గాజాలో ఇజ్రాయెల్ సైన్యం వ్యవహరిస్తోన్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గాజాలో అదుపులోకి తీసుకున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం (israel hamas war) అమానుషంగా వ్యవహరించిన తీరుపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. బందీల కళ్లకు గంతలు కట్టి, లో దుస్తుల్లో వారిని ట్రక్కుల్లో తరలిస్తున్న వీడియోలు దుమారం రేపుతున్నాయి.ఇజ్రాయెల్ సైన్యం తీరుపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
జబాలియా శరణార్ధి శిబిరంపై దాడి చేసి ఇజ్రాయెల్ సైన్యం అక్కడి పాలస్తీనియన్లను అదుపులోకి తీసుకుంది. అనంతరం ఆ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బందీలందరూ హమాస్ ఉగ్రవాదులని, వీరు లొంగిపోయారంటూ ఫోటోలతోపాటు కామెంట్లు పెట్టారు. వారిలో సాధారణ పాలస్తీనా పౌరులే అత్యధికంగా ఉన్నారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి.
పాలస్తీనియన్లను అరెస్ట్ చేసిన తరవాత వారి దుస్తులు తొలగించి, కళ్లకు గంతలు కట్టి వారిని గుర్తుతెలియని ప్రదేశాలకు తరలిస్తున్నారనే విమర్శలను ఐడీఎఫ్ ప్రతినిధి ఖండించారు. మేం బందీల ఫోటోలు చూశాం. వారంతా హమాస్ ఉగ్రవాదులని ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగారి వెల్లడించారు.