దేశీయ స్టాక్ మార్కెట్లు దూకుడు మీదున్నాయి. వరుసగా ఆరో రోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో(stock market) ట్రేడవుతున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు భారీగా కొనుగోళ్లకు దిగడంతో దేశీయ స్టాక్ సూచీలు లాభాల్లో దూసుకెళుతున్నాయి. గత వారం రోజులుగా కొనుగోళ్లకు మద్దతు లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త జీవితకాల రికార్డులను నమోదు చేశాయి.
సెన్సెక్స్ ఇవాళ ఉదయం ప్రారంభంలోనే 169 పాయింట్లు పెరిగి, 69035 మార్క్‌ను దాటింది. నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 20739 పాయింట్ల సరికొత్త రికార్డును నమోదు చేసింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల విలువ నిన్న ఒక్క రోజే 2.4 లక్షల కోట్లు పెరిగింది. దీంతో మదుపరుల సంపద 345 లక్షల కోట్లకు చేరుకుంది.తాజాగా అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ 4.40 శాతం రాణించాయి. బీపీసీఎల్, మహింద్రా అండ్ మహింద్రా, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
సెన్సెక్స్ 30లో 20 కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీలో 29 కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేశాయి. గడచిన ఆరు ట్రేడింగ్ సెషన్స్‌లోనే మదుపరుల సంపద 17.16 లక్షల కోట్లు పెరిగింది. అక్టోబర్ 23 నుంచి ఇప్పటికే నిఫ్టీ 10 శాతం పెరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల తరవాత కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడబోతోందనే సంకేతాలు రావడంతో అనేక రంగాల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.