిల్లదు. ఆ విషయంలో నేను
చాలా ముందుజాగ్రత్తలు తీసుకున్నాను.’’ (ప్రఖర్ రాష్ట్రభక్త్ డా.భీ.అంబేడ్కర్ : రచన
ఎస్ఆర్ రామస్వామి)
అంబేడ్కర్ బౌద్ధమతం స్వీకరించడం గురించి వీర
సావర్కర్ ‘అంబేడ్కర్ ఇప్పుడు నిజంగా హిందూశిబిరంలోకి వచ్చేసారు. బౌద్ధుడైన అంబేడ్కర్
హిందూ అంబేడ్కరే’ అన్నాడు. ఆ రోజుల్లో మహాస్థవిర చంద్రమణి, ఇంకా పలువురు
బౌద్ధభిక్షువులు, హైందవం – బౌద్ధం రెండూ ఒకే చెట్టుకు రెండు కొమ్మలు అని ప్రకటన
వెలువరించారు. అంబేడ్కర్ చేసింది ధర్మ పరివర్తన (మతాంతరీకరణ) కాదు, ఆత్మ పరిష్కారం.
దానర్ధం, అంబేడ్కర్ ఒక మతాన్ని విడిచిపెట్టి మరొక మతాన్ని స్వీకరించాడని ఎంతమాత్రం
కాదు అని ఒక బౌద్ధ లేఖకుడు వ్యాఖ్యానించాడు. (డా.భీ.అంబేడ్కర్ : పుట 364 : రచన డా.బ్రిజ్‌లాల్
వర్మ)
హిందూసమాజ ద్వారాలూ తెరచుకున్నాయి: కులవ్యవస్థే హిందూ సమాజపు పతనం, పరాభవం, బానిసత్వాలకు
ప్రధాన కారణం అని అంబేడ్కర్ భావిస్తుండేవారు. అదే సమయంలో, ఏవో కారణాల వల్ల హిందూధర్మాన్ని
విడిచి వేరే మతాలలోకి మారిపోయిన వారిని మళ్ళీ హిందూధర్మంలోకి తీసుకువచ్చే వ్యవస్థ
లేదే అని బాధపడేవారు. ‘‘హిందూ సమాజం తన ధర్మం నుంచి బైటకు వెళ్ళిపోయేవారికి దారులు
తెరిచిపెట్టి ఉంచింది. కానీ బైటినుంచి లోపలికి వచ్చే మార్గం మూసివేసింది. ఇదెలా
ఉందంటే నీళ్ళ ట్యాంకులోనుంచి నీళ్ళు లోపలికి వచ్చే దారి మూసేసి, బైటకు పోయే దారి
మాత్రం తెరిచిపెట్టి ఉంచినట్లుంది. హిందూ సమాజాన్ని రాబోయే అనర్థాల నుంచి
కాపాడాలంటే ఈ వ్యవస్థను మార్చడం అవసరం. (బాబా సాహెబ్ బాంచీభాషణే : ఐదవ సంపుటం, 16వ
పుట)
మతమార్పిడి తర్వాత
అస్పృశ్యుల స్థితి ఏమిటి?: తెల్లవారి పరిపాలన సమయంలో దేశంలో పెద్దసంఖ్యలో క్రైస్తవ
పాదరీలు డబ్బులు, వైద్యం వంటి వివిధ సౌకర్యాల ఆశ చూపించి లక్షల సంఖ్యలో
అస్పృశ్యులను క్రైస్తవులుగా మార్చేసారు. వారు సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని అభావంగా
జీవిస్తున్న హిందూబంధువులే. అంటరానివారు క్రైస్తవులో లేక ముస్లిములుగా మారినంతమాత్రాన
వారి సమస్యలు ఏమాత్రం తగ్గబోవని అంబేడ్కర్ చెప్పేవాడు. దానికి ఆయన ఉదాహరణలు కూడా
ఇచ్చాడు. సైమన్ కమిషన్ భారతదేశం వచ్చినపుడు, అప్పటికి చాలాకాలం ముందే క్రైస్తవులుగా
మారిన నిమ్నవర్ణాల ప్రజలు ఆ కమిషన్‌కు ఒక లేఖ సమర్పించారు. ‘‘మేమందరం కేథలిక్,
ప్రొటెస్టెంట్ వర్గాలకు చెందిన క్రైస్తవులము. భారతదేశంలో మతాంతరీకరణ ద్వారా
క్రైస్తవులుగా మారినవారిలో 60శాతం మంది నిమ్నవర్ణాలకు చెందినవారే. హిందువుల్లో
దళితులుగా ఉన్నప్పుడు మా పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉంది.
క్రైస్తవంలోకి మారిన తర్వాత కూడా మా కుల అస్తిత్వం అలాగే ఉంది. ఇప్పటికీ బ్రాహ్మణ
క్రైస్తవులు, మరాఠా క్రైస్తవులు, మహార్ క్రైస్తవులు, భంగీ క్రైస్తవులు.. ఇంకా
రకరకాల కులాలకు చెందిన క్రైస్తవులుగా ఉన్నాం. మేం ఒకరి ఇళ్ళలో ఒకరు భోజనాలు
చేయలేము, పెళ్ళిళ్ళు చేసుకోలేము. మా పిల్లలు బడులకు వెళ్ళలేరు. వాళ్ళకు హాస్టళ్ళలో
ప్రవేశం లభించదు. క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా మేము హిందూ దేవీదేవతల
తీర్థయాత్రలకు వెడుతూనే ఉన్నాము.’’
ప్రతీకారభావనే లేదు: అంబేడ్కర్,
ఆయన తోటివారు చాలాచోట్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు కానీ వారు హైందవం పట్ల, దేశం
పట్ల బాధ్యతను గుర్తెరిగి ఉండేవారు. వారిలో ప్రతీకార భావనలు లవలేశం కూడా ఉండేవి కావు.
హత్యలు చేసే విప్లవమార్గం గురించి వారు అసలు ఎప్పుడూ ఆలోచించనే లేదు. వారు
స్వభావరీత్యా సజ్జనులు, బుద్ధికి తర్కశాస్త్రజ్ఞులు, ఆనాటి కఠినమైన పరిస్థితులను
అర్ధం చేసుకునేవారు.
ఎప్పటికీ ముస్లిం లేదా
క్రైస్తవుణ్ణి కాను: మహమ్మదీయ, క్రైస్తవ మతాలు దళితులకు ఎంతమాత్రం ఉపయుక్తం కావని
అంబేడ్కర్ ఉద్దేశం. ‘‘ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే ఈ దేశంలో ముస్లిముల సంఖ్య
రెట్టింపు అయిపోతుంది. అప్పుడు ముస్లిం ప్రభుత్వం ఏర్పడే ప్రమాదం పుట్టుకొస్తుంది.
అలాగే క్రైస్తవమతాన్ని స్వీకరిస్తే దేశంలో క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతుంది.
అప్పుడు దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం మరింత బలపడుతుంది’’ అని చెప్పాడాయన. (డా.బీ.
అంబేడ్కర్ వ్యక్తిత్వ్ ఏవం కృతిత్వ్ : పుట 201 : రచన డా.ఆర్.జాటవ్)
అలా, అంబేడ్కర్, తను మతం
మారేటప్పుడు కూడా దేశభక్తిని ప్రకటించాడు. దళితులు ఈ దేశపు మూల నివాసులు. వారు ఆ
రెండు మతాల్లో దేన్నయినా ఎంచుకుంటే వారు తప్పకుండా తమ సొంతదేశంలోనే విదేశీయులు
అయిపోయేవారని అంబేడ్కర్ వివరించాడు.
అంబేడ్కర్‌ను మహమ్మదీయ
మతంలోకి మారితే కోట్ల రూపాయలు ఇస్తానంటూ హైదరాబాద్ నిజాం ప్రలోభపెట్టడానికి
ప్రయత్నించాడు. కానీ అంబేడ్కర్ దానికి లొంగలేదు. అలాగే, దళితులను క్రైస్తవమంతంలోకి
మారిస్తే వారికి రకరకాల సౌకర్యాలు కల్పిస్తామని, డబ్బులు కూడా పెద్దమొత్తంలో
పంచిపెడతామనీ పెద్దపెద్ద క్రైస్తవ మిషనరీలు ఆయన వెనుక పడ్డారు. వారిని కూడా
అంబేడ్కర్ ఇసుమంతైనా లెక్కపెట్టలేదు.
<>
‘‘చదువు నేర్చుకో, సంఘటితంగా ఉండు,
పోరాటం చేయి’’ – డా. అంబేడ్కర్