శ్రీరాముడి
జన్మస్థలం అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చే
ఏడాది జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై
సమీక్ష నిర్వహించిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, బాలరాముడి
విగ్రహం, ప్రతిష్టకు సంబంధించి అన్ని పనులు చురుగ్గా సాగుతున్నట్లు చెప్పారు. విగ్రహానికి
తుదిమెరుగులు దిద్దుతున్నట్లు వెల్లడించారు.
మూడు
విగ్రహాలను తయారు చేయిస్తున్న ట్రస్ట్, అందులో ఒకదానిని ప్రతిష్ట కోసం ఎంచుకుంటుంది.
వారం రోజుల్లో విగ్రహాల తయారీ పూర్తివుతుందని స్పష్టం చేశారు. ఐదేళ్ళ వయసున్న
బాలరాముడి విగ్రహం ఎత్తు నాలుగు అడుగులు మూడు అంగుళాలు ఉంటుందన్నారు. గ్రౌండ్
ప్లోర్ లోని గర్భగుడిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్ పనులు
చివరి అంకానికి చేరుకున్నాయని ప్రతిష్టాపన కార్యక్రమానికి నిర్మాణపరమైన అవరోధాలు
ఏమీ లేవని చంపత్ రాయ్ వివరించారు.
ఈ
మహోత్సవానికి ఇప్పటికే నాలుగువేలమంది సాధుసంతులను ఆహ్వానించామని, మరింతమందిని
భాగస్వాములు చేసే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని
మోదీని ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు.
బాలరాముడి
విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన వైదిక కార్యక్రమాలు జనవరి 16
నుంచి ప్రారంభం అవుతాయి.
ప్రముఖ వేద
పండితుడు వారణాసి లక్ష్మీకాంత్ దీక్షిత్
ఆధ్వర్యంలో ఈ పవిత్రకార్యక్రమం కొనసాగనుంది.
జనవరి
14 నుంచి 22 వరకు అయోధ్య అమృత మహోత్సవం నిర్వహించనున్నారు. అలాగే 1008 కలశాలతో
మహాయజ్ఞం కూడా నిర్వహించడంతో పాటు వేలమందికి అన్నదానం చేసేందుకు అన్ని ఏర్పాట్లు
జరుగుతున్నాయి.