గాజాలో హమాస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం దాడులు (israel hamas war) ముమ్మరం చేసింది. దక్షిణ గాజాపై వైమానిక, భూతల దాడులు కొనసాగిస్తోంది. అయితే తమ ఖైదీల విడుదల, చర్చలు లేకుంటే ఇజ్రాయెల్ బందీలు సజీవంగా వెళ్లలేరంటూ హమాస్ ఉగ్రవాదులు హెచ్చరించారు. ఇప్పటికీ 137 మంది ఇజ్రాయెల్ బందీలు హమాస్ చెరలో ఉన్నారు.
పాలస్తీనాకు చెందిన 7 వేల మంది ఖైదీలు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్నారు. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదుల భీకరదాడుల తరవాత ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టింది. ఉగ్రవాదులంతా లొంగిపోవాలని లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు హెచ్చరించారు. కాల్పుల విరమణ కొనసాగించాలంటూ అంతర్జాతీయ ఒత్తిడి వస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం ఖాతరు చేయడం లేదు. గాజాలో భీకరదాడులు కొనసాగిస్తోంది.
గాజాలో దాడులు తీవ్రం కావడంతో అక్కడ మానవ సంక్షోభం నెలకొనే ప్రమాద ఉందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే 39 వేల మంది ఆసుపత్రుల సమీపంలో తలదాచుకుంటున్నారు. మొత్తం 24 లక్షల మంది జనాభాలో 19 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.