హమాస్ ఉగ్రవాదులను సొరంగాల నుంచి బయటకు లాగేందుకు ఇజ్రాయెల్ సైన్యం కొత్త ఎత్తులు వేస్తోంది. సొరంగాలను నీటితో నింపేందుకు ప్రయత్నం చేస్తోంది.సొరంగాలను నీటితో నింపేందుకు భారీ పంపులను సొరంగాల వద్దకు చేరుస్తున్నారు. గత నెలలోనే కొన్ని భారీ పంపులను సొరంగాల వద్దకు చేర్చినట్లు అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది.
బందీల విడుదల పూర్తి కాకముందే ఇజ్రాయెల్ (israel hamas war) ఇలాంటి తీవ్ర చర్యలకు పాల్పడుతుందా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఇంకా ఇజ్రాయెల్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సొరంగాల్లో సురక్షితంగా ఉంటామని హమాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే గాజాలోని ఖాన్ యూనిస్ పట్టణ సమీపానికి ఇజ్రాయెల్ సైన్యం చేరుకుంది. నగరంలోని పలు లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైన్యం భీకరదాడులు ప్రారంభించింది. తాజా యుద్ధం గాజా ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. హమాస్ కీలక నాయకులైన యాహ్యా సిన్ వాల్, మహ్మద్ డెయిఫ్ ఖాన్ యూనిస్ పట్టణంలో ఉన్నారని ఇజ్రాయెల్ భావిస్తోంది.