ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లిన విద్యార్ధుల మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2018 నుంచి నేటి వరకు విదేశాల్లో 403 మంది భారత విద్యార్ధులు చనిపోయారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో అత్యధికంగా 91 మంది కెనడాలోనే చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
గడచిన ఐదేళ్లలో 34 దేశాల్లో 403 మంది భారత విద్యార్థులు చనిపోయినట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. అత్యధికంగా కెనడాలో 91 మంది, ఇంగ్లాండ్‌లో 48, రష్యాలో 40, అమెరికాలో 36, ఆస్ట్రేలియాలో 35, ఉక్రెయిన్‌లో 21, జర్మనీలో 20, సైప్రస్‌లో 14, ఇటలీ, ఫిలిప్పీన్స్‌లో 10 మంది చొప్పున విద్యార్ధులు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయారని మంత్రి తెలిపారు.
ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లే విద్యార్ధుల సంఖ్య అధికంగా ఉండటం వల్లే అక్కడ మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని తేలింది. మరణాల్లో ఎక్కువగా వ్యక్తిగత కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర కారణాలు, కుట్రల వల్ల చనిపోయిన వారి విషయంలో ఎంబసీ అధికారులు ఆయా కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి చెప్పారు. కెనడాతో భారత్ దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతినడంతో అక్కడి భారతీయ విద్యార్ధులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.