ఐదురాష్ట్రాల
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం దేశరాజకీయాల్లో భారీ మార్పులు
చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ
ఫలితాలు ఊతాన్నిఇచ్చాయి. ఇక పేరు మార్చుకుని ప్రభావశీలంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న
కాంగ్రెస్ దాని అనుయాయి పార్టీల ‘ఇండీ కూటమి’ ఆశలు అడుగంటాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్
అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండీ కూటమి
ఈ సమావేశానికి పిలుపునిచ్చారు. కానీ మిత్రపక్షాల నుంచి కనీస స్పందన లేకపోవడం
పలువురు భాగస్వాములు బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో సమావేశం వాయిదా వేసుకోవాల్సిన గడ్డు
పరిస్థితి ఎదురైంది.
దాదాపు మూడు నెలల తర్వాత ఈ కూటమి మరోసారి సమావేశం అయ్యేందుకు
ప్రయత్నించింది. చివరిసారిగా ఆగస్టు 31- సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో భేటీ
జరిగింది.
ఐదు
రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచే ఇండీ కూటమిలో మొదలైన లుకలుకులు
ప్రస్తుతం మరింత ప్రస్పుటం అవుతున్నాయి.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే
పిలుపు మేరకు నేడు జరగాల్సిన I.N.D.I.A కూటమి
సమావేశానికి ఓ మూడు కీలకపార్టీలు డుమ్మా కొట్టడంతో ఏకంగా సమావేశమై వాయిదా పడింది.
ఈ పరిణామం విపక్ష కూటమి రాజకీయాలపై పలు అనుమానాలకు తావిస్తోంది.
కూటమిలో
పెద్దన్న పాత్రను పోషించే కాంగ్రెస్, సీట్ల విషయంలో మాత్రం సోదరభావంతో మెలగడంలేదనే
వాదన ఉంది. కూటమి భాగస్వామి పక్షాల నేతలు చేసిన వ్యాఖ్యలే ఇందుకు తార్కాణం.
తృణమూల్
కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జనతాదళ్ చీఫ్, బిహార్ సీఎం
నితీశ్ కుమార్, అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షంగా
ఉన్న సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ సమావేశానికి హాజరు అవ్వడం లేదని
స్పష్టం చేశారు. దీంతో సమావేశం వాయిదా వేయడం మినహా కాంగ్రెస్ మరో దారిలేకుండా
పోయింది.
కూటమి
సమావేశంలో పాల్గొనలేకపోవడానికి వారు చెబుతున్న సాకులు ఎలా ఉన్నా ఇండీ కూటమి
భాగస్వాముల మధ్య ఏకాభిప్రాయం లేదనే విషయంలో ప్రజల్లోకి వెళ్ళింది.
దిల్లీ
వేదికగా జరిగే సమావేశం గురించి తనకు ముందస్తు సమాచారం లేదని అందుకు ఆ కార్యక్రమానికి
హాజరు కావడం లేదని, రాష్ట్రంలో జరిగే వేరే కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు మమతా
బెనర్జీ తెలిపారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగెస్ పరాభావంపై ఆమె
చురకలు అంటించిన తర్వాతే ఈ భేటీకి పిలువు ఇచ్చారనే ప్రచారం కూడా ఉంది.
కాంగ్రెస్
పార్టీ జమీందారీ మైండ్ సెట్ తో వ్యవహరిస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని ఆమె
వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ఓటమికి కాంగ్రెస్ ఏకపక్షనిర్ణయాలే కారణమని విశ్లేషించారు.
కూటమిలోని పార్టీలను కలుపుకుని పోటీ చేసి ఉంటే ఓట్లు చీలకుండా ఉండేవని ఆమె
అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమి సభ్యుల మధ్య సీట్ల సర్దుబాటు జరిగితే 2024లో
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదు అని ఆమె జోస్యం చెప్పారు.
ఇక
జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మాత్రం తనకు జ్వరం కారణంగానే భేటీలో
పాల్గొనలేకపోతున్నట్లు వివరణ ఇచ్చారు. మరోసారి జరిగే సమావేశంలో తప్పకుండా
భాగస్వామిని అవుతానన్నారు. అయితే అంతకు మునుపు ఆ పార్టీ ముఖ్యనేత మాట్లాడుతూ ఇండీ
కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహించడం సరికాదని ఆ పార్టీ ఆధ్వర్యంలో ముందుకు సాగలేం
అన్నారు. కూటమి బాధ్యతలు నితీశ్ కు అప్పగించాలని కోరారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్ వాదీ
పార్టీకి కాంగ్రెస్కు మధ్య అంతరం పెరిగింది. మిత్రధర్మం మేరకు కాంగ్రెస్
వ్యవహరించడం లేదని అఖిలేశ్ యాదవ్ ఆగ్రహంగా ఉన్నారు. మిగ్ జాం తుఫాను ప్రభావాన్ని
సాకుగా చూపి డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ సమావేశానికి
హాజరు కావడం లేదని చెప్పారు.