గుట్కా అనుబంధ వాణిజ్య ప్రకటనల్లో నటించిన ముగ్గురు అగ్ర బాలీవుడ్ నటులకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరిలో షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ ఉన్నారు. నోటీసులు అందుకున్న వారిలో వీరి ముగ్గురూ ఉన్నట్లు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌కు ప్రభుత్వం తరపు న్యాయవాది వెల్లడించారు.
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల్లో పాల్గొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న వారు ఇలాంటి ప్రకటనల్లో నటించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
విచారించిన కోర్టు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పిటీషనర్ మరోసారి కోర్టుకెక్కారు.
ప్రభుత్వ స్పందన కోరుతూ అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.ఈ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టు (supreme court) పరిధిలో ఉందని పిటీషన్ కొట్టివేయాలని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కోర్టులో వాదనలు వినిపించారు. తదుపరి విచారణ వచ్చే ఏడాది మే9కి వాయిదా వేశారు.