ఖలిస్తానీ
వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ హత్యకు కుట్ర ఆరోపణలను భారత్ తీవ్రంగా పరిగణించి దర్యాప్తు
చేస్తోందని వైట్‌హౌస్ అధికారిక ప్రకటన చేసింది.
భారత్
తమ వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్న అమెరికా,
అలాగే పసిఫిక్ లోని క్యాడ్ కూటమి సభ్యదేశమని గుర్తు చేసింది. వివిద అంశాలపై
పరస్పర అవగాహనతో ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయని, ఇక ముందు కూడా ఎలాంటి ఆటంకాలు
లేకుండా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో ఆరోపణల తీవ్రతను
కూడా అర్థం చేసుకున్నామని వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ విభాగం ప్రతినిధి జాన్
కిర్బీ అన్నారు.
భారత్
–అమెరికా మధ్య సంబంధాలపై పన్నూ హత్య కుట్ర ఆరోపణలు ఏమేరకు ప్రభావం చూపుతాయనే
ప్రశ్నకు సమాధానంగా కిర్బీ ఈ వివరణ ఇచ్చారు. ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిగి బాధ్యులను గుర్తించాలని
ప్రస్తుతం ఈ పక్రియ సజావుగా జరుగుతుందన్నారు. కుట్రదారులను గుర్తించి బాధ్యులను
చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఖలిస్తానీ
ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను హతమార్చడానికి నిఖిల్ గుప్తా అనే వ్యక్తి
విఫలయత్నం చేశాడని, భారత ప్రభుత్వ అధికారి సూచన మేరకే ఈ హత్యాయత్నం జరిగిందని
నవంబర్ లో అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఆధారాలు లేకుండా భారత్ ను
వివాదం లోకి లాగడం సరికాదన్న మన విదేశాంగ శాఖ, ఈ కేసును తాము పరిశీలిస్తున్నామని
బదులిచ్చింది.