బీఆర్ఎస్
శాసనసభా పక్షనేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికయ్యారు. బీఆర్ఎస్
ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ లో సమావేశమై ఈ మేరకు తీర్మానించారు. మాజీ స్పీకర్ పోచారం
శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆరే ఉండాలని ఏకవాక్య తీర్మానం
ప్రవేశపెట్టగా ఎమ్మెల్యేలు బలపరిచారు.
కేసీఆర్‌కు శస్త్రచికిత్స జరగడంతో నేటి
సమావేశానికి ఆయన హాజరు కాలేదు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా గన్‌పార్క్ వద్ద
అమరవీరులకు నివాళులర్పించారు. అటు నుంచి ప్రత్యేక బస్సులో అసెంబ్లీకి వెళ్ళి
సమావేశాల్లో పాల్గొన్నారు.
ప్రొటెం
స్పీకరుగా ఎన్నికైన ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో గవర్నర్ తమిళసై
ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ దూరంగా ఉండగా, బీఆర్ఎస్ నుంచి
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు, గుత్తా సుఖేందర్
రెడ్డి హాజరయ్యారు. అక్బరుద్దీన్ ప్రస్తుతం చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి శాసనసభకు
ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నికకు
నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
శాసనసభ్యుల
ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం కోసం నాలుగు
రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.
ప్రొటెం
స్పీకర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా బీజేపీ నేతలు హాజరుకాలేదు.
కొత్త
అసెంబ్లీ సమావేశాలకు అసెంబ్లీ భవనం ముస్తాబైంది. రంగులు వేయడంతో పాటు
విద్యుదీపాలతో అలంకరించారు.
శాసనసభ
సమావేశాల సందర్భంగా భద్రతా చర్యలపై సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా సమీక్ష
నిర్వహించారు.