Ten BJP MPs resign to Parliament membership
భారతీయ జనతా పార్టీకి చెందిన పది మంది ఎంపీలు తమ
పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసారు. మరో ఇద్దరు ఎంపీలు కూడా అదే బాటలో
ఉన్నారు. రాజీనామా చేసిన వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. అదేంటి,
కేంద్రంలో అత్యంత బలంగా ఉన్న పార్టీ ఎంపీలు రాజీనామా చేయడమేంటి, అది కూడా మరో
నాలుగు నెలల్లో ఎన్నికలు జరిగే సమయంలో ఇదేం నిర్ణయం అనుకుంటున్నారా… అసలు
సంగతేంటో చూద్దాం రండి.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో
మూడు రాష్ట్రాల్లో బీజేపీ జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో భారతీయ
జనతా పార్టీకి చెందిన డజను మంది ఎంపీలు పోటీ చేసారు. ఆయా రాష్ట్రాల్లో వారు
ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేలు అయ్యారు. కాబట్టి ఇప్పుడు తమతమ
సొంతరాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా పనిచేయడం కోసం వారు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసారు
అంతే.
కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్
పటేల్ సహా పది మంది ఎంపీలు ఇవాళ తమ పార్లమెంటు పదవికి రాజీనామా చేసారు. రాజస్థాన్
ఆళ్వార్ నుంచి ఎంపీ అయిన బాబా బాలక్‌నాథ్, ఛత్తీస్‌గఢ్ సర్గుజా నుంచి ఎంపీ అయిన
రేణుకా సింగ్… ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వారిద్దరూ
పార్లమెంటుకు రాజీనామా చేయాల్సి ఉంది.
ఇంకో ఆసక్తికరమైన అంశమేంటంటే…. ఇప్పుడు రాజీనామా
చేసిన ఎంపీల్లో చాలామంది ఆ మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అనూహ్యస్థాయిలో భారీ విజయాలు
సాధించడంతో బీజేపీ నేతల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.
మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పటికి
ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసారు. ఇప్పుడు ఆయనకు కాకుండా మరో కొత్త ముఖానికి
అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తోంది. అలాగే రాజస్థాన్‌లోనూ, ఛత్తీస్‌గఢ్‌లో కూడా పాతకాపులకు
కాక కొత్తవారికే ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మొత్తం ఐదుగురు
కేంద్రమంత్రులు సహా 21మంది ఎంపీలను మోహరించింది. వారిలో 12మంది విజయం సాధించారు. వారిలో
నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్ మధ్యప్రదేశ్‌కు చెందినవారు. బాబా బాలక్‌నాథ్,
దియాకుమారి, కిరోరీలాల్ మీణా రాజస్థాన్‌కు చెందినవారు. రేణుకాసింగ్, గోమతి సాయి ఛత్తీస్‌గఢ్‌కు
చెందినవారు. ఇంక మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేసిన కేంద్రమంత్రి ఫగన్‌సింగ్ కులస్తే
ఛత్తీస్‌గఢ్ నుంచి పోటీ చేసిన ఎంపీ విజయ్ బాఘేల్ మాత్రం పరాజయం చవిచూసారు.
తెలంగాణలో పోటీ చేసిన బీజేపీ ఎంపీలు ముగ్గురూ ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ ఎంపీ
ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సొయం బాపూరావు
ముగ్గురికీ నిరాశే మిగిలింది.
హిందీ బెల్ట్‌లో గెలిచిన మూడు రాష్ట్రాలకూ
ముఖ్యమంత్రులకు ఎంపిక చేయడానికి బీజేపీ కసరత్తు ఇంకా కొనసాగుతోంది.