Dr B R Ambedkar Biography: Part 5
(అంబేడ్కర్ వర్ధంతి
సందర్భంగా ప్రత్యేక వ్యాస పరంపర)
హిందువులు తమ తప్పులు దిద్దుకునేందుకు సంకల్పించారు:
రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చి గొప్ప చరిత్ర సృష్టించింది. కానీ కేవలం
రాజకీయ అధికారాల వల్ల మాత్రమే సమానత్వం రాదు. ధార్మిక, సామాజిక, ఆర్థిక రంగాల్లో
కూడా అలాంటి మంచి ప్రయత్నం జరగాలి. దానికోసం దేశంలోని ప్రముఖులైన వారంతా ముందుకు
రావాలి. అందులో భాగంగానే 1969లో కర్ణాటకలోని ఉడుపి వద్ద వేలమంది సాధువులు, సంత్మహారాజ్లు,
మహామండలేశ్వరులు, శంకరాచార్యులు అందరి సమావేశం జరిగింది. వారి సర్వసమ్మతితో వారి
ముందు ఈ ప్రతిపాదన ఉంచడం, ఆమోదించడం జరిగింది. ఆ ప్రతిపాదన ఏంటంటే ‘న హిందూ పతితో
భవేత్, హిందవః సోదరా స్సర్వే’ హిందువు ఎప్పుడూ నిమ్నుడు లేదా చిన్నవాడు అవడు. హిందువులందరూ
పరస్పరం సోదరులే. ధర్మాచార్యులు ఆమోదించిన ఈ ప్రకటన 1927 మహాడ్ సత్యాగ్రహం కంటె
ముందే జరిగి ఉండిఉంటే చరిత్రకు ఓ కొత్త దిశ లభించి ఉండేది. బాబాసాహెబ్ అంబేడ్కర్
పూర్తిగా దేశభక్తుడు, మానవతావాది, ధర్మమంటే ప్రాణం పెట్టేవాడు, సాత్విక ప్రవృత్తి
కలిగిన మహాపురుషుడు. ఆయన విశాల హృదయంలో సంకుచితత్వానికి స్థానమే లేదు.
ఘర్షణ హిందూ ఉద్ధారకులకు హిందూ పురాతన పంథీయులకు
మధ్య ఉండాలి: అంబేడ్కర్ కోరిక మొదటినుంచీ ఒకటే. అస్పృశ్యతా నివారణ ఆందోళన
స్పృశ్యులు, అస్పృశ్యుల మధ్య కాకుండా, హిందూ ఉద్ధారకులు హిందూ పురాతన పంథీయుల మధ్య
ఉండాలి అన్నదే ఆయన కోరిక. ఆ దిశలో అంబేడ్కర్ వందల మంది సవర్ణులైన సమాజోద్ధారకులతో కలిసి
పనిచేసారు.
సవర్ణులు, దళితులు కలిసి పనేయాలి: అస్పృశ్యులందరూ
ఒక జట్టుగా సవర్ణులకు వ్యతిరేకంగా పోరాడాలని ఒక వర్గపు నాయకులు భావించేవారు. అంబేడ్కర్
మాత్రం మరోలా భావించేవారు. అస్పృశ్యోద్ధరణ అన్న అంశం మొత్తం హిందూ సమాజానికి
సంబంధించినది. దానికోసం సవర్ణులు, అస్పృశ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని
అంబేడ్కర్ హృదయపూర్వకంగా కోరుకున్నారు.
ఆ ఉద్దేశంతోనే అంబేడ్కర్ 1924 జులై 20న బహిష్కృత
హితకారిణీ సభ ఏర్పాటు చేసాడు. దానికి సర్ చిమన్లాల్ సీతల్వాడ్ అధ్యక్షుడు.
అంబేడ్కర్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆ సంస్థ ఏర్పాటు సమావేశంలో ఆయన ఇలా చెప్పాడు,
‘‘ఉన్నత వర్గాలకు మా డిమాండ్ ఏంటంటే మీ శక్తిసామర్థ్యాలు మొత్తం రాజకీయాల్లో
మాత్రమే పెట్టేయకుండా, బహిష్కృత ప్రజల అభ్యున్నతికి జరుగుతున్న కృషికి సహకరించండి.’’
1946 జనవరి 14న సోలాపూర్‌లో డాక్టర్ ములే
గురించి గౌరవపూర్వకంగా చేసిన ప్రసంగంలో అంబేడ్కర్ ‘‘ఆయన సహకారంతోనే ఇరవై ఏళ్ళ క్రితం
నా కార్యక్రమాలను ప్రారంభించాను’’ అని చెప్పాడు.
మహాడ్ సత్యాగ్రహం సమయంలో బ్రాహ్మణేతరులు
అంబేడ్కర్‌కు ఒక ప్రతిపాదన చేసారు. మీ ఆందోళనలోనుంచి బ్రాహ్మణులను
తొలగించివేస్తే తమ పూర్తి సహకారం అందిస్తామన్నారు. దానికి అంబేడ్కర్ ఒప్పుకోలేదు.
‘‘నాకు బ్రాహ్మణులతో ఎలాంటి గొడవా లేదు. ఇతరుల గురించి హీనంగా ఆలోచించే వారి చెడుబుద్ధితోనే
నా గొడవంతా. భేదభావం గురించి ఆలోచించే అబ్రాహ్మణుల కోరిక మీద, ఎలాంటి భేదభావమూ
చూపించని బ్రాహ్మణులను నేను దూరం చేసుకోలేను’’ అని చెప్పాడు. అంబేడ్కర్ సన్నిహితుల్లో
చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. వారు ఆయన ఆందోళనల్లో పూర్తి సహకారం
అందిస్తుండేవారు. మిలింద్ మహావిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఠకార్ను స్వయంగా అంబేడ్కరే
నియమించాడు. అతనితో ఆయన ఇలా అన్నాడు, ‘‘అబ్బాయ్, నేను బ్రాహ్మణులకు విరోధినైతే
నువ్వు ఇక్కడ ఉద్యోగంలో చేరగలిగేవాడివి కాదు.’’
సవర్ణ బంధువులకు విన్నపం: అస్పృశ్యత గురించి ఆలోచించేటప్పుడు తమను తాము
సవర్ణులుగా భావించేవారి గురించి ఆలోచించాలని అంబేడ్కర్ చెప్పేవాడు. సమాజంలో
అస్పృశ్యత ఉంటే దానికి అస్పృశ్యులు, దళితులు బాధ్యులా? వారి స్పర్శ మాత్రంతోనే
సవర్ణులు అపవిత్రమైపోతారంటే అలాంటి ఆలోచనలను ఎవరు మారుస్తారు? దానికి ఎవరు
బాధ్యులు? అని అంబేడ్కర్ అడిగేవాడు. ఆ విషయంలో చొరవ తీసుకున్నది రాష్ట్రీయ
స్వయంసేవక్ సంఘ్ రెండవ సర్సంఘచాలక్ గోళ్వల్కర్. ‘‘అస్పృశ్యత అన్నది కేవలం
అస్పృశ్య జనుల సమస్య కాదు. సవర్ణులు అనబడేవారి మనసుల్లో ఉండే సంకుచిత భావనలే
దీనికి మూలకారణం. అందువల్ల సవర్ణుల మనసుల్లో అస్పృశ్యత భావన ఎప్పటివరకూ నశించిపోదో,
అప్పటివరకూ ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అవదు. మానవుల మనోభావాలు వికసించడంలోనే ఈ సమస్యకు
పరిష్కారం ఉంది’’ అని చెప్పాడాయన.
ఇప్పుడు ఒంటరిగా నడవడం సరికాదు: ‘‘దేశం స్వతంత్రమయింది. వందల యేళ్ళ పరాయి పాలన
తొలగిపోయింది. ఇక మన దేశంలో మన చట్టాలు వర్తిస్తాయి. అందరికీ సమానంగా హక్కులు
లభించాయి. ఇప్పుడు మనముందు దేశ నిర్మాణమన్న ప్రశ్న ఉంది. రాజ్యాంగ నిర్మాణ కమిటీలో
అత్యధికులు సవర్ణులే. అందరూ కలిసి, ఇప్పుడు మీ అందరికీ సమాన హోదా కల్పించారు. అది
కేవలం నేనొక్కడినీ చెప్పినంతమాత్రాన జరిగిన పని కాదు. ఈ విషయంలో అందరూ తమతమ
సదాశయాలను ప్రకటించారు. అందువల్ల దళితులు ఇకపై తమను తాము ఒంటరివారని భావించకూడదు’’
అని చెప్పాడు అంబేడ్కర్.
ఒంటరిగా ముందుకు సాగడం వల్ల ఏ పనీ పూర్తవదు, దేశంలో వందలాది జాతులు, కులాలు,
వర్గాలు, ఇంకా అనేక ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారు. కానీ అందరిదీ ఒకే దేశం, అందరు
ప్రజలూ ఒకటే. అందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకునే వాతావరణం దేశంలో ఉండాలి… అని
అంబేడ్కర్ ఉద్దేశం. తన మాటలను మరింత స్పష్టం చేస్తూ అంబేడ్కర్ ఇలా చెప్పాడు,
‘‘షెడ్యూల్డు కులాల ప్రజలు తమ ఒంటరితనాన్ని వదిలిపెట్టి మిగతా కులాల వారితో చేతులు
కలిపి, దేశ స్వాతంత్ర్యాన్ని మరింత బలోపేతం చేయాలి. ఇప్పటివరకూ మన మానసికభావాలు
సంకుచితంగా ఉండేవి. మన కులాల హితమే మనకు సర్వస్వంగా ఉండేది. కానీ ఇప్పుడు మనం
స్వాతంత్ర్యం సాధించాం. ఇప్పుడు మన దృష్టికోణాన్ని మార్చుకోవాలి. మన కులపు
హితాన్ని దృష్టిలో ఉంచుకుంటూనే కొత్తగా వచ్చిన స్వాతంత్ర్యాన్ని బలోపేతం చేయడం
కోసం మిగిలినవారితో చేయి చేయి కలపాలి. ఇప్పుడు కూడా ఈ ఆక్రమణ మార్గం అనుసరిస్తే మనకే
దెబ్బ తగులుతుంది. దానికి బదులుగా మన ప్రజలు స్వయంగా తమ యోగ్యతను పెంచుకోడానికి
ప్రయత్నించాలి. దానికోసం మనం మరింత కష్టపడాలి. మన మనసులను పరిశుద్ధం చేసుకోవాలి,
అప్పుడే మన మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి.’’
హిందువులందరూ కలిసి పనిచేయాలి, హిందూ సమాజంలో కులభేదాలు సమసిపోవాలి అని
అంబేడ్కర్ చెప్పేవాడు. 1928 డిసెంబర్ 25న మహాడ్‌లో జరిగిన సభకు అధ్యక్షుడి హోదాలో అంబేడ్కర్
చేసిన ప్రసంగాన్ని నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురించింది. ‘‘ఈ ఆందోళనలో మనం
హిందువులు అందరినీ ఒకే జాతిగా సంఘటితం చేయడంలో విజయవంతమైతే మనం భారతదేశానికి,
ప్రత్యేకంగా హిందూ సమాజానికీ గొప్ప సేవ చేసినవాళ్ళమవుతాం’’ అని చెప్పాడాయన.
‘‘ఏ వ్యక్తీ తన గౌరవపు విలువను బట్టి గొప్పవాడు కాలేడు. ఏ మహిళా తన సతీత్వపు
వెలను బట్టి గొప్పది కాలేదు. ఏ దేశమూ తన స్వతంత్రానికి వెలకట్టి గొప్పదేశం
కాలేదు’’
– డా. బీఆర్ అంబేడ్కర్