BJP miraculous victory in Chattisgarh
ఛత్తీస్‌గఢ్ శాసనసభకు
ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచీ అక్కడ భారతీయ జనతా పార్టీకి విజయావకాశాలు లేవనే
దాదాపు అందరూ భావించారు. కనీసం పోటీ అయినా ఇవ్వగలిగే దశలో ఉంటుందని ఎవరూ
అనుకోలేదు. అందుకే ఎగ్జిట్ పోల్స్‌లో సైతం బీజేపీపై ఎలాంటి అంచనాలు లేవు. ఆఖరికి
బీజేపీ సైతం ఛత్తీస్‌గఢ్ ఫలితాలపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ అంచనాలన్నీ
తారుమారు అయ్యాయి.
90 నియోజకవర్గాల
ఛత్తీస్‌గఢ్ శాసనసభలో 54 స్థానాలు గెలుచుకుని బీజేపీ స్పష్టమైన మెజారిటీ
సాధించింది. కాంగ్రెస్ 35 స్థానాలకు పరిమితమైంది. గోండ్వానా గణతంత్ర పార్టీ ఒక
సీటుతో ఉనికి నిలబెట్టుకుంది.
బీజేపీ విజయాన్ని
నిర్వచించగలిగిన గెలుపంటే సజ్జా నియోజకవర్గంలో ఈశ్వర్ సాహు గెలుపే. ఏప్రిల్ నెలలో
సజ్జా నియోజకవర్గం పరిధిలోని బిరాన్పూర్లో మతఘర్షణల్లో హత్యకు గురైన యువకుడి
తండ్రే ఈశ్వర్ సాహు. ఆయన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
రాజనంద్‌గావ్‌లో ఒక సభలో ఈశ్వర్ సాహు పేరును ప్రకటిస్తూ ‘ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్
మరోసారి గెలిస్తే ఇలాంటి మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాలనే కొనసాగిస్తుంది’ అని అమిత్
షా వ్యాఖ్యానించారు. ఈశ్వర్ సాహు దుఃఖాన్ని ఛత్తీస్‌గఢ్ ప్రజలు తమదిగా భావించారు.
అందుకే కాంగ్రెస్ మంత్రి రవీంద్ర చౌబే మీద 5వేల ఓట్ల ఆధిక్యంతో సాహు విజయం
సాధించారు.
గత ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ సాధించింది. 68మంది ఎమ్మెల్యేలతో భూపేష్ బఘేల్
ప్రభుత్వం పూర్తిస్థాయి అధికారాన్ని అనుభవించింది. ఆ పరిస్థితి ఒక్కసారిగా
తలకిందులైపోయింది. బఘేల్ ప్రభుత్వంలోని మంత్రులు చాలామంది ఓటమి పాలయ్యారు. స్వయంగా
భూపేష్ తన పాటన్ నియోజకవర్గంలో ఒకదశలో వెనుకంజలో ఉన్నారు. ఎట్టకేలకు 20వేల కంటె
తక్కువ ఓట్ల ఆధిక్యంలో గెలిచి బతుకుజీవుడా అనుకున్నారు. ఇలాంటి ఓటమిని కాంగ్రెస్
అసలు ఊహించనే లేదు.
అందుకే కాంగ్రెస్
ఎన్నికల ప్రచారంలో చాలా విశ్రాంతిగా ఉంది. బీజేపీ ప్రచార సరళిని ఏమాత్రం
పట్టించుకోలేదు. ఆఖరికి, రాష్ట్రంలో ప్రతీ పెళ్ళయిన మహిళకూ నెలకు వెయ్యి రూపాయల
చొప్పున భత్యం ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చినా కాంగ్రెస్ నాయకత్వం పది రోజుల పాటు
పట్టించుకోనే లేదు. క్షేత్రస్థాయి అభ్యర్ధులు బీజేపీ హామీ వల్ల తమకు జరుగుతున్న
నష్టాన్ని గ్రహించి చెప్పేవరకూ ముఖ్యమంత్రి బఘేల్ ఆ విషయాన్ని గ్రహించలేదు.
చివరికి, పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు భూపేష్ బఘేల్ కొత్త పథకాన్ని ప్రకటించారు.
పెళ్ళితో సంబంధం లేకుండా మహిళలు అందరికీ నెలకు రూ.1250 భత్యం ఇస్తానని హామీ
ఇచ్చారు. కానీ అప్పటికే కాలాతీతమైపోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
బీజేపీ కార్యకర్తలు
చాలా కష్టపడ్డారు. ప్రతీ ఇంటికీ వెళ్ళారు. సుమారు 50లక్షల మంది మహిళలతో భత్యం కోసం
దరఖాస్తులు భర్తీ చేయించారు. అప్పటికి కూడా కాంగ్రెస్ తమ పథకం గురించి కనీసం
ప్రచారం చేసుకోలేదు. ప్రచారం ఆఖరి దశలో ఆ మహిళా భత్యమే అన్ని అంశాలనూ దాటివేసిందని
కాంగ్రెస్ ఇప్పుడు భావిస్తోంది.
భాజపా కార్యకర్తలు
అప్పటికి కూడా పార్టీ విజయం పట్ల ధీమాగా లేరు. కానీ ఒక్కసారి నరేంద్ర మోదీ, అమిత్
షా వచ్చి ప్రచారంలో పాల్గొన్నాక, బహిరంగసభల్లో ప్రసంగించాక… పరిస్థితి పూర్తిగా
మారిపోయింది. భాజపా కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ఇక వారిని వెనక్కు
లాగగలిగిన వాడే లేకపోయాడు. బీజేపీ ప్రచారంలో ముందునుంచీ ధాటిగా నిలబడింది, దాదాపు
అన్ని నియోజకవర్గాల్లోనూ అత్యధికంగా ప్రచారం చేసింది. దాని ఫలితాలను అందుకుంది.
భూపేష్ బఘేల్ పాటన్
నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ చవిచూసారు. బీజేపీకి చెందిన విజయ్ బఘేల్, జేసీసీ
పార్టీకి చెందిన అమిత్ జోగిని ఎదుర్కొని 19,723 ఓట్ల తేడాతో గెలిచారు. ఆయనది
ఒకరకంగా మంచి గెలుపే. ఉపముఖ్యమంత్రి టి ఎస్ సింగ్‌దేవ్ అంబికాపూర్ నియోజకవర్గంలో
భాజపా అభ్యర్ధి రాజేష్ అగర్వాల్ చేతిలో కేవలం 94 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ
అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాజనంద్‌గావ్‌లో 45,084 ఓట్ల ఆధిక్యంతో
గెలిచారు. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అరుణ్ సావ్, లోర్మీలో 75,070 ఓట్ల
ఆధిక్యంతో గెలిచారు. కానీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్, మాజీ
అధ్యక్షుడు మోహన్ మర్కమ్ బస్తర్ డివిజన్లో ఓటమి చవిచూసారు.
బీజేపీ రాష్ట్ర పార్టీ
మాజీ అధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ్ సాయ్ కుంకురీ నియోజకవర్గం నుంచి
విజయం సాధించారు. ఐఏఎస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఓపీ చౌధరి రాయగఢ్‌లో 64,443
ఓట్లతో గెలిచారు. రాయపూర్ దక్షిణం నుంచి బ్రిజ్మోహన్ అగర్వాల్ లక్షకు పైగా ఓట్లతో
ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ స్పీకర్ చరణ్‌దాస్ మహంత్ శక్తి నియోజకవర్గం నుంచి
81,519 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అటవీశాఖ మంత్రి మహమ్మద్ అక్బర్ కవర్ధా స్థానంలో బీజేపీకి చెందిన విజయ్ శర్మ చేతిలో ఓటమి
పాలయ్యారు. హోంమంత్రి తామ్రధ్వజ్ సాహు దుర్గ్ గ్రామీణ నియోజకవర్గంలో బీజేపీకి
చెందిన లలిత్ చంద్రాకర్ చేతిలో ఓడిపోయారు.
కాంగ్రెస్ దారుణ ఓటమికి
ప్రధాన కారణాల్లో ఒకటి పార్టీలో అంతర్గత కుమ్ములాటలు. కొన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్ధుల
ఓటమికి వారి సహచర నాయకులే కారణమయ్యారని తెలుస్తోంది. అయితే అంతకంటె పెద్ద కారణం,
అవినీతి. భూపేష్ బఘేల్ ప్రభుత్వం అవినీతి గురించి భాజపా విస్తృతంగా ప్రచారం
చేసింది. బొగ్గు స్కామ్, మద్యం స్కామ్, డీఎంఎఫ్ ఫండ్ స్కామ్, పీఎస్సీ రిక్రూట్మెంట్
స్కామ్… ఇలా ప్రతీదీ కుంభకోణమే. ఆఖరికి ‘కాంగ్రెస్ వారు మహాదేవుణ్ణి కూడా
వదల్లేదు’ అని మోదీ చేసిన వ్యాఖ్యకి కారణం మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామే. అందుకే,
భూపేష్ బఘేల్ ప్రభుత్వ అవినీతిపై మోదీ విరుచుకుపడిన ప్రతీసారీ అది చాలా గట్టిగా
తగిలింది. ప్రత్యేకించి, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలు తీవ్ర
ప్రభావం చూపించాయి.
ఇంక కాంగ్రెస్ గ్రామీణ
ప్రాంతాలపై ఆశలు పెట్టుకుంది. వరికి అత్యధిక ధర, ఇతర సంక్షేమ పథకాల ప్రకటనలు తమకు
లాభిస్తాయని భూపేష్ బఘేల్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కానీ,
కాంగ్రెస్ హామీల కంటె బీజేపీ వాగ్దానాలపైనే ప్రజలు విశ్వాసం చూపించారని ఈ ఫలితాలను
బట్టి అర్ధమవుతోంది.
అలాగే, గ్రామీణ
ప్రాంతాల్లో మహిళలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసారు. 2018 ఎన్నికల వేళ
కాంగ్రెస్, రాష్ట్రంలో మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చింది. కానీ నిలబెట్టుకోలేదు.
అదే విషయాన్ని మోదీ, అమిత్ షా ప్రతీ ప్రచార సభలోనూ ప్రస్తావించారు. ఫలితంగా
ఛత్తీస్‌గఢ్ గ్రామీణ మహిళలు భాజపాను ఆదరించారు. అలాగే, ఆదివాసుల్లో కూడా కాంగ్రెస్‌పై
నమ్మకం లేకుండా పోయింది. భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు, రాష్ట్ర
ఓటరు జనాభాలో మూడోవంతు ఉన్న తమ ప్రయోజనాలను కాదని ఓబీసీల వైపు మొగ్గు చూపుతోందని
ఆదివాసులు భావించారు.
మరోవైపు భూపేష్ బఘేల్
ప్రభుత్వం గ్రామీణ ఛత్తీస్‌గఢ్‌పై దృష్టి సారించి పట్టణాలను విస్మరించింది.
నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసింది. రహదారులు, ఫ్లై
ఓవర్లు, ఇతర నిర్మాణాలను పూర్తిగా వదిలిపెట్టేసింది. దాంతో అర్బన్ ఓటర్లు
కాంగ్రెస్‌కు దూరమయ్యారు.
బీజేపీ ‘లక్కీ మ్యాజిక్
మ్యాన్’, జోనల్ ప్రధాన కార్యదర్శి అజయ్ జమ్వాల్ మౌనంగా తన పని చేసుకుంటూ పోయారు.
క్షేత్రస్థాయిలో ప్రతీ నియోజకవర్గాన్నీ కనీసం డజనుసార్లు సందర్శించారు. బూత్ స్థాయి
కార్యకర్తలు, ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసాన్ని పాదుకొల్పగలిగారు. అలాంటి
క్షేత్రస్థాయి కార్యకర్తల కృషే భాజపాను ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి తీసుకొచ్చింది.