Lord Ram connects India’s
Ayodhya and Thailand’s Ayutthaya
భారతదేశంలో అయోధ్యకు, థాయ్‌లాండ్‌లో
అయుత్తయకూ 3,500 కిలోమీటర్ల దూరం ఉంది. కానీ, రెండు వేర్వేరు దేశాల్లోని రెండు
వేర్వేరు నగరాలను కలుపుతున్న బంధం రాముడే. రెండు దేశాల ప్రజలనూ ఏకత్రితం చేస్తున్న
బంధం కూడా రాముడే.
ఇప్పుడు థాయ్‌లాండ్ అంటున్న సియామ్, 13వ
శతాబ్దపు ప్రథమార్థంలో ఒక రాజ్యంగా ఏర్పడింది. బ్యాంకాక్ నగరానికి ఉత్తరంగా 70
కిలోమీటర్ల దూరంలో ఉన్న అయుత్తయ, సియామ్ రాజ్యానికి రాజధానిగా అమిత ప్రాధాన్యం
కలిగిన నగరంగా ఉండేది.
అయుత్తయ అన్న పేరుకు మూలం శ్రీరాముడి
జన్మస్థానమైన ‘అయోధ్య’లోనే ఉంది. థాయ్‌లాండ్‌లో హిందూధర్మం ప్రభావాన్ని అయుత్తయ
అన్న పేరు సూచిస్తుంది. రామాయణానికి థాయ్ రూపమైన రామాకీన్లో కూడా అయుత్తయ
ప్రస్తావన ఉంది.
అయుత్తయ రాజ్యానికి మొదటి రాజు
రామాతిబోడీ ఈ నగరానికి అయుత్తయ అని పేరు పెట్టాడు. ఆయన పేరు కూడా రామాయణం
ప్రభావంతో పెట్టినదే. థాయ్ రాజవంశాల్లో అనుసరించే సంప్రదాయాలు హిందూ వైదిక సంప్రదాయాల
ఆధారంగా ఏర్పడినవే. ఇక రాజ కుటుంబం అనుసరించే ధార్మిక, రాజనైతిక సైద్ధాంతిక భావజాలాన్ని
రామాయణంలో రాముడు అనుసరించిన సిద్ధాంతాల నుంచే స్వీకరించారు.
అనంతర కాలంలో సియామ్‌ను పరిపాలించిన చక్రి వంశాన్ని
1782లో స్థాపించిన రాజు పేరు రామా1. అయుత్తయ రాజ్యస్థాపకుడైన రామాతిబోడీ పేరు
నుంచే ఈ రాజు పేరు పెట్టారు. అప్పటినుంచీ థాయ్‌లాండ్ రాజులందరూ తమ పేరులో రామ
అన్న పేరును పెట్టుకోడాన్ని ఒక ఆనవాయితీగా పాటించారు.
ఆగ్నేయాసియాకు రామాయణాన్ని
తీసుకువెళ్ళింది బౌద్ధ సన్యాసులు. అయుత్తయ రాజ్యం అధికారంలో ఉన్న సమయంలోనే థాయ్
భాషలో రామాయణాన్ని రచించారు. తర్వాత రామాకీన్ మొదటి వెర్షన్‌ను రామా1 రూపొందించారు.
అదే ఇప్పటికీ వ్యాప్తిలో ఉంది.
థాయ్ సంస్కృతిని రాముడు చాలా గొప్పగా
ప్రభావితం చేసాడు. ఎంతలా అంటే అయోధ్యలో ఇప్పుడు నిర్మిస్తున్న, వచ్చే జనవరిలో
ప్రాణప్రతిష్ఠ కావించనున్న రామజన్మభూమి మందిరానికి అయుత్తయ నుంచి మృత్తికను పంపించారు.
విశ్వహిందూ పరిషత్, వరల్డ్ హిందూ ఫౌండేషన్ చొరవతో ఆ పని జరిగింది.
‘‘అయోధ్యలో శ్రీరాముడి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ
కార్యక్రమాన్ని చూసేందుకు 51 దేశాల ప్రతినిథులను గుర్తించాం. నేను, సుశీల్ కుమార్
సరాఫ్ కూడా అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతాము’’ అని వరల్డ్ హిందూ
ఫౌండేషన్‌కు చెందిన స్వామీ విజ్ఞానంద చెప్పారు. అయుత్తయ నుంచి మృత్తికను పంపడానికి
ముందు, థాయ్‌లాండ్‌లోని రెండు నదుల నుంచి పవిత్ర జలాలను అయోధ్యకు తీసుకువచ్చారు.
భారత్-థాయ్‌లాండ్ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఎంత బలమైనవో దీనివల్ల
తెలుస్తుంది.
రెండు దేశాల మధ్యా పోలికలు అక్కడితో
ఆగవు. భారతదేశంలో కార్తీక పూర్ణిమ, దేవ దీపావళి జరుపుకున్నట్టే థాయ్‌లాండ్‌లో లోయ్
క్రాతాంగ్ అనే పండుగ చేసుకుంటారు. దాన్ని థాయ్‌లాండ్‌లో దీపాల పండుగగా
భావిస్తారు. ఇక ఆ దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో శివుడు, పార్వతి, గణేశుడు, ఇంద్రుడు
తదితర దేవీదేవతల మూర్తులను ప్రతిష్ఠించారు. అక్కడ ప్రజలు తమ భక్తిప్రపత్తులతో
పూజలు చేస్తుంటారు.
థాయ్ చరిత్ర ప్రకారం అయుత్తయ నగరం 14-18
శతాబ్దాల మధ్య విపరీతంగా ప్రాచుర్యం పొందిన నగరం. ఆ సమయంలో అది ప్రపంచంలోని
అతిపెద్ద నగర ప్రాంతాల్లో ఒకటిగా పేరు గడించింది. అంతర్జాతీయ వాణిజ్యానికీ, దౌత్యానికీ
ప్రధానమైన కేంద్రంగా కీర్తినార్జించింది. ఆ నగరంపై బర్మా సైన్యం 1767లో దాడి
చేసింది, నగరాన్ని మొత్తం తగలబెట్టేసింది. అక్కడి ప్రజలను నగరం వదిలిపెట్టి
వెళ్ళిపోయేలా తరిమేసింది. ఆ తర్వాత ఆ నగరాన్ని ఇంక పునర్నిర్మించలేదు. అయుత్తయ నగర
శిథిలాలు ఇవాళ ఆ ప్రదేశానికి పురాతత్వ స్థలంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.
అయుత్తయ నాగరికతకు గుర్తుగా అక్కడి కళా
సంప్రదాయం నేటికీ సజీవంగా ఉంది. వివిధ విదేశీ ప్రభావాలను కూడా కలుపుకునిపోతూ కొనసాగుతోంది.
అంకోర్ నుంచి వారసత్వంగా వచ్చిన సుఖోథాయ్ కళావిధానంలో జపాన్చ చైనా, భారత్ తదితర
దేశాల కళాశైలులను మిశ్రమం చేసిన ఓ సరికొత్త సంప్రదాయిక విధానంలో అయుత్తయ లోని
భవనాలు కనులవిందు చేస్తుంటాయి.
థాయ్‌లాండ్‌లోని రెలిజియస్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా
పనిచేస్తూ ఆ దేశంలో సుమారు పాతిక సంవత్సరాలుగా నివసిస్తున్న భారతీయుడు డాక్టర్
సురేష్ పాల్ గిరి ఇలా చెబుతున్నారు, ‘‘మీరు నిలబడిన ఈ నేల భారతదేశపు మిస్సింగ్ లింక్‌లో
ఒక భాగం. థాయ్‌లాండ్ జన్యుపరంగా హిందూదేశం. తర్వాతి కాలంలో బౌద్ధం వచ్చి ఇక్కడి
హిందూయిజంలో కలిసింది. ఈ దేశంలో వెయ్యేళ్ళ పురాతనమైన బ్రహ్మ విష్ణు శివ ఆలయం ఉంది.
మూడువేల యేళ్ళ పురాతనమైన మరో హిందూ మందిరం
కూడా ఉంది. దాన్ని భారతీయ రాజులే నిర్మించారని భావిస్తారు. థాయ్‌లాండ్‌లో ఉంటే
మనకు భారతదేశంలో ఉన్నట్టే ఉంటుంది. కాలంతో పాటు కొన్ని పరిస్థితులు మారుతూ ఉంటాయి.
కానీ దాన్నంతా జాగ్రత్తగా నమోదు (డాక్యుమెంట్) చేసారు. థాయ్‌లాండ్ రాజును రామ అంటారు,
రామ 1, రామ 2, అలా ఇప్పుడున్న రాజును రామ 10 అంటారు. భారత్, థాయ్‌లాండ్ రెండు
దేశాలూ రామరాజ్యాన్నే కోరుకుంటున్నాయి.’’
భారత సంతతికి చెందిన సింగపూర్ నివాసి
ప్రియాంకా షెనాయ్, అయుత్తయ నగరాన్ని సందర్శించడం తనను తన మతానికీ, తన సంస్కృతికీ
చేరువగా తీసుకువెళ్ళిందని భావించారు. ‘‘నిజంగా చెప్పాలంటే భారతీయ సంస్కృతి ఇంతదూరం
వ్యాపించిందన్న విషయం మనసుకు చాలా హాయిగా ఉంది. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, ఈ
సంస్కృతిని అనుసరించాలని వీళ్ళను ఎవరూ బలవంతపెట్టలేదు. భారతీయ సంస్కృతిని వీరు తమ
జీవన విధానంగా మలచుకున్నారు. ఒక సామాన్య థాయ్ జీవిత విధానం, హిందువుల జీవిత విధానం
దాదాపు ఒక్కలాగే ఉంటాయి. ఇలా ఉండాలని వారి తలకు తుపాకీ గురిపెట్టి ఎవరూ చెప్పలేదు.
ఈ ప్రదేశం (అయుత్తయ) ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది మనను మన ధర్మానికి దగ్గరగా
తీసుకువెళ్ళినట్టు ఉంది’’ అని ప్రియాంక అభిప్రాయపడింది.
ఢిల్లీకి చెందిన సంజయ్ కుమార్ ఆర్య, గత
పాతికేళ్ళుగా సింగపూర్‌లో నివసిస్తున్నాడు. థాయ్‌లాండ్‌కు పర్యాటకుడిగా వెళ్ళాడు.
‘‘నేను గతంలో అయోధ్య వెళ్ళాను. నేనొక కరసేవకుడిని అని గర్వంగా చెప్పుకుంటాను. రెండుదేశాలమధ్యా
పోలికలేంటి, తేడాలేంటి అన్న విషయం తెలుసుకోడానికే నేను ఇక్కడికి వచ్చాను. అయుత్తయ
200 ఏళ్ళ క్రితమే అభివృద్ధి చెందింది. కానీ భారతదేశంలోని అయోధ్య వేలాది
ఏళ్ళనాటిది. థాయ్‌లాండ్ రాజు భగవాన్ శ్రీరాముడి భక్తుడని తెలుస్తోంది. అదెంత
గొప్ప విషయం’’ అని చెప్పుకొచ్చాడు.
భారత సంతతికి చెందిన మయన్మార్ వాసి
ఊర్మిళా శర్మ అయుత్తయ పర్యటన సమయంలో ఇలా చెప్పింది, ‘‘భగవాన్ శ్రీరామచంద్రుడికి,
థాయ్‌లాండ్ రాజులకు అతిపెద్ద పోలిక ఏంటంటే వారిద్దరూ ఎన్నో త్యాగాలు చేసారు. వారు
తమ సోదరుల కోసం తమ రాజ్యాలనే త్యాగం చేసారు. అయోధ్యలో శ్రీరాముడికి పునర్వైభవం
తీసుకురావడానికి మాలాంటి ఎందరో కరసేవకులు ప్రాణాలు పణంగా పెట్టారు. ఇప్పుడు మా
ప్రయత్నం ఎలా ఉండాలంటే భారతదేశంలో రామరాజ్యాన్ని తీసుకురావాలి, ఓ కొత్త అయోధ్య
వెలిగిపోవాలి’’ అని చెబుతూ జై శ్రీరామ్ నినాదాలు చేసింది.
అయుత్తయ నగరాన్ని బర్మా సైన్యం కాల్చి
నేలమట్టం చేసినప్పుడు అక్కడ రాతితో కట్టిన ఎన్నో ఆలయాలు, బౌద్ధ సన్యాసుల స్థావరాలూ
ఉండేవి. అయుత్తయ ఆలయం, అందులోని నిర్మాణాల డిజైన్లను పరిశీలిస్తే, అవి హిందూ థాయ్
నిర్మాణశైలుల మిశ్రమంలా కనిపిస్తాయి. అంకోర్వాట్ ఆలయ శిథిలాలను పోలి ఉంటాయి.
అయుత్తయను సందర్శించిన భారతీయ పర్యాటకుడు
పరేష్ శర్మ, చరిత్ర పరిరక్షణ ఆవశ్యకతను గుర్తు చేసుకున్నారు. ‘‘చరిత్రలో జరిగింది
తలచుకుంటే చాలా బాధగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని చూస్తుంటే, మనకు ముఖ్యమైన వాటిని
పరిరక్షించుకోవడం ఎంత ముఖ్యమో అర్ధమవుతుంది. మనకు ప్రధానమైన వాటిని భద్రపరచుకోవాలన్న
భావన ఉండాలి.’’
మయన్మార్‌లో జన్మించిన భారత సంతతి
వ్యక్తి బజరంగ్ శర్మ ‘‘నేను హిందూధర్మానికి, సంస్కృతికి చెందినవాడిని. అయుత్తయలో
నివసించే ప్రతీ వ్యక్తి హృదయంలోనూ రాముడున్నాడు. థాయ్‌లాండ్ ప్రజలు తమ రాజును
భగవాన్ రాముడిలా పూజిస్తారు. కొందరు రాముడిని నమ్ముతారు, మరికొందరు నమ్మరు. కానీ
థాయ్‌లాండ్‌లో రాముడు అన్న భావనను వ్యతిరేకించే వ్యక్తి ఒక్కరు కూడా లేరు. నా
ఉద్దేశంలో భారతదేశం కూడా ఈ విషయంలో థాయ్‌లాండ్ నమూనాను అనుసరించాలి, రామరాజ్యాన్ని
తీసుకురావాలి’’ అన్నారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అయుత్తయ
నుంచి మృత్తిక చేరడంతో రెండు నగరాల మధ్యా శతాబ్దాల నాటి అనుబంధం మరోసారి
వెలుగులోకి వచ్చింది. ‘‘భారత్-థాయ్‌లాండ్ మధ్య బలమైన సాంస్కృతిక, చారిత్రక
బంధాలున్నాయి. థాయ్ రాజులు రాముడి వంశ పరంపరకు చెందినవారు. వారందరి పేర్లలోనూ రామ
అని తప్పనిసరిగా ఉంటుంది, అది తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం’’ అని వరల్డ్
హిందూ ఫౌండేషన్‌కు చెందిన స్వామి విజ్ఞానంద చెప్పారు.
2024 జనవరి 22న అయోధ్యలో రామమందిర
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. దాన్ని థాయ్‌లాండ్‌లో ప్రత్యక్ష ప్రసారం
చేస్తారు. ఆరోజు ఆ దేశమంతటా కీర్తనలు, భజనలు, పూజలు జరుగుతాయి.
‘‘మేం అయోధ్య నుంచి ప్రసాదం
తెప్పించుకుంటున్నాం. అయోధ్య మందిర నమూనా ఒకటి ఇక్కడ నిర్మించారు. అయోధ్య
రామజన్మభూమి చిత్రం కూడా తీసుకువచ్చాం. దాని కాపీలను ఇక్కడ పంచిపెడతాం. అయోధ్యలోని
పండుగ వాతావరణం ప్రపంచమంతా వ్యాపించాలి’’ అన్నారు స్వామి విజ్ఞానంద.
శ్రీరామచంద్రుడి ఆలయ ప్రాణప్రతిష్ఠ కోసం
ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఈ తరుణంలో రాముడి బోధనలకు, రామరాజ్యానికీ ప్రతీకగా
నిలిచింది అయుత్తయ. అయోధ్య నుంచి అయుత్తయ వరకూ వ్యాపించిన రామతత్వం, థాయ్ సమాజం
మీద శాశ్వతముద్ర వేసింది.