Sanctum Sanctorum of Ayodhya Ram Temple
అయోధ్యలో బాలరాముడి ఆలయ
నిర్మాణ పనులు సజావుగా సాగుతున్నాయి. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన
కార్యదర్శి చంపత్ రాయ్ ఇవాళ మందిరం గర్భాలయం ఎలా ఉంటుందో చూపించారు. గర్భగృహం
ఛాయాచిత్రాన్ని ‘ఎక్స్’ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ప్రభు శ్రీ రామ్‌లల్లా
గర్భగృహస్థానం నిర్మాణం దాదాపు పూర్తయింది. లైటింగ్-ఫిటింగ్ పనులు కూడా తాజాగా
పూర్తయ్యాయి’ అంటూ ఎక్స్‌లో గర్భాలయం ఫొటోలను చంపత్ రాయ్ పంచుకున్నారు.
అత్యంత సుందరంగా
తీర్చిదిద్దిన బాలరామ మందిర గర్భగృహం అత్యద్భుతంగా, కన్నుల పండువగా ఉంది. 2024
జనవరి 22 మధ్యాహ్నం అభిజిన్ముహూర్తంలో 12 గంటల నుంచి 12.45 నిమిషాలలో బాలరాముడి
విగ్రహాన్ని ఈ గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు.
ఈ మందిరంలో
ప్రతిష్ఠించడం కోసం బాలరాముడి మూడు విగ్రహాలు తయారు చేయిస్తున్నారు. ముగ్గురు
కళాకారులు అయోధ్యలోని మూడు వేర్వేరు ప్రదేశాల్లో వాటిని తీర్చిదిద్దుతున్నారు.
వాటిలో అత్యుత్తమంగా ఉండే విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. ఆ మూడు
విగ్రహాలూ దాదాపు చివరి దశలో ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకూ ఎవరినీ చూడనీయలేదు.
ఆ మూడు విగ్రహాల్లో
ఒకటి రాజస్థాన్‌లోని మక్రానా నుంచి తెచ్చిన వైట్ మార్బుల్‌తో రూపొందిస్తున్నారు.
మిగతా రెండు విగ్రహాలనూ కర్ణాటక నుంచి తెచ్చిన శిలలతో తీర్చిదిద్దుతున్నారు. తొలుత
నేపాల్, ఒడిషా, మహారాష్ట్రల నుంచి కూడా శిలలు తీసుకువచ్చారు. కానీ అవి మూలవిరాట్
విగ్రహం తయారుచేయడానికి అనువుగా లేవు.
బాలరాముడి విగ్రహాల తయారీ దాదాపు పూర్తయిందని
చంపత్ రాయ్ ఇటీలే చెప్పారు. ‘‘రామజన్మభూమి మందిరంలో 4అడుగుల 3అంగుళాల ఎత్తులో
5ఏళ్ళ వయసు గల రామ్‌లలా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. దాని కోసం ముగ్గురు
కళాకారులు మూడు వేర్వేరు శిలలతో మూర్తులను తయారుచేస్తున్నారు. ఆ విగ్రహాల నిర్మాణం
90శాతం పూర్తయింది. వాటిలో ఒకదాన్ని భగవంతుడు ఆమోదిస్తాడు. దాన్ని ఆలయం మొదటి
అంతస్తులోని గర్భగృహంలో ప్రతిష్ఠిస్తారు. మొదటి అంతస్తు నిర్మాణం దాదాపు
పూర్తయింది. అందువల్ల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏ ఇబ్బందులూ లేవు’’ అని ఆయన
వివరించారు. ఈ నెలలో జరిగే శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సమావేశంలో, ఆ
మూడు మూర్తులలో ఒకదాన్ని గర్భగృహంలో ప్రాణప్రతిష్ఠకు ఎంపిక చేస్తారు. మిగతా
రెండింటినీ ఆలయంలోని వేర్వేరు ప్రదేశాల్లో ప్రతిష్ఠిస్తారు.
ఆలయ ప్రాణ ప్రతిష్ఠ
కార్యక్రమాన్ని 86ఏళ్ళ మథురానాథ్ దీక్షిత్ అనే వేదపండితుడు నిర్వహిస్తారు. ఆయన
వారణాసికి చెందిన 17వ శతాబ్దపు గొప్ప వైదిక విద్వాంసుడు గాగాభట్టు వంశపరంపరకు
చెందినవాడు. గాగాభట్టు సుమారు 350 ఏళ్ళ క్రితం, అంటే 1674లో ఛత్రపతి శివాజీకి
పట్టాభిషేకం చేయించిన మహానుభావుడు. ఇప్పుడు ఆయన వారసుడికి
శ్రీరామజన్మభూమిక్షేత్రంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసే అవకాశం రావడం విశేషం.