తాను మూడోసారి ప్రధాని అయినప్పుడు భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. డెహ్రాడూన్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023ను (global investers summit 2023) ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని ఆయన గుర్తుచేశారు. గడచిన కొద్ది కాలంలోనే 13 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని తెలిపారు.
ఉత్తరాఖండ్లో మౌలిక సదుపాయాల వృద్ధి వేగంగా జరుగుతోందని, పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రమని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వచ్చాక ప్రయాణ సమయం మూడో వంతుకు తగ్గిందని మోదీ గుర్తుచేశారు.
పెట్టుబడుల సదస్సుకు ముందు ప్రధాని మోదీ డెహ్రాడూన్లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. అంతరం ఎగ్జిబిషన్ పరిశీలించారు. లక్పతి దీదీ అభియాన్ ద్వారా రాబోయే రోజుల్లో 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇది కొంచెం కష్టమే అయినా అసాధ్యం కాదన్నారు. గ్రామీణ ఉత్పత్తులను వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేయాలన్నారు. మన దేశం ప్రపంచ దేశాలపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించాలని మోదీ సూచించారు.
దేశంలోని కోటీశ్వరులు వారి పిల్లలకు విదేశాల్లో కోట్లుఖర్చు చేసి పెళ్లి చేసే బదులు, డెహ్రాడూన్లాంటి సుందరమైన ప్రదేశాల్లో వివాహాలు జరిపించుకోవాలని సూచించారు.
మేకిన్ ఇండియాలో భాగంగా వెడ్ ఇన్ ఇండియాకు ప్రధాని పిలుపునిచ్చారు.