Rain Alert :
మిగ్జాం తుపాను క్రమంగా
బలహీనపడుతోంది. ప్రస్తుతం వాయుగుండంగా బలహీనపడగా, మధ్యాహ్నానికి అల్పపీడనంగా మారే
అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ, ఉత్తర కోస్తా
ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు
45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
తుపాను
ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు నేడు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పలు జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దక్షిణ మధ్య రైల్వే కూడా పలు సర్వీసులను రద్దు చేసింది.
భారీ
వర్షాల నేపథ్యంలో వర్షం కారణంగా విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు. భక్తుల
భద్రతా కారణాల రిత్యా ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వర్షాలు తగ్గే
వరకు ఘాట్ రోడ్డు మూసి ఉంచాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు
కనకదుర్గనగర్ మార్గం ద్వారా రావాలని ఆలయ అధికారులు తెలిపారు.
మిగ్జాం
దాటికి రెండురోజులుగా ఆంధ్రప్రదేశ్ విలవిలలాడింది. భారీ వర్షాలకు తోడు
ఈదురుగాలులతో జనాలు తీవ్ర యాతన
అనుభవించారు. గాలులకు విద్యుత్ తీగలు తెగిపడటంతో సరఫరా నిలిచిపోయింది. మరో వైపు
లోతట్టు ప్రాంతాలు, రహదారులపై నీళ్లు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కోనసీమ
జిల్లాలో పదివేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఎన్టీఆర్
జిల్లా దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు వాగులు పొంగుతున్నాయి. వీరులపాడు –నందిగామ
మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరువూరు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. గంపలగూడెం-విజయవాడ
మార్గంలోనూ రాకపోకలు నిలిచిపోయాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం
పరదానిపుట్టు వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో సుమారు 50 గ్రామాలకు
రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం పరిధిలో కొండవాగు ప్రమాదకరస్థాయిలో
ప్రవహిస్తోంది.