హమాస్ ఉగ్రవాదులను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం (israel hamas war) ముందుకు సాగుతోంది. తాజాగా దక్షిణ గాజాపై వైమానిక, భూతల దాడులను పెంచింది. వేలాది మంది పాలస్తీనా పౌరులు ఆశ్రయం కోల్పోయారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోన్నా… ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ దాడులను మాత్రం ఆపడం లేదు.
ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని ప్రధాన నగరమైన ఖాన్ యూనిస్, అక్కడి నుంచి ఈజిప్ట్ లోని రఫా సరిహద్దుకు వెళ్లే దారిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం దాడులు పెంచింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 17700 మంది పాలస్తీనా పౌరులు మరణించారని గాజా ఆరోగ్య మంత్రి ప్రకటించారు. అక్టోబరు 7న హమాస్ దాడులకు తెగబడిన తరవాత ఇజ్రాయెల్ యుద్దం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హమాస్ వద్ద 137 మంది బందీలు ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇజ్రాయెల్ భీకర దాడులతో ప్రజలు ఆసుపత్రులు, వాటి సమీపంలో ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తర గాజాలో వేలాది మంది అల్ షిఫా వద్ద ఆశ్రయం పొందుతున్నారు. ఇకపై కుదరకపోవచ్చని స్థానిక మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ దాడిలో ఈ ఆసుపత్రి ధ్వంసమైంది. గాజా దక్షిణ ప్రాంతంలోనూ దాడులు పెంచడంతో వేలాది మంది శరణార్ధులు పాస్టిక్ కవర్లతో వేసిన గుడారాల్లో కాలం గడుపుతున్నారు.
గడచిన 24 గంటల్లోనే అల్ బలాహ్‌లోని అల్ అక్సా ఆసుపత్రికి 71 మృతదేహాలు చేరుకున్నాయని హమాస్ ఆరోగ్య అధికారులు తెలిపారు. గాజాలోని 24 లక్షల జనాభాలో 19 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస ప్రకటించింది. అక్కడ మానవ సంక్షోభం తలెత్తే ప్రమాదముందని హెచ్చరించింది. గాజాలో 10 లక్షల మంది బాలలు కనీస సదుపాయలు లేక, ఆహారం అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఐరాస బాలల విభాగం ఆందోళన వ్యక్తం చేసింది.