కరెంటు కోతలు కొత్తేమీ కాదు. అయితే దేశమంతా ఒకేసారి కరెంటు పోయిన ఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా లంకలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ ప్రభావం విద్యుత్ రంగంపై కూడా పడింది. సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్ సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నా, అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరా లేకపోవడం వల్లే గ్రిడ్ విఫలమైందనే వార్తలు వస్తున్నాయి. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
గత ఏడాది నుంచి శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభం (srilanka crisis) ఎదుర్కొంటోంది. ఇంధనం, ఆహారం, ఔషధాల సరఫరా కూడా అస్తవ్యస్తంగా మారింది. విదేశీ మారక నిల్వలు కూడా అడుగంటిపోయాయి. ఇంధన దిగుమతులకు కూడా విదేశీ డబ్బు చెల్లించలేని దుస్థితి నెలకొంది. సంక్షోభం తరవాత లంకలో రోజుకు 10 నుంచి 14 గంటల విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. తాజాగా దేశమంతా అంధకారం నెలకొంది.