ఒరిస్సాలో ఆదాయపన్ను శాఖ (income tax raids) అధికారులు జరిపిన దాడుల్లో గత ఐదు రోజుల్లోనే రూ.353 కోట్ల నల్ల డబ్బు వెలుగు చూసింది. 50 మంది ఐటీ అధికారులు, 40 కౌంటింగ్ మెషీన్లతో 24 గంటలు లెక్కించినా ఇంకా కొంత మిగిలే ఉందనే వార్తలు సంచనంగా మారాయి. దేశ చరిత్రలో ఇంత బ్లాక్ మనీ వెలికితీయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
కాంగ్రెస్ ఎంపీ కుటుంబానికి చెందిన డిస్టలరీలో రూ.353 కోట్ల నల్ల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుకు సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లు, పరిశ్రమల్లో ఈ బ్లాక్ మనీ వెలుగు చూసింది. సోమవారం నగదు లెక్కింపు పూర్తయినట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రకటించారు. జలంగీర్ జిల్లాలో రూ.305 కోట్లు, సంబల్పూర్ రూ.37.5 కోట్లు, టిట్లాగర్‌లో రూ.11 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమచేయనున్నారు.
176 డబ్బు సంచులను ఆదాయపన్ను శాఖ ఎస్బిఐకి పంపింది. అందులో 140 బ్యాగుల్లో నగదు లెక్కించినట్లు బ్యాంకు మేనేజర్ వెల్లడించారు. మిగిలిన డబ్బు లెక్కింపు ఇవాళ పూర్తవుతుందని చెప్పారు.