మహిళా ఎస్సైపై దాడి ఘటన సంచలనంగా మారింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సై హైమావతిపై శుక్రవారం రాత్రి రాళ్లతో దాడి చేశారు. ఆమె కాలికి తీవ్ర గాయమైంది. రాళ్ల దాడిలో ఆమె సెల్ ఫోన్ పగిలిపోయింది. ప్రొద్దుటూరు రామేశ్వరం బైపాస్ రోడ్డులోని రెండు కుళాయిల సమీపంలో ఈ దాడి జరిగింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
రాత్రి విధుల్లో ఉన్న ఎస్సై హామావతికి అక్రమ ఇసుక రవాణా గురించి సమాచారం రావడంతో ఆమె బైపాస్ రోడ్డుకు వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు వేగంగా బైక్పై వచ్చి సమీపం నుంచి రాళ్లు విసిరినట్లు హైమావతి తెలిపారు. దాడి విషయం తెలియడంతో రక్షక్ వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.