BJP secures 2/3rds majority in Madhya Pradesh
మధ్యప్రదేశ్‌లో బీజేపీ
అద్భుతం సాధించింది. కాంగ్రెస్‌తో హోరాహోరీ పోరు జరుగుతుందన్న అంచనాలను అధిగమించి
ఘనవిజయం సొంతం చేసుకుంది. సాధారణ మెజారిటీ కాదు, మూడింట రెండొంతుల మెజారిటీ
సాధించి తిరుగులేని శక్తిగా నిలిచింది.
మధ్యప్రదేశ్‌లో మొత్తం
230 నియోజకవర్గాలున్నాయి. 116 స్థానాల్లో గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు
చేయగలదు. అక్కడ భారతీయ జనతా పార్టీ 163 స్థానాల్లో విజయం సాధించి ప్రత్యర్థులకు
అందనంత ఎత్తులో నిలిచింది. కాంగ్రెస్ 66 స్థానాలు మాత్రం దక్కించుకుంది. భారత
ఆదివాసీ పార్టీ ఒక స్థానంతో ఉనికి చాటుకుంది.
మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్
చౌహాన్ 18 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న భారతీయ జనతా
పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత భారీ స్థాయిలో ఉంటుందని విశ్లేషకులు అంచనాలు వేసారు. రెండు
పార్టీలూ వందకు పైగా స్థానాలు సాధిస్తాయనీ, దాంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు
జరుగుతుందని భావించారు. కానీ కథ వేరేలా మారింది. దానికి ప్రధాన కారణమేంటి?
మధ్యప్రదేశ్‌లో మోదీ
మ్యాజిక్ పనిచేసింది. కాంగ్రెస్ వాగ్దానాలకు ప్రతిగా ‘మోదీ కీ గ్యారంటీ’ పేరిట
బీజేపీ చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారు. ‘ఎంపీ కే మన్ మే మోదీ’ అన్న ప్రచార
గీతం ప్రజలను ఆకట్టుకుంది. రాష్ట్రంలోని ఓటర్లలో 50శాతం కంటె ఎక్కువ మంది మహిళలే
ఉన్నారు. బీజేపీ, శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ మహిళా ఓటర్లపై పెట్టుకున్న నమ్మకం వమ్ము
కాలేదు. ‘లాడ్లీ బెహనా’ పేరుతో ప్రకటించిన పథకం మహిళలను ఆకట్టుకుంది. మోదీ
చరిష్మాకు అది కూడా తోడయింది. ఫలితంగా బీజేపీ కమలానికీ, కాంగ్రెస్ కమల్‌నాథ్‌కూ
మధ్య పోరులో కాషాయ కమలమే వికసించింది. యాంటీ-ఇంకంబెన్సీ సెంటిమెంట్ పనిచేయలేదు.
వరుసగా ఐదోసారీ భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది.
ప్రధాని మోదీ
మధ్యప్రదేశ్‌లో 14 ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు. ‘మోదీ కీ గ్యారంటీ’ పట్ల
బీజేపీ చిత్తశుద్ధితో ఉందని, డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రానికి మేలు జరుగుతుందనీ
ప్రజలు విశ్వసించారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ నూటికి పైగా ప్రచార సభల్లో పాల్గొని ‘లాడ్లీ
బెహనా’ పథకం గురించి విస్తృతంగా వివరించారు. అది మహిళలను అమితంగా ఆకట్టుకుంది. ఇంక
బూత్ లెవెల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ కంటె బీజేపీ పటిష్టంగా పని చేసింది. కేంద్ర
హోంమంత్రి అమిత్ షా వ్యూహాలు బీజేపీకి మంచి ఫలితాలనిచ్చాయి.
మధ్యప్రదేశ్ బీజేపీ
ఎన్నికల వ్యూహ రచనలో అమిత్ షా కీలక పాత్ర పోషించారు. పార్టీలోని అంతర్గత అసంతృప్త
వర్గాలను సమర్ధంగా బుజ్జగించారు. బూత్ స్థాయి కార్యకర్తలతో ప్రత్యక్షంగా చర్చలు
జరిపారు. అవి పార్టీ క్యాడర్‌పై సానుకూల ప్రభావం చూపాయి. ఇనుమడించిన ఉత్సాహంతో
కార్యకర్తలు పనిచేసారు.
సిందియా ఫ్యాక్టర్ కూడా
గణనీయంగా పనిచేసింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చింది.
అయితే కాంగ్రెస్ గెలవడానికి ప్రధాన కారణంగా నిలిచిన జ్యోతిరాదిత్య సిందియాను ఆ
పార్టీ విస్మరించి కమల్‌నాథ్‌ను నెత్తికెత్తుకుంది. దాంతో సిందియా కాంగ్రెస్‌ను
వీడారు. 22మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు 2020లో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
ఆయన సొంత ప్రాంతమైన చంబల్-గ్వాలియర్ ప్రాంతం నిన్నమొన్నటివరకూ కాంగ్రెస్
కంచుకోటగా ఉండేది. ఇప్పుడీ ఎన్నికల్లో ఆ ప్రాంతం మొత్తం భాజపా వశమైంది. సిందియా
రాజవంశానికి విధేయంగా ఉన్న చంబల్-గ్వాలియర్ ప్రాంతంలోని గ్వాలియర్, శివపురి,
దతియా, అశోక్‌నగర్, గుణ, మొరేనా, భిండ్, శివపూర్ జిల్లాలు అన్నింటినీ బీజేపీ కైవసం
చేసుకుంది.
మహిళలతో పాటు రైతులు
కూడా బీజేపీని విశ్వసించారు. రైతులకు బీజేపీ ఇచ్చిన హామీలు వారిని ఆకట్టుకున్నాయి.
వరికి క్వింటాలుకు రూ. 3100, గోధుమలకు క్వింటాలుకు రూ. 2700 కనీస మద్దతు ధర
ఇస్తామన్న భాజపా హామీని రైతులు విశ్వసించారు. ఇంక కేంద్రప్రభుత్వపు కిసాన్ సమ్మాన్
నిధి పథకం కింద రైతుల ఖాతాల్లోకి నేరుగా సొమ్ములు పడుతుండడం ఆ విశ్వాసాన్ని
రెట్టింపు చేసింది.
కాంగ్రెస్ కూడా ఎన్నో
హామీలు ఇచ్చింది. ప్రధానంగా తొమ్మిది గ్యారంటీలు అంటూ ప్రచారం చేసింది. కానీ
ప్రజలు వాటిని నమ్మలేదు. గతంలో హామీలు ఇచ్చి, వాటిని నెరవేర్చని చరిత్ర కారణంగా
ప్రజలు కాంగ్రెస్ తాజా హామీలను విశ్వసించలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఉదాహరణకి, కాంగ్రెస్ పార్టీ గతంలో రైతులకు
రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ తమ పాలనా కాలంలో ఆ హామీని నెరవేర్చనే లేదు.
దాంతో రైతులకు కాంగ్రెస్ పట్ల నమ్మకం పూర్తిగా పోయింది. సమాజంలోని మిగతా వర్గాల్లో
కూడా కాంగ్రెస్ అలాగే తమ విశ్వసనీయతను కోల్పోయింది.
మరో ప్రధాన కారణం….
సనాతన ధర్మం మీద కాంగ్రెస్ మిత్రపక్షాలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, వాటిని
కాంగ్రెస్ కొన్నిసందర్భాల్లో నేరుగా సమర్ధించింది, లేదా చాలా సందర్భాల్లో
ఖండించకుండా మౌనంగా ఉండిపోయింది. ఆ వైఖరి హిందువుల మనోభావాలను గాయపరిచింది. అలాగే
భారతమాత ఎవరు అని స్వయానా రాహుల్ గాంధీ ప్రశ్నించడం దేశభక్తి కలిగిన సాధారణ ప్రజల
మనోభావాలను దెబ్బతీసింది. కాంగ్రెస్ పరాజయంలో ఈ అంశాలు కూడా కీలక పాత్ర పోషించాయి.
ఇలా, మొత్తంగా చూసుకుంటే
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చరిష్మా, రాష్ట్ర బీజేపీ ఇచ్చిన
హామీలు, అమలు చేసిన రాజకీయ వ్యూహాలు ఫలించాయి. కాంగ్రెస్ విశ్వసనీయతను కోల్పోవడం,
సనాతన ధర్మంపై ఆ పార్టీ ఉదాసీన వైఖరి… వారి పరాజయాన్ని పరిపూర్ణం చేసాయి.