పాకిస్తాన్ సైన్యం కార్గిల్ ప్రాంతంలో చొరబాట్లను తాను తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వెల్లడించారు. కార్గిల్ చొరబాట్లను వ్యతిరేకించినందుకే తన ప్రభుత్వాన్ని అప్పటి జనరల్ ముషారఫ్ కూలదోశారని ఆయన గుర్తుచేశారు. భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధాల్లో కార్గిల్(pak bharat war) ఒకటి. అందులో పాక్ సేనలు ఘోర వైఫల్యం చవిచూశాయి. పాక్ కుయుక్తులను భారత సైన్యం తిప్పికొట్టింది. 1999లో జరిగిన ఈ యుద్ధం తరవాత భారత సైన్యం కార్గిల్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది.
నాటి యుద్ధానికి అప్పటి జనరల్ ముషారఫ్ కారణమంటూ, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1993, 1999లో రెండు సందర్భాల్లోనూ తన పదవీ కాలం పూర్తి కాక ముందే దించేశారని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గుర్తుచేశారు. కార్గిల్ చొరబాట్లను వ్యతిరేకించడం వల్లే ముషారఫ్ తనను పదవి నుంచి తప్పించారని వాపోయారు. సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని తాను కోరుకున్నట్లు చెప్పారు. తన పదవీ కాలంలో భారత్ నుంచి ఇద్దరు ప్రధానులు పాక్‌ను సందర్శించారని చెప్పారు.