జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తోన్న 370 అధికరణ రద్దు (article 370) అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇవాళ వెలువరించింది. జమ్మూకశ్మీర్ అంశంలో పార్లమెంటు, రాష్ట్రపతి ప్రకటనలపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. 370 అధికరణ రద్దు విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. జమ్మూకశ్మీర్ ఏర్పడినప్పుడు 370 అధికరణ ద్వారా ప్రత్యేక స్వయం ప్రతిపత్తి లేదని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఆ అధికరణ అనేది తాత్కాలిక నిబంధన మాత్రమేనని వెల్లడించింది.
జమ్మూకశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయలేరని సుప్రీంకోర్టు పేర్కొంది. అప్పట్లో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్ 370ని తీసుకువచ్చారు. అది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, శాశ్వతం కాదని గుర్తుచేసింది. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని స్పష్టం చేసింది. హక్కుల విషయంలో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేకతలేమీ లేవని తేల్చి చెప్పింది. దేశంలోని మిగతా కేంద్ర పాలిత ప్రాంతాలతో అది సమానమేనని తీర్పు వెలువరించింది. 370 ఆర్టికల్ ప్రకారం కూడా జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ తీర్పును చదివి వినిపించారు.
జమ్మూ కశ్మీర్‌ను విడకొట్టి లద్దాఖ్‌ను విభజించడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. వీలైనంత త్వరగా జేకేకు రాష్ట్ర హోదా పునరుద్దరించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.