Latest photos of Ram
Mandir construction released
అయోధ్యలో శ్రీరామచంద్రుడి ఆలయ నిర్మాణ
పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2024 జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో
మందిర నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. అక్కడ జరుగుతున్న కట్టడం పనుల తాజా ఫొటోలను
శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది.
ట్రస్టు నిర్వహణలో మందిర నిర్మాణం నిలకడగా
జరుగుతోంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నాడు రామ్ లల్లా (బాలరాముడి) విగ్రహాన్ని
గర్భాలయంలో ప్రతిష్ఠిస్తారు. ఆలయం లోపల గచ్చు కడుతున్న చిత్రాలు, లోపలి స్తంభాలపై
చెక్కుతున్న శిల్పాల చిత్రాలను కూడా ఇప్పటికే ట్రస్ట్ విడుదల చేసింది. ఇక గర్భగుడిలో
ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహ నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయని శ్రీరామజన్మభూమి
ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు.
‘‘రామజన్మభూమి మందిరంలో బాలరాముడి
విగ్రహం స్థాపిస్తాం. ఐదేళ్ళ వయసులో ఉన్న బాలుడి రూపంలో రాముడి విగ్రహాన్ని తయారు
చేయిస్తున్నాం. దాని ఎత్తు 4 అడుగుల 3 అంగుళాలు. దాన్ని అయోధ్యలోని మూడు
ప్రాంతాల్లో ముగ్గురు కళాకారులు నిర్మిస్తున్నారు. చివరికి వాటిలో ఒకదాన్ని రాముడే
ఎంచుకుంటాడు. ఆ విగ్రహాలు అన్నీ 90శాతం పూర్తయినవే. మిగతా కొంచెం పనీ సుమారు వారం
రోజుల్లో పూర్తవుతుంది’’ అని చంపత్ రాయ్ వివరించారు.
‘‘రామ్‌లల్లా మూర్తిని ఆలయం మొదటి
అంతస్తులో ఉండే గర్భగృహంలో ప్రతిష్ఠిస్తారు. ఆ అంతస్తు నిర్మాణం దాదాపు పూర్తయింది.
కాబట్టి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఏ సమస్యా లేదు’’ అని చంపత్ రాయ్
చెప్పుకొచ్చారు. ఆనాటి కార్యక్రమానికి ఇప్పటికే దేశం నలుమూలల నుంచీ 4వేల మంది
సాధుసంతులను ఆహ్వానించారు.
ప్రాణప్రతిష్ఠకు వారం ముందు, అంటే జనవరి
16 నుంచే వైదిక సంప్రదాయాలతో కార్యక్రమం మొదలవుతుంది. జనవరి 22 నాటి కార్యక్రమాన్ని
వారణాసికి చెందిన వేదపండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ నిర్వహిస్తారు. జనవరి 14నుంచే
అయోధ్యలో అమృత మహోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా 1008 కుంభాలతో సహస్ర కుంభ మహాయాగం
నిర్వహిస్తారు. జనవరి 22నాటి ప్రాణప్రతిష్ఠకు 10-15వేల మంది అతిథులకు ఏర్పాట్లు
చేస్తున్నారు.