భారత్ 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఎస్ అండ్ పీ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.4 శాతం వృద్ది నమోదు చేస్తుందని ఆ సంస్థ ప్రకటించింది. వచ్చే ఏడాది 6.9, 2026 నాటికి ఏడు శాతానికి చేరుతుందని తెలిపింది. 2030 నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఎస్ అండ్ పీ ( india growth rate) ప్రకటించింది.
రాబోయే మూడు సంవత్సరాల్లో భారత్ అంత్యంత వేగంగా వృద్ధి చెందే దేశాల జాబితాలో నిలుస్తుందని ఎస్ అండ్ పీ తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తరవాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. చైనాను అధిగమించి భారత్ అతి పెద్ద తయారీ కేంద్రంగా ఎదగడమే సవాల్ కానుందని వివరించింది.
సేవల ఆధారిత ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్, తయారీ రంగంలోకి మారాల్సిన అవసరం ఉందని ఎస్ అండ్ పీ అభిప్రాయపడింది. భారత్లో శ్రామిక శక్తిని వెలికి తీయాల్సిన అవసరం ఉందని తెలిపింది. కార్మికులు, ఉద్యోగులకు పెద్ద ఎత్తున నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాలని సూచించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున ఖర్చు చేయాలని తెలిపింది.