AP BJP : మిగ్జాం తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను
రాష్ట్రప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి
కోరారు. మూడు రోజులుగా కురుస్తోన్న వానలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పంటలు నీటిపాలు
కావడంతో బాధపడుతున్నారని ఆమె ఆవేదన చెందారు.
పంట బీమా వివరాలను వెల్లడించాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పురందరేశ్వరి, ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న రైతులకు
భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
వరి
పంట చేతికి అందుతున్న దశలో తుపాను రావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఎకరాకు
సుమారుగా రూ. 40వేలు పెట్టుబడి రూపంలో రైతులు ఖర్చు చేశారని పంట చేతికొచ్చే సమయంలో
ఇలా జరడగం దురదృష్టకరమన్నారు.
రంగు
మారిన ధాన్యం, తడిసిన ధాన్యాన్ని కూడా పంట పొలాల
వద్దే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టం అంచనాలు 48 గంటల్లో వెల్లడించి
యుద్ధ ప్రాతిపదికన తక్షణసాయం అందించాలన్నారు. ఉద్యాన వన పంటలకు సంబంధించి వెదర్
బేస్ డ్ క్రాప్ ఇన్సూరెన్స్ పరిధిలోకి టమోటా, అరటి
వంటి పంటలు కూడా తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
క్షేత్రస్థాయిలో అధికారులు
పర్యటించి నష్ట వివరాలు అందజేస్తేనే ప్రభుత్వం నుంచి త్వరగా సాయం అందే అవకాశం
ఉందన్నారు. అరటి రైతులు బాధలు వర్ణనాతీతమన్నారు. ఎకరా పంట సాగుకు రూ. లక్ష
ఖర్చుచేశారన్నారు.
పునరావాస
కేంద్రాల్లో ఉన్న వారికి నాణ్యమైన భోజన అందించడం తో పాటు మెరుగైన ఆరోగ్య సేవలు
అందించాలని ప్రభుత్వానికి సూచించారు.
బీజేపీ
కార్యకర్తలంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు సాయం అందించాలని
పురందరేశ్వరి పిలుపునిచ్చారు. కరోనా సమయంలో సేవలు అందించినట్లే ఇప్పుడు కూడా
రైతులకు సహకారం అందించాలని ఆమె కోరారు. తుఫాన్ కారణంగా ఇళ్ళు కోల్పోయిన వారికి ప్రభుత్వమే
కొత్త గృహాలను నిర్మించి అందజేయాలని ఆమె కోరారు.