పార్లమెంటులో ప్రశ్నలు వేసేందుకు డబ్బు వసూలు చేసిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదిక మేరకు టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రాపై (tmc mp mahua moitra) బహిష్కరణ వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహువా ఇవాళ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మెయిత్రా డబ్బులు, విలువైన బహుమతులు పొందారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై విచారించిన ఎథిక్స్ కమిటీ ఆమెను ఎంపీ పదవి నుంచి బహిష్కరించాలని సూచించింది. దానిపై చర్చించిన లోక్సభ మహువాపై వేటు వేసింది.
మహువాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే, న్యాయవాది అనంత్ దెహద్రాయ్ చేసిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ వేశారు. ఆ కమిటీ 500 పేజీల నివేదికను తయారు చేసింది. మహువా అనైతిక, సభాధిక్కరణకు పాల్పడ్డారని ఎథిక్స్ కమిటీ అభిప్రాయపడింది. నిబంధనలకు విరుద్దంగా లోక్సభ లాగిన్ వివరాలు బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు కమిటీ నిర్థారించింది. కమిటీ నివేదిక లోక్సభలో ప్రవేశపెట్టగా, దానిపై గంటకుపైగా చర్చ జరిగింది. ఆ తరువాత మహువాను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.