హమాస్ ఉగ్రదాడితో మొదలైన యుద్ధంలో ఇప్పటి వరకు 5 వేల మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ (israel hamas war) ప్రకటించింది. ఇప్పటికే ఉత్తర గాజాను స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు. తాజాగా దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులు ముమ్మరం చేసింది. గడచిన రెండు నెలల కాలంలో 5 వేల మంది హమాస్ ఉగ్రవాదులను చంపేసినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. యుద్దం కారణంగా గాజాలో 18 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.
ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో పాలస్తీనా పౌరులు 17170 మంది చనిపోయారని, మరో 46 వేల మంది తీవ్రంగా గాయపడినట్లు గాజా ఆరోగ్య మంత్రి ప్రకటించారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 1200 మంది చనిపోయారు. 240 మందిని బందీలుగా చేసుకున్నారు. తాజాగా గురువారంనాడు ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో 340 మంది పాలస్తీనియన్లు చనిపోయారని గాజా ఆరోగ్య మంత్రి ప్రకటించారు.