Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా
రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రమాణస్వీకారం
కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు, వందల మంది కాంగ్రెస్ సీనియర్ల సమక్షంలో గవర్నర్
తమిళిసై సౌందర రాజన్ రేవంత్ రెడ్డితో
ప్రమాణ స్వీకారం చేయించారు.
అంతకుముందు, సోనియా గాంధీతో కలిసి పూలు అలంకరించిన వాహనంపై రేవంత్ రెడ్డి
ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలు, కాంగ్రెస్
కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ వేదికపైకి వెళ్లారు.
ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి
విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండ సురేఖ,
తుమ్మలనాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,
పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేశారు.
ప్రమాణస్వీకారం కార్యక్రమం ముగిసిన
తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా సోనియాగాంధీకి పాదాభివందనం చేశారు.
అలాగే వేదికపై ఉన్న అతిథులను పలకరించారు.
తెలంగాణ శాసనసభ స్పీకర్ గా వికారాబాద్
ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 2012లో కిరణ్
కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ప్రసాద్
కుమార్, మంత్రిగా పనిచేశారు.
ప్రగతిభవన్ ముందున్న బారికేడ్లను
అధికారులు తొలగించారు, గ్యాస్ కట్టర్ల సాయంతో బారికేడ్లు తీసివేస్తున్నారు. రోడ్డు
పక్కన ఉన్న షెడ్లు, గ్రిల్స్ ను
తొలగించారు.
సీఎం రేవంత్ రెడ్డికి పలువురు రాజకీయ,
సినీ, వ్యాపార ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.