ఉచిత పథకాలపై రాజకీయ పార్టీలు పోటాపోటీగా తాయిలాలు ప్రకటించడంపై ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు అంటే జేబులకు భరోసా ఇవ్వడం కాదన్నారు. ప్రజలను శక్తివంతం చేయకుండా ఉచితాలు ఇవ్వడం సబబుకాదని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని భారత మండపంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ (nhrc) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉచితాలు అనేవి ప్రజలు ఆర్థికంగా ఆధారపడటాన్ని మరింత పెంచుతుందని ధన్‌ఖడ్ పేర్కొన్నారు.ప్రస్తుతం ఇస్తోన్న ఉచితాలు వ్యయ ప్రాధాన్యతలను వక్రీకరించడమే అవుతుందని ఆయన అన్నారు. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉచితాలు అనేవి ఆర్థిక స్థిరత్వ ప్రాథమిక సూత్రాలను బలహీనపరుస్తాయని ధన్‌ఖడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉచితాలు దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన హెచ్చరించారు.