Dr B R Ambedkar Biography : Part 1
(అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాస
పరంపర)
మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ క్షేత్రంలో ఓ చిన్న ఊరు
మహు గ్రామం. 1891 ఏప్రిల్ 14న ఆ గ్రామంలో ఓ బాలుడు జన్మించాడు. అతని కారణంగా తన
పేరు చరిత్ర పుటల్లోకెక్కుతుందని ఆ ఊరికి తెలియదు. అతనే భీమారావు. అతని తల్లిపేరు
భీమాబాయి, తండ్రిపేరు రాంజీ సక్పాల్. వారు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా
అంబావాడే గ్రామ నివాసస్తులు. మహర్ కులానికి చెందిన వారు. కడుపేదవారు, కానీ
ధార్మికమైన ప్రవృత్తి కలిగిన వారు. పిల్లాడికి తల్లి పేరునే మీద భీమ్ అని పేరు
పెట్టారు. ఆ దంపతులకు అతను 14వ సంతానం కావడంతో, బంధువులు స్నేహితులూ అతన్ని తన
తండ్రికి 14వ రత్నం అని ప్రేమగా పిలిచేవారు.
భీమ్ పుట్టిన మూడేళ్ళ తర్వాత, అంటే 1894లో
తండ్రికి సైన్యంలో సుబేదార్ ఉద్యోగం పోయింది. నెలనెలా వచ్చే పింఛను కుటుంబపోషణకు ఏ
మూలకూ సరిపోయేది కాదు. అలాంటి సమయంలో సతారాలో స్టోర్ కీపర్ ఉద్యోగం దొరికింది.
దాంతో రాంజీ సక్పాల్ కుటుంబం మొత్తం సతారాకు వెళ్లిపోయారు. రాంజీ సక్పాల్కు గోరే
గ్రామానికి బదిలీ అయింది. కానీ భీమాబాయి ఇద్దరు కొడుకులతో సతారాలోనే ఉండిపోయింది.
కొద్దికాలానికి ఆమె అనారోగ్యంతో కన్నుమూసింది. అప్పుడు భీమ్ వయస్సు ఐదేళ్ళు
మాత్రమే. 1913లో తండ్రి కూడా తుదిశ్వాస విడిచాడు. ఇంక భీమ్ ఆవేదనకు అంతే లేకుండా
పోయింది.
అంబేద్కర్ మొదటి గురువు, ధార్మిక ప్రవృత్తి కలిగిన
తండ్రే: అంబేద్కర్ తండ్రి రాంజీ సక్పాల్ చాలా కష్టజీవి. అలాగే ధార్మిక ప్రవృత్తి
పట్ల అమితమైన మక్కువ కలిగినవారు, సహృదయశీలి. రోజూ ఉదయమూ సాయంత్రమూ భగవదారాధన
చేయడం, భక్తిగీతాలు ఆలపించడం అంటే ఆయనకు చాలా ఇష్టం. తన పిల్లలు అందరినీ కూర్చోబెట్టుకుని
భక్తిపాటలు పాడుతుండేవారు. పిల్లలకు రామాయణం, భారతం చదివి వినిపించేవారు. పిల్లల్లో
సద్బుద్ధి పెంచేందుకు ప్రయత్నించేవారు. రాత్రి చీకట్లో మెల్లమెల్లగా భజనగీతాలు
ఆలపించేవారు. స్వయంగా ఆయన మద్యమాంసాలకు దూరంగా ఉండేవాడు. ఆ మంచి అలవాట్ల ప్రభావం
వల్లనే అంబేద్కర్ జీవితాంతం మద్యానికి దూరంగా ఉన్నాడు.
బాల్యంలోనే అస్పృశ్యత వల్ల అవమానాలు: భీమరావ్ అంబేద్కర్
చిన్నతనం నుంచే చాలా తెలివైన వాడు, శ్రద్ధగా చదువుకునేవాడు. అతనికి పుస్తకాలంటే
అమితమైన ఆసక్తి. గ్రామంలోని పాఠశాలలో భీమరావు, అతని సోదరుడు ఆనంద్ ఇద్దరినీ మిగతా
విద్యార్ధుల నుంచి దూరంగా కూర్చోబెట్టేవారు. దాహం వేస్తే తన చేతులతో మంచినీరు
తీసుకుని తాగే అవకాశం కూడా ఉండేది కాదు. ఎవరో ఒకరు నీళ్ళు పోస్తే తాగాల్సి
వచ్చేది. ఆ రోజుల్లో అస్పృశ్యత అంతలా ఉండేది.
భీమరావు 1900 సంవత్సరంలో సతారాలోని ప్రభుత్వ
మాధ్యమిక పాఠశాలలో చేరారు. అన్నదమ్ములిద్దరూ బడికి నడుచుకునే వెళ్ళేవారు. బడి
ఇంటికి కొంచెం దూరంగానే ఉండేది. ఒకరోజు ఆ అన్నదమ్ములిద్దరూ బడి నుంచి వచ్చే సమయంలో
ఒక ఎద్దుల బండి ఎక్కారు. కాసేపటికి బండి నడిపేవాడికి ఆ పిల్లలిద్దరూ మహర్ కులానికి
చెందినవారు అని తెలిసింది. వెంటనే వారిద్దరినీ నానాతిట్లూ తిట్టి బండి దింపేసాడు.
ఒకసారి బావిలో నీరు తోడుకుని తాగుతుంటే గ్రామస్తులు చూసి, అంటరానివారు బావిని ఎలా
ముట్టుకుంటారని కోపంతో చితక్కొట్టారు.
భీమరావు ఒకసారి బడి నుంచి ఇంటికి వెడుతుంటే
ఉన్నట్టుండి భారీ వర్షం మొదలైంది. దాన్నుంచి తప్పించుకోడానికి, ఓ ఇంటి వరండాలో
నిలబడ్డాడు. ఆ ఇంటి యజమాని అతన్ని చూసి కోపగించుకుని ఆ వానలోనే ఆ పిల్లవాణ్ణి
తోసేసాడు. భీమరావు బురదలో పడ్డాడు, అతని దుస్తులు, పుస్తకాలూ అన్నీ తడిసిపోయాయి. ఆ
సంఘటన భీమ్ మనసులో బలమైన ముద్ర వేసింది. సమాజంలో వ్యాపించి ఉన్న అస్పృశ్యత అనే దురాచారం
అతని చిన్నారి మనసును గాయపరిచింది. మనకెందుకు ఇలా జరుగుతోంది? సవర్ణుల పద్ధతి
ఎప్పుడు బాగుపడుతుంది? చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలూ కేవలం సవర్ణుల సొత్తా? అనే
ప్రశ్నలు చుట్టుముట్టేవి. లేదు, మనం కూడా వారిలాంటి మనుషులమే. మనం కూడా
చదువుకోగలం. మనకూ అర్హత, యోగ్యత ఉన్నాయి. మనం కూడా సవర్ణులతో సమానంగా చదువుకుంటాం…
అని తనకు తనే జవాబు చెప్పుకున్నారు. క్రమం తప్పకుండా బడికి వెళ్ళాల్సిందే అని
నిశ్చయించుకున్నారు.
ఉపాధ్యాయుల స్నేహ సహకారాలు: ఒకవైపు ఇలాంటి
అస్పృశ్యతా భావాలు వ్యాపించి ఉన్న హిందూ సమాజంలోనే ఎంతోమంది అస్పృశ్యతను పాటించని
హిందువులు చాలామంది ఉండేవారు. దీనులు, నిరుపేదలు అయిన పిల్లలకు స్నేహహస్తం
అందించేవారు. వారికి జీవితంలో పైకి రావడానికి తగిన ప్రోత్సాహం ఇచ్చేవారు. అలాంటి
గురువుల స్నేహం భీమరావుకు లభించింది.
ఒకసారి భీమరావు వానలో తడుచుకుంటూ వేగంగా బడికి
చేరుకున్నాడు. ఆ పాఠశాలలో పెండ్సే అనే పేరు గల బ్రాహ్మణ ఉపాధ్యాయుడు ఉండేవాడు.
చదువు పట్ల భీమరావు ఆసక్తి ఆయనను మంత్రముగ్ధుణ్ణి చేసింది. భీమరావును వెంటనే తన ఇంటికి
పంపించాడు. అక్కడ వేణ్ణీళ్ళతో స్నానం చేసేందుకు ఏర్పాట్లు చేసాడు. తర్వాత
కట్టుకునేందుకు తమ ఇంట్లోని దుస్తులు కూడా ఇచ్చాడు. భీమరావు ఆ దుస్తులే ధరించి బడికి
వెళ్ళాడు. ఆ సంఘటన బాల భీమరావు మనసులో బాగా ముద్రపడిపోయింది.
భీమరావు పేరు మొదట్లో తమ గ్రామం అంబవాడ పేరిట
భీమరావు అంబవాడేకర్ అని ఉండేది. సతారాలో మాధ్యమిక పాఠశాలలో చదువుకునేటప్పుడు అక్కడ
అంబేద్కర్ అనే సనాతనవాది అయిన ఛాందస బ్రాహ్మణుడు ఒకాయన ఉపాధ్యాయుడుగా ఉండేవాడు.
ఆయన భీమరావుతో చాలా స్నేహంగా ఉండేవాడు. ప్రతీరోజూ భీమరావుకు ఆహారం పెడుతుండేవాడు.
తన భోజనాన్నే భీమరావుకు కూడా పంచేవాడు. వీలైనంతవరకూ తన దగ్గరే కూచోబెట్టుకుని
ఇద్దరూ కలిసి భోజనం చేసేవారు. ‘‘ఆయన ప్రేమగా పెట్టే రొట్టెలు-కూర రుచి అమృతంలా
ఉండేదని చెప్పడానికి నేనెంతో ఆనందిస్తున్నాను. ఆ విషయం తలచుకున్నప్పుడల్లా నా
హృదయం ఆర్ద్రమైపోతుంది. ఆయనకు నా పట్ల నిజంగా ఎంతో ప్రేమ ఉండేది’’ అని అంబేద్కర్
తర్వాతి రోజుల్లో చెప్పారు.
భీమ్రావు లండన్‌లో జరిగిన గోల్మేజ్ సభలో
పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ఆ ఉపాధ్యాయుడే శుభాకాంక్షలు చెబుతూ ఉత్తరం రాసారు. ఆ
ఉత్తరాన్ని చూసి భీమ్ ఎంతో ఆనందించాడు. తన జీవితం మీద అమితమైన ప్రభావం చూపిన ఆ ఉపాధ్యాయుడి
పేరును భీమ్రావు తన పేరులో స్వీకరించాడు. నాటినుంచీ భీమ్రావు అంబవాడేకర్, భీమ్రావు
అంబేద్కర్ అయాడు. (ధనుంజయ్ కీర్ రాసిన డాక్టర్ అంబేద్కర్ : లైఫ్ అండ్ మిషన్
పుస్తకంనుంచి)
సంస్కృతమంటే అభిమానం: భీమరావు తండ్రి రాంజీ సక్పాల్
గొప్ప ఆలోచనలున్న వ్యక్తి. మనుషులందరూ దేవుని సంతానమే, కాబట్టి అందరూ సమానమే అని
ఆయన భావించేవారు. కొడుకు ఉన్నత విద్య కోసం ఆయన బొంబాయి చేరుకున్నారు. అక్కడ
భీమరావు ఎల్ఫిన్స్టన్ కళాశాలలో చేరాడు. హైస్కూలులో భీమరావుకు సంస్కృతం
చదువుకోవాలని ఉండేది, కానీ సాధ్యం కాలేదు. హిందువులు కాని విదేశీయులు సైతం
సంస్కృతం చదువుకోగలిగేవారు కానీ హిందువులు అయినప్పటికీ మహర్ కులానికి చెందినవారు
కావడంతో భీమరావు సంస్కృతం చదువుకోలేకపోయాడు. ఆ బాధ అతని మనసులో ముల్లులా
గుచ్చుతూనే ఉండేది.
‘‘నాకు సంస్కృతమంటే చాలా అభిమానం. సంస్కృత భాషలో
గొప్ప పండితుణ్ణి కావాలి అనుకునేవాణ్ణి, కానీ ఉపాధ్యాయుల సంకుచిత దృష్టికోణం వల్ల
నేను ఆ భాషకు దూరమయ్యాను’’ అని అంబేద్కర్ స్వయంగా చెప్పారు. తర్వాతి కాలంలో భీమరావు
ఎంతో శ్రమకోర్చి సంస్కృతభాష నేర్చుకున్నారు, ఆ భాషలో పాండిత్యం సంపాదించారు.
ఉన్నత విద్య సంకల్పం నెరవేరింది: బొంబాయి జీవితం
చాలా కష్టంగా ఉండేది. అక్కడి పాఠశాలలోని శ్రీ కృష్ణ కేలుస్కర్ అనే ఉపాధ్యాయుడి
దృష్టిలో పడ్డాడు అంబేద్కర్. నిమ్నవర్ణానికి చెందిన పిల్లవాడిలో చదువుకోవాలన్న తీవ్రమైన
కోరిక ఉండడం ఆయనను ముగ్ధుణ్ణి చేసింది. ఆయన అంబేద్కర్‌కు వీలున్నప్పుడల్లా సాయం
చేసారు. కావలసిన పుస్తకాలు కొనిపెట్టారు. గౌతమబుద్ధుడి గురించి అంబేద్కర్ చదివిన
మొదటి పుస్తకం ఆయన ఇఛ్చిందే. కేలుస్కర్ ఒకసారి భీమరావు తండ్రి రాంజీ సుబేదార్‌ను
పిలిచి, పిల్లవాడిని పైచదువులు చదివించడానికి ఏమాత్రం వెనుకాడవద్దు, అవసరమైతే నేను
సహాయం చేస్తాను అని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకున్నారు కూడా. భీమరావుకు అవసరమైన
ప్రతీసారీ ఆయన తన శక్తిమేరకు సహాయం చేసారు.
కష్టాల్లోనూ చదువు కొనసాగించాడు: పేదరికం వల్ల ఒక
చిన్న గదిలో మకాము. అన్నం వండుకు తినడం, చదువు, నిద్ర… అన్ని పనులూ ఆ గదిలోనే. ఆ
గదిలో ఇద్దరు మనుషులు ఒకసారి పడుకోడానికి అవకాశం ఉండేది కాదు. భీమరావు చదుకునేంత
సేపూ తండ్రి నిద్రపోయేవారు. రాత్రి 2 గంటల సమయంలో భీమరావు పడుకునేటప్పుడు తండ్రి
నిద్రలేచేవారు. కిరసనాయిలు దీపం వెలుగులో భీమరావు రాత్రంతా మెలకువగా ఉండి
చదువుకునేవాడు.
ఈ సమస్యలేవీ భీమరావు మార్గంలో ఆటంకాలు కాలేదు,
సవాళ్ళుగా నిలిచాయి. 1908లో భీమరావు ఎల్ఫిన్స్టన్ కాలేజీ నుంచి మెట్రిక్యులేషన్
పాస్ అయ్యాడు. 1910లో ఇంటర్మీడియెట్, 1912లో బీఏ పూర్తిచేసాడు. బీఏ పూర్తయిన
భీమరావు అంబేద్కర్‌కు వడోదర మహారాజు సయాజీరావు గైక్వాడ్ ఘనస్వాగతం పలికాడు. ఇంటర్
పూర్తయిన తర్వాత డిగ్రీ చదవడానికి ఆ మహారాజు అంబేద్కర్‌కు నెలకు 25 రూపాయల ఉపకారవేతనం
ఇచ్చాడు. భీమరావు జీవితం ముందుకు సాగడంలో వీరిద్దరి సహకారం మాటలకు అందనిది.
అమెరికా జీవితం: అమెరికా న్యూయార్క్‌లోని
కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్‌కు సీటు దొరికింది. అక్కడ ఆయన ఎక్కువ సమయం
గ్రంథాలయంలోని పుస్తకాలు చదవడంలోనే గడిపేవాడు. రోజులో 16గంటలు చదువుకే
కేటాయించేవాడు. మిగతా పనులన్నీ మిగిలిన సమయంలో చేసుకునేవాడు. 1916లో అంబేద్కర్
పీహెచ్డీ పూర్తిచేసాడు. కానీ ధనాభావం వల్ల తన పరిశోధన ప్రతిని
ప్రచురించలేకపోయాడు. ఆ ప్రతిని 1923లో ప్రచురించాడు. ఇప్పుడు అంబేద్కర్
పూర్తిస్థాయిలో డాక్టరేట్ పట్టా పొందాడు. దానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనం
ఊహించుకోవలసిందే.
గోమాంసానికీ, మద్యానికీ దూరం: అమెరికా వెళ్ళిన
మొదటి వారం రోజులూ అంబేద్కర్, హార్టల్ హాల్ అనేచోట ఉన్నాడు. అక్కడ భోజనంలో
ఆవుమాంసం వడ్డించేవారు. ఆవుమాంసం తినడానికి ఆయన చిన్నప్పటి నుంచీ నేర్చుకున్న
సంస్కారం అడ్డువచ్చింది. అందుకే ఆయన అక్కణ్ణుంచి మారిపోయి కొందరు భారతీయులు బస
చేస్తున్న కాస్మోపాలిటన్ క్లబ్లో చేరాడు. అంబేద్కర్ తన జీవితాంతం గోమాంసానికీ,
మద్యానికీ దూరంగా ఉన్నాడు. కాస్మోపాలిటన్ క్లబ్లో ఉన్న రోజుల్లో అంబేద్కర్ తన
తండ్రి మిత్రుడు ఒకరికి లేఖ రాసారు. ‘‘తల్లిదండ్రులు పిల్లలకు కేవలం జన్మనిస్తారు
అన్న ఆలోచనను మనమిప్పుడు పూర్తిగా వదిలిపెట్టేయాలి. వారు తమ పిల్లల భాగ్యాన్ని
మార్చివేస్తారు. వ్యక్తి ఎదుగుదలకు చదువే మూలమంత్రం. కాబట్టి, చదువు విలువ గురించి
వీలైనంత ఎక్కువగా మీ బంధుమిత్రులందరిలోనూ ప్రచారం చేయడమే మీరు తక్షణం చేయవలసిన
మహత్కార్యం’’ అని ఆ లేఖలో పేర్కొన్నాడు అంబేద్కర్.
అంబేద్కర్ అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసాన్ని
పూర్తి చేసుకుని 1917 ఆగస్టులో భారతదేశానికి తిరిగి వచ్చాడు. వడోదర స్టేషన్లో
ఆయనకు స్వాగతం పలకడానికి ఎవరూ రాలేదు. అది ఆయనను అమితంగా బాధించింది.
వడోదరలోనే మహారాజు వద్ద సైనిక మంత్రిగా అంబేద్కర్
ఉద్యోగంలో చేరాడు. కానీ అక్కడ కూడా ఆయనకు సమస్యలు కొనసాగాయి. వడోదర లాంటి నగరంలో
కూడా అంబేద్కర్‌కు నివసించడానికి ఇల్లు దొరకలేదు. పెద్ద ఉద్యోగంలో ఉన్నప్పటికీ
కార్యాలయంలోని చిన్న ఉద్యోగి అయినా ఆయనను తాకేవారు కాదు. తాగడానికి మంచినీరు కూడా
ఇచ్చేవారు కాదు. కార్యాలయంలో ఆయనకు ఏవైనా కాగితాలు ఇవ్వాలన్నా చేతికి ఇవ్వకుండా ఆయన
బల్ల మీదకు విసిరేవారు. ఇలాంటి వివక్షతో దుఃఖితుడైన అంబేద్కర్ ఆ ఉద్యోగాన్ని
వదిలివేసాడు. వడోదర నుంచి బొంబాయి తిరిగి వచ్చేసాడు. 1918లో ఆయన బొంబాయిలో సిడన్హెమ్
కాలేజీలో ప్రాధ్యాపకుడిగా ఉద్యోగంలో చేరాడు.
విద్వాంసుడైన ప్రొఫెసర్: కళాశాలలోని చాలామంది
అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నత వర్ణాలకు చెందినవారు ఉండేవారు. అస్పృశ్యుడైన ఈ
ప్రొఫెసర్ పాఠాలు ఎలా చెబుతాడని వారు సందేహించారు. కానీ కొన్నిరోజుల్లోనే అంబేద్కర్
అందరికీ ఇష్టుడైన అధ్యాపకుడు అయిపోయాడు. వేరే కళాశాలల విద్యార్థులు కూడా
చాలాసార్లు వచ్చి అంబేద్కర్ బోధిస్తున్న తరగతిలో కూర్చుని పాఠాలు వినేవారు. ఆయన
పిల్లలకు నోట్స్ చెప్పాక వారు మరో పుస్తకం చదవాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ
సిడన్హెమ్ కాలేజీలో కూడా అంటరానితనపు విషపూరిత వాతావరణం వ్యాపించింది. కొందరు
ప్రొఫెసర్లు అంబేద్కర్ వాడిన గ్లాసుల్లో మంచినీళ్ళు తాగేవారు కాదు. ఇంత చదువుకున్నాక
కూడా ఇంకా అస్పృశ్యత పాటిస్తున్నారంటే వారి చదువుకు అర్ధమేముంది అని అంబేద్కర్
బాధపడేవాడు.
బారిస్టర్‌గా అంబేద్కర్: అంబేద్కర్ అర్ధశాస్త్రం,
బారిస్టర్ చదవడానికి 1920లో లండన్ వెళ్ళాడు. అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని 1923లో
తిరిగి స్వదేశానికి వచ్చాడు. ఆయన భారతదేశాన్నే తన కార్యక్షేత్రంగా
నిశ్చయించుకున్నాడు. ఇక్కడ సమాజంలో వ్యాపించి ఉన్న చెడు ఆచారాలను
తుడిచిపెట్టేయాలని భావించాడు. ఆయనకు విదేశాల్లో ఏ లోటూ లేదు, కానీ బొంబాయి
హైకోర్టులో వకీలుగా జీవితం ప్రారంభించాడు. అదే సంవత్సరం బొంబాయి విధానసభకు ఆయన
ఎన్నికయ్యారు. లాయరుగా పనిచేసేటప్పుడు అంబేద్కర్‌కు అతిమామూలు పల్లెటూరి ప్రజలతో
పరిచయాలు పెరిగాయి. కొద్దికాలంలోనే అంబేద్కర్ బొంబాయిలోని గొప్ప వకీళ్ళలో ఒకరిగా
పేరు గడించాడు. అయినప్పటికీ అంటరానితనపు నీడ ఆయనను వదల్లేదు. మంచి న్యాయవాది అని
భావించి తమ కేసులను అంబేద్కర్ దగ్గరకు తీసుకొచ్చే క్లయింట్లు, సంబంధిత కాగితాలను
దూరం నుంచి ఎత్తి ఆయన చేతిలో వేసేవారు. అది ఆయన హృదయాన్ని మరింత గాయపరిచింది.
మూకనాయక్ పత్రిక స్థాపన: అంబేద్కర్ తన ఆలోచనలను
అందరికీ చేరువ చేయడానికి ఒక ప్రసారమాధ్యమం ఎంతైనా అవసరమని భావించాడు. ఒక పత్రిక
ఉంటే దాని ద్వారా ఎలాంటి విషయాన్నయినా ప్రజలకు చేరువ చేయడం సులువని అర్ధం చేసుకున్నాడు.
తాను ఇంగ్లండ్ వెళ్ళడానికి ముందే కొల్హాపూర్ మహారాజా సహాయంతో 1920 జనవరి 31న మూకనాయక్
పేరుతో పక్షపత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికకు ఆయన సంపాదకుడు కాదు కానీ మూకనాయక్
పత్రిక ద్వారా అంబేద్కర్ అస్పృశ్యులు, దళితులకు సంబంధించిన విషయాలను సమాజం ముందు
ఉంచేవాడు. సమాజంలో చైతన్యం కలిగించే దిశగా అంబేద్కర్ వేసిన మొదటి అడుగు అది.
అందరినీ కలుపుకుని వెళ్ళే వ్యక్తిత్వం: అతిమామూలు
నిరుపేద కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ తన పరిశ్రమ, వ్యవహార దక్షత, ఉన్నత విద్య కారణంగా
తన ప్రయాణంలో సహకారం అందించేవారిని ఎందరినో పొందాడు. వారిలో అత్యధికులు సవర్ణులే.
అయినా వారు అంబేద్కర్ కఠోర శ్రమ, శ్రద్ధల వల్ల ప్రభావితులయ్యారు. అంబేద్కర్ సాధన
వారి మనసులను గెలుచుకుంది. వారిలో ప్రధానమైనవారు మహారాజా గైక్వాడ్, గురువు కృష్ణ
కేలుస్కర్, గురువు అంబేద్కర్, మిత్రులు భథేనా, శివతారకర్, ఛత్రపతి శాహూజీ మహరాజ్, ప్రొఫెసర్
ఇరాణీ, వేద విద్వాంసులు దేవరావు నాయక్ తదితరులు. వారిని తలచుకుంటూనే అంబేద్కర్
ఎంతో ఉద్వేగానికి లోనవుతుండేవాడు. వారి స్నేహాన్ని, సహాయాన్నీ ఆయన జీవితాంతం గుర్తుచేసుకుంటూనే
ఉండేవాడు. 1925లో బొంబాయిలో బహిష్కృత హితకారిణీ సభ సమావేశం జరిగింది. ఆ సభలో
అంబేద్కర్ మాట్లాడుతూ ‘‘అస్పృశ్యుల ఉద్ధరణ కేవలం వారి బలంతో మాత్రమే జరగదు. సమాజం
అంతటినీ తోడు తీసుకుని ముందడుగు వేయాలి’’ అన్నారు. మొత్తం హిందూ సమాజం ఒక్కమాటగా
కదలాలి, కలిసి అడుగులు వేయాలి. ఆ సమాజంలో వ్యాపించిన దుర్నీతులు తొలగిపోవాలి. దానికోసమే
అంబేద్కర్ తన జీవితాంతం ప్రయత్నించాడు.
‘‘హిందూ సమాజానికి నేను ఎంత మేలు చేసానన్న విషయం
నేను చనిపోయాక మొత్తం హిందూ సమాజం తెలుసుకుంటుంది’’ అని అంబేద్కర్ ఒక సందర్భంలో చెప్పాడు.