JK Bills for justice to those ignored, says Amit Shah
జమ్మూకశ్మీర్లో ఇన్నాళ్ళూ
అన్యాయాలకు గురైనవాళ్ళు, అవమానాలు ఎదుర్కొన్నవాళ్ళు, అన్నిరకాలుగా విస్మరించబడిన
వాళ్ళకు హక్కులు కల్పించే ఉద్దేశంతోనే రెండు బిల్లులు చేసామని, వాటిని ఆమోదం కోసం లోక్సభ
ముందు ఉంచామనీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు.
జమ్మూకశ్మీర్ రిజర్వేషన్
(సవరణ) బిల్లు, 2023… జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2023 లపై
లోక్సభలో చర్చకు ఇవాళ జవాబిస్తూ హోంమంత్రి, స్వదేశంలోనే శరణార్థులుగా బలవంతంగా
మార్చబడిన వారికి న్యాయం కల్పించడమే ఆ
రెండు బిల్లుల లక్ష్యమని వివరించారు. ‘‘ఈ రెండు బిల్లులపై చర్చలో పాల్గొన్న
సభ్యులు ఎవరూ వాటి మౌలిక తత్వాన్ని వ్యతిరేకించకపోవడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు
అమిత్ షా.
ఒకరికి హక్కులు కల్పించడం, ఆ
హక్కులను సరైన మర్యాదతో కల్పించడం మధ్య చాలా తేడా ఉందని హోంమంత్రి అన్నారు. ‘‘నేను
సభ ముందు ప్రవేశపెట్టిన బిల్లు ఉద్దేశం ఇన్నాళ్ళూ అన్యాయం జరిగిన వారికి, అవమానాలు
ఎదుర్కొన్న వారికి, ఇన్నాళ్ళూ విస్మరించబడిన వారికి వారి హక్కులు కల్పించడం,
వారికి న్యాయం చేయడమే. భారత రాజ్యాంగపు మౌలిక ఉద్దేశం అదే కదా. అదే సమయంలో ఆ
హక్కులు వారి ఆత్మగౌరవాన్ని తగ్గించేలా ఉండకూడదు. హక్కులు ఇవ్వడానికీ, హక్కులు
మర్యాదపూర్వకంగా ఇవ్వడానికీ మధ్య చాలా తేడా ఉంది. కాబట్టి బలహీనమైన, అణచివేయబడిన
వర్గాన్ని ఇతర వెనుకబడిన తరగతిగా పిలవడం సమంజసంగా ఉంటుంది’’ అని అమిత్ షా
చెప్పారు.
పేదల బాధలు ఎలా ఉంటాయో
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలుసని అమిత్ షా చెప్పుకొచ్చారు. ‘‘కొంతమంది దీన్ని
తక్కువ చేసి చూపాలని ప్రయత్నించారు. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే అని మరికొందరు
అన్నారు. వాళ్ళకు నేను చెప్పేది ఒకటే. వారిపట్ల మనకు కనీస సానుభూతి ఉంటే, వారికి
గౌరవం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారిని సోదరులుగా భావించి, వారిని కూడా
ఎదగనివ్వాలని కోరుకునే వారికే ఆ విషయం అర్ధమవుతుంది. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల
కోసం వాళ్ళని ఓటుబ్యాంకుగా చూసేవారికి అర్ధం కాదు. నరేంద్ర మోదీ ఒక పేద కుటుంబంలో
పుట్టి, ఇవాళ దేశానికి ప్రధానమంత్రిగా ఎదిగిన నాయకుడు. పేదల బాధలు ఆయనకు బాగా
తెలుసు’’ అని అమిత్ షా చెప్పారు.
ఈ బిల్లులలో ఒకటి
జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ చట్టం 2004ను సవరించడానికి ఉద్దేశించినది. షెడ్యూల్డు
కులాలు, షెడ్యూల్డు తెగలు, సామాజికంగానూ-విద్యాపరంగానూ వెనుకబడిన ఇతర తరగతుల
వారికి విద్యాసంస్థల్లో ప్రవేశాలు, నియామకాల్లో రిజర్వేషన్ కల్పించడం ఆ చట్టం ఉద్దేశం.ఆ
చట్టంలోని సెక్షన్ 2ను సవరించాలన్నది ప్రస్తుత ప్రతిపాదన. ఆ సెక్షన్లో ఉన్న
‘బలహీనమైన, పట్టించుకోకుండా ఉన్న సామాజికవర్గాలు’ అన్న పదాన్ని ‘ఇతర వెనుకబడిన
తరగతులు’ అన్న పదంగా సవరించాలన్నది ప్రస్తుత ప్రతిపాదన.
మరో బిల్లులో ‘కశ్మీరీ
వలసదారులకు’, ‘పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ నుంచి తరిమివేయబడిన వారికి’,
జమ్మూకశ్మీర్ శాసనసభలో షెడ్యూల్డు తెగలుగా గుర్తించబడిన వారికి… తమ రాజకీయ
హక్కులను పరిరక్షించుకునే హక్కు, మొత్తంగా వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధిని
సాధించడమే లక్ష్యంగా సవరణ ప్రతిపాదించారు.
దాని ప్రకారం, జమ్మూకశ్మీర్
పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లో సెక్షన్ 15ఎ, 15బి అనే రెండు కొత్త సెక్షన్లను
ప్రవేశపెడతారు. కశ్మీరీ వలసదారుల నుంచి ఒక మహిళ సహా ఇద్దరు సభ్యులను, పాక్ ఆక్రమిత
జమ్మూకశ్మీర్ భూభాగం నుంచి తరిమివేయబడిన వారి నుంచి ఒక సభ్యుడిని నామినేట్
చేయడానికి ఆ సెక్షన్లు వీలు కల్పిస్తాయి.
ఈ రెండు బిల్లులపై లోక్సభలో మంగళవారం చర్చ మొదలైంది. ఆ
చర్చలో 29మంది సభ్యులు పాల్గొన్నారు.