Cyclone Michaung to landfall near
Nizampatnam on Tuesday
బంగాళాఖాతంలోదక్షిణ ఆంధ్రప్రదేశ్,
ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో ఉన్న మిగ్జాం తుపాను తీవ్రతుపానుగా బలపడింది. ఈ
తీవ్రతుపాను చెన్నైకి తూర్పు ఈశాన్యముగా 90 కిలోమీటర్ల దూరంలోను, నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలోను, బాపట్లకు ఆగ్నేయ దిశలో 300 కిలోమీటర్ల దూరంలోను, మచిలీపట్నానికి దక్షిణదిశలో
320 కిలోమీటర్ల దూరంలోను
కేంద్రీకృతమై ఉంది.
ఈ తీవ్రతుపాను
ఉత్తరదిశగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలైన నెల్లూరు, మచిలీపట్టణాలకు సమాంతరంగా
ప్రయాణం కొనసాగిస్తూ డిసెంబర్ 5మధ్యాహ్నంలోగా బాపట్ల
చేరువలో నిజాంపట్నం దగ్గర తీరం దాటే అవకాశముంది. ఆ సమయంలో స్థిరమైన ఈదురు గాలులు గరిష్టంగా
గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వీచవచ్చు. తీరం దాటాక మంగళవారం అర్ధరాత్రికి
మరింత బలహీనపడి వాయుగుండంగా మారవచ్చు. దీని ప్రభావం వల్ల రాయలసీమ కోస్తాంధ్ర
జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది.
మిగ్జాం తీవ్రతుపాను
ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు,
పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా కురుస్తున్న వర్షాలు కొనసాగే
అవకాశముంది. అలాగే ఉత్తరాంధ్రలో ఒకమోస్తరు నుంచి విస్తారంగా పడుతున్న వర్షాలు కొనసాగవచ్చు.
తుఫాను ప్రభావిత
8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర
ఉన్నతాధికారులతో సీఎం వైయస్జగన్మోహన్
రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
తుపాను నేపధ్యంలో చేపడుతున్న సహాయ,
పునరావాస కార్యక్రమాలను అధికారులు
ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటివరకు సుమారు లక్ష టన్నుల ధాన్యం సేకరించారు. మరో
6.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత
ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. అత్యవసర ఖర్చుల కోసం ప్రతీ జిల్లాకు రూ.2
కోట్లు నిధులు విడుదల చేసినట్లు సీఎం చెప్పారు. ఖరీప్ పంటలు కాపాడుకోడానికి ప్రాధాన్యమివ్వాలని
సూచించారు. తుపాను షెల్టర్లలో ఆశ్రయం పొందే వారికి ఇళ్ళకు వెళ్ళేటప్పుడు వ్యక్తులకు
రూ. వెయ్యి, కుటుంబాలకు రూ. 2500 ఇవ్వాలని ఆదేశించారు. వర్షాలు తగ్గిన వెంటనే
నష్టాన్ని అంచనా వేయాలని నిర్దేశించారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ 8
జిల్లాల్లో 181 సహాయ పునరావాస కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేసారు. మొత్తంగా 308
సహాయ పునరావాస శిబిరాల ఏర్పాటుకు గుర్తించామని అధికారులు చెప్పారు. 5 ఎన్డీఆర్ఎఫ్, మరో 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నారు.
తుపాను ప్రభావిత
జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. తిరుపతి జిల్లాకు జె.శ్యామలరావు,
నెల్లూరు జిల్లాకు హరికిరణ్, ప్రకాశం జిల్లాకు ప్రద్యుమ్న, బాపట్ల జిల్లాకు కాటమనేని
భాస్కర్, పశ్చిమ గోదావరి జిల్లాకు కన్నబాబు, కోనసీమ జిల్లాకు జయలక్ష్మి, కాకినాడ జిల్లాకు
యువరాజ్, తూర్పుగోదావరి జిల్లాకు వివేక్ యాదవ్ ప్రత్యేక అధికారులుగా
వ్యవహరిస్తారు. తుపాను బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు, ఇతర కార్యాచరణను ఈ
అధికారులు సమన్వయం చేస్తారు.
రాష్ట్రంలోని
దాదాపు అన్ని జిల్లాల్లోనూ పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు.