పాకిస్తాన్లో వరుస ఉగ్రవాదుల హత్యలు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ (pak terrorist shot dead) కీలక అనుచరుడు అద్నాన్ అహ్మద్‌ను కొందరు దుండగులు కాల్చి చంపారు. ఇలా ఉగ్రవాదులంతా వరుసగా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు. పాక్‌లోని కరాచీలో డిసెంబరు 2వ తేదీ అర్ధరాత్రి అద్నాన్ ఇంటి బయట ఉండగా దగ్గర నుంచి కాల్పులు జరిపినట్లు మీడియా కథనాల ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానికులు ఆసుప్రతికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.
2015లో జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపుర్‌లో బీఎస్ఎఫ్ సిబ్బంది కాన్వాయ్‌పై జరిగిన భీకర ఉగ్రదాడిలో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. 13 మంది గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి సూత్రధారి అద్నాన్ అని అనుమానిస్తున్నారు. 2016లో కశ్మీర్‌లోని పాంపోర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో కూడా ఇతను కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.