Cyclone Michaung
shattered TN, claimed 3 lives
బంగాళాఖాతంలో ఆవరించి ఉన్న
తీవ్రతుపాను మిగ్జాం,తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతోంది. ఈలోగా ఇవాళ
సోమవారం నాడు తమిళనాడులో బీభత్సం సృష్టించింది. తీవ్రతుపాను ధాటికి తమిళనాట
ముగ్గురు చనిపోయారు. తమిళనాడు, పుదుచ్చేరి భారీ వర్షాలతో అతలాకుతలం అయిపోయాయి.
తమిళనాడు ఉత్తర కోస్తా
ప్రాంతంలోని చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, నాగపట్టణం, కడలూరు జిల్లాలు భారీ
వర్షాలతో తడిసి ముద్దయిపోయాయి. తిరువళ్ళూరు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం
నమోదయింది. చెన్నైలో భారీ వర్షాల కారణంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని
నగర పోలీసులు వెల్లడించారు. రాజధానీనగరం దాదాపు అంతా నీట మునిగిపోయింది. లోతట్టుప్రాంతాలన్నీ
జలమయం అయిపోయాయి.
చెన్నై మహానగరం, దాని
చుట్టుపక్కల జిల్లాల్లో గతరాత్రి నుంచీ భారీవర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆదివారం
ఉదయం నుంచి సోమవారం ఉదయం 5.30 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో మీనంబాకంలో 196
మిల్లీమీటర్లు, నుంగంబాకంలో 154.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఫలితంగా
చెన్నై, దాని చుట్టుపక్కల మూడు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలూ
మూతపడ్డాయి. ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటినుంచీ పని చేయడానికి
అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. నాలుగు జిల్లాల్లో రేపు మంగళవారం ప్రభుత్వం
సెలవు ప్రకటించింది.
తుపాను ప్రభావిత తీరప్రాంత
జిల్లాల్లో అధికారులు సుమారు 5వేల శిబిరాలు ఏర్పాటు చేసారు. ముఖ్యమంత్రి ఎంకె
స్టాలిన్ పరిస్థితిని క్రమంతప్పకుండా సమీక్షిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా,
స్టాలిన్‌కు ఫోన్ చేసి తుపాను ప్రభావం గురించి తెలుసుకున్నారు. రాష్ట్రానికి
కావలసిన సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.
భారీ వర్షాల కారణంగా బేసిన్
బ్రిడ్జ్, వ్యాసార్పాడి మధ్య బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేసారు. చెన్నై సెంట్రల్
రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరే ఆరు రైళ్ళను రద్దు చేసారు. ఆ ప్రయాణికులకు టికెట్
మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని దక్షిణ రైల్వే ప్రకటించింది.
చెన్నైలో 14 సబ్వేలలో నీరు
నిలిచిపోవడంతో వాటిని మూసివేసారు. విమానాశ్రయంలోకి కూడా నీరు చేరింది. దాంతో రన్‌వేను
మంగళవారం ఉదయం వరకూ మూసివేసారు. నగరం నుంచి బయల్దేరే 12 దేశీయ విమానాలు, 4
అంతర్జాతీయ విమానాలను రద్దు చేసారు. నగరంలోకి రావలసిన అంతర్జాతీయ విమానాలను
బెంగళూరుకు మళ్ళించారు.
తుపాను ప్రభావిత
విలుప్పురం, మైలాడుతురై, నాగపట్టణం, తిరువళ్ళూరు, కడలూరు, చెంగల్పట్టు జిల్లాల్లో
8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. చెన్నైలోని లోతట్టు ప్రాంతాలకు
వరదముప్పు తగ్గించడానికి, నగరం బైట ఉన్న చెంబరంబాకం రిజర్వాయర్ నుంచి నీటి
విడుదలను 1500 క్యూసెక్కులకు తగ్గించారు.