Amit Shah says in Lok Sabha that PoK is ours
మూడవరోజు పార్లమెంటు
సమావేశాల్లో జమ్మూకశ్మీర్ పునర్విభజన (సవరణ) బిల్లు, జమ్మూకశ్మీర్ రిజర్వేషన్లు
(సవరణ) బిల్లులను లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లులపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదేనని వ్యాఖ్యానించారు.
జమ్మూకశ్మీర్ శాసనసభలో రెండు
సీట్లు కశ్మీరీ శరణార్థులకు, ఒక సీటు పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి తరిమివేయబడిన
వారికి కేటాయిస్తామని అమిత్ షా లోక్సభకు చెప్పారు. మొదటిసారిగా జమ్మూకశ్మీర్
శాసనసభలో 9 స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తున్నామన్నారు.
ఆ సందర్భంగా హోంమంత్రి
మాట్లాడుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే అన్నారు. దేశ ప్రథమ ప్రధానమంత్రి నెహ్రూ
తప్పిదం వల్లే పీఓకే అంశం వివాదాస్పదమైందని వ్యాఖ్యానించారు. ‘‘పండిట్ జవాహర్ లాల్
నెహ్రూ నిర్ణయం వల్ల రెండు తప్పులు జరిగాయి. మొదటిది, మన సైన్యం గెలిచే దశలో
ఉన్నప్పుడు యుద్ధవిరమణ ప్రకటించారు. ఆ ప్రకటన మరో మూడురోజుల తర్వాత చేసి ఉంటే పాక్
ఆక్రమిత కశ్మీర్ ఇవాళ భారత్లో అంతర్భాగంగా ఉండేది. ఇక రెండో తప్పు, మన అంతర్గత
విషయాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుకువెళ్ళడం’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆ
రెండు తప్పుల వల్లా జమ్మూకశ్మీర్ ప్రజలు ఇన్నేళ్ళుగా బాధలు పడుతూనే ఉన్నారని అమిత్
షా లోక్సభలో చెప్పారు.
నెహ్రూ మీద అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేసారు.
జమ్మూకశ్మీర్లో పరిస్థితిని
మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అమిత్ షా చెప్పుకొచ్చారు. 370వ
అధికరణాన్ని రద్దుచేసాక జమ్మూకశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని
వివరించారు. 370 అధికరణం రద్దు తర్వాతనే 2021లో జమ్మూకశ్మీర్లోని మొట్టమొదటి
మల్టీప్లెక్స్ నిర్మాణం జరిగిందని గుర్తుచేసారు. ఆ తర్వాత కశ్మీర్ లోయలో వందకు
పైగా సినిమాల షూటింగ్లు జరిగాయనీ, వందకు పైగా సినిమా థియేటర్ల నిర్మాణానికి
బ్యాంకులు రుణాలిచ్చే ప్రక్రియ సాగుతోందనీ వివరించారు.
ఈ చర్చ మంగళవారం మొదలుపెట్టినప్పుడు
డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గోమూత్రానికి
ప్రాధాన్యతనిచ్చే హిందీ రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ గెలవగలదనీ, దక్షిణభారతంలో ఆ పార్టీకి
తావు లేదనీ వ్యాఖ్యలు చేసారు. తీవ్ర వివాదానికి దారి తీసిన ఆ వ్యాఖ్యలను లోక్సభ
స్పీకర్ సభ రికార్డులలోనుంచి తొలగించారు. అంతకుముందు సెంథిల్ కుమార్, తన వ్యాఖ్యలు
తప్పేనని ఒప్పుకుంటూ వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు లోక్సభలో చెప్పారు. తన
వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు.